నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోర్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ అధ్యక్షతన జరిగిన అధికారిక విచారణ తర్వాత, ఐసీసీ హారిస్ రౌఫ్‌కు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇదే మ్యాచ్‌లో సాహిబ్ జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ‘‘గన్ షాట్’’ వేడుకలు చేశాడు. దీనిపై కూడా ఫిర్యాదు వచ్చింది. అయితే, ఐసీసీ ఫర్హాన్‌ను హెచ్చరించి వదిలేసినట్లు పలు వార్త కథనాలు నివేదిస్తున్నాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్ సన్ శుక్రవారం మధ్యాహ్నం పాక్ జట్టు ఉన్న హోటల్‌లో తన విచారణ పూర్తి చేశాడు. హారిస్ రౌఫ్ చర్యలకు, మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించబడింది. దీనికి ముందు, హారిస్ రౌఫ్, ఫర్హాన్ ఇద్దరు తాము నిర్దోషులమని ఐసీసీ ముందు చెప్పారు. ఫర్హాన్ తన గన్ షాట్ వేడుకలనున పాకిస్తాన్‌లోని తన జాతీ ఫఖ్తూన్ తెగ జరుపుకునే సాంప్రదాయ వేడుకలుగా పేర్కొన్నాడు.