Thursday, July 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదేశంలో నిజంగా పేదరికం తగ్గిందా..?

దేశంలో నిజంగా పేదరికం తగ్గిందా..?

- Advertisement -


కేంద్రంలో మోడీ అధికారం చేపట్టి పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, పేదరికం తగ్గిందని, జీడీపీ పెరిగిందని బీజేపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు మాత్రం మరోలా వున్నాయి. బీజేపీ చెబు తున్న అభివృద్ధి ఎలా ఉందో ప్రతి ఏడాది ఫోర్బ్స్‌ విడుదల చేస్తున్న నివేదిక చూస్తే తెలిసిపోతుంది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో 2014 లో 70 మంది బిలియనీర్లు ఉంటే, 2025 నాటికి మూడు రెట్లు పెరిగి 205 మంది అయ్యారు. వీరి సంపద 206 బిలియన్‌ డాలర్ల నుండి 941 బిలియన్‌ డాలర్లకు (రూ.15.60 లక్షల కోట్ల నుండి రూ.78 లక్షల కోట్లు) పెరిగింది. దేశ జీడీపీ రెండు రెట్లు పెరిగితే, వీరి సంపద నాలుగు రెట్లు పెరిగింది. మిలియనీర్లు 2.5 లక్షల మంది నుండి 7.96 లక్షలకు పెరిగారు. పన్నుల మినహాయింపు, బ్యాంకు రుణాల రద్దు తదితర రూపాల్లో దోచిపెట్టడం మూలంగా వీరి సంపద ఒకేసారి పెరిగిపోయింది. దేశ సంపద ఒక్కశాతం మంది దగ్గర 51 శాతం పోగుబడి మిగిలిన 99శాతం మంది దివాలా తీశారు. ఇదే బీజేపీ ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి. కార్పొరేట్ల అభివృద్ధి.ప్రజలది కాదు.

పేదరికం తగ్గిందా?
నిన్నగాక మొన్న ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో పేదరికం 5.3 శాతానికి తగ్గింది. మరోవైపు సరైన తిండి లేక 70 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పేదరికం తగ్గితే, తిండి లేనివారు ఎలా పెరిగారు? అత్యంత పేదరిక దేశాల్లో రోజుకు 2.15 డాలర్లు (రూ.179.30) లోపు ఆదాయం వచ్చిన వారు పేదలు. మనలాంటి దేశాల్లో రోజుకు 3.15 డాలర్లు (రూ.262) ఆదాయం లేనివారు పేదలు. ఇది ప్రపంచ బ్యాంకు లెక్క. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.137, పట్టణాల్లో రూ.233 మాత్రమే సంపాదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చేసిన గృహ వినియోగదారుల సర్వే (హెచ్‌.సి.పి.ఎస్‌) తేల్చింది. అత్యంత పేద దేశాల్లో కన్నా మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంపాదన తక్కువ. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 61 శాతం మంది పేదలే. పట్టణాల్లో 3.15 డాలర్లు కన్నా తక్కువ సంపాదిస్తున్న వారందరూ పేదలే. కాబట్టి పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు చెప్పిన లెక్క తప్పు.

పేదరికం మూలంగా 52.6 శాతం మంది బాలలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి ఏదో ఒక రకమైన సమస్యతో బాధ పడుతున్నారని కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పింది. 70 శాతం మంది పౌష్టికాహార లోపంతో ఉన్నారని ఇప్పుడు గణాంక శాఖ చెప్పింది. అందుకే కేంద్ర ప్రభుత్వం పౌర సరఫరాల ద్వారా 81.30 కోట్ల మందికి 2028 వరకు ఉచితంగా ఐదు కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ 11 ఏళ్లలో కార్మికుల వేతనాలు 0.1 నుండి 1.1 శాతం మధ్య పెరిగాయి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే. నిత్యవసరాల ధరలు మాత్రం 63 శాతం, విద్య, వైద్యం, ఇతర ధరలు 180 శాతం పెరిగాయని వినియోగదారుల ధరల సూచిక చెప్పింది. ఈ పదకొండేళ్లలో కార్మికుల వేతనాలు పెరగలేదు. నిజవేతనాలు తగ్గాయి. ధరలు పెరిగాయి. మరి పేదరికం ఎలా తగ్గింది? ఈ వాస్తవాలను వదిలేసి నిటి ఆయోగ్‌ పేదరికం తగ్గిం దని చెప్పింది. దానినే ప్రపంచబ్యాంకు వల్లె వేసింది. పైవాస్తవాలను పరిగణించకుండా పేదరికం తగ్గిందని ప్రచారం చేయడం మోడీ ప్రభుత్వం ఆడుతున్న మరో పెద్ద అబద్ధం.

నిరుద్యోగ యువతకు ద్రోహం
2014 నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 22.03 కోట్ల మంది నిరుద్యోగులు (యు.పి.ఎస్‌.సి, ఐ.బి.పి.ఎస్‌ వంటి సంస్థలు ప్రకటించిన ఖాళీ పోస్టులకు) దరఖాస్తు చేశారు. వారిలో 7,22,311 (కేవలం 0.3 శాతం) మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఖాళీ పోస్టులే 9.64 లక్షలు. అంటే 11 సంవత్సరాలలో ఇచ్చిన ఉద్యోగాల కన్నా నింపకుండా మిగుల్చుకున్న ఉద్యోగాలే ఎక్కువ. పహల్గాం సమయంలో అవసరమైన సైనికులు మన దగ్గర లేరని, లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయని మాజీ సైనిక అధికారులు ఆందోళన చెందిన విషయం మనకు తెలుసు. రైల్వేలో 3.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటి, ఐఐఎం, ఐఐఐటి, ఎన్‌ఐటి వంటి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో 56.18 శాతం బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల్లో 2014లో 17.3 లక్షల ఉద్యోగులు ఉంటే 2024 నాటికి 14.6 లక్షలకు కుందించబడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా యువతను మోడీ ప్రభుత్వం మోసం చేస్తున్నది.

ఎం. సూర్యారావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -