ప్రశ్నిస్తే కేసులు పెడతావా.. డీజీపీగా నువ్వు చేసింది ఇదేనా! : మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పరామర్శ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, కంది
‘ఒక బీజేపీ నాయకుడు పోలీసు గల్లా పట్టి లాక్కరండి, తన్నండి అంటే వారిపై కేసులు పెట్టే దమ్ములేదు.. ఒక కాంగ్రెస్ నాయకుడు డ్యూటీలో ఉన్న పోలీసులను తిడితే అరెస్టు చేయలేరు.. కేసులు పెట్టే దమ్ములేదు.. ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారా.. ఖాకీ బుక్కు కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా’ అంటూ డీజీపీ శివధర్ రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని కంది జైలులో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మానిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యాతన్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసులు పెడతారు, ఆమన్‌గల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెడతారు.. అక్కడ ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల అధికారుల ముందే బీఆర్‌ఎస్ కార్యకర్తను బెదిరించినా కేసులు ఉండవా అని డీజీపీ ప్రశ్నించారు.
ఆటో తగలబెడితే కేసు పెట్టలేదని, కార్యకర్త కాలుమీద నుంచి కారు ఎక్కించి దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టి ఎందుకు అరెస్టు చేయరని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. ఎంతమందిపై కేసులు పెడతారని ప్రశ్నించారు. ఇదేనా రాష్ట్రాన్ని కాపాడేదని, చట్టం సీఎంకు చుట్టంగా మారిందని అన్నారు. చట్టం, ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు 800 కౌన్సిలర్లు, 20 చైర్మెన్లు గెలిచిందని, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులతో బయపెట్టి కొన్ని చైర్మెన్లను గుంజుకున్నరని ఆరోపించారు. ముస్లీం మహిళపై దాడి చేసిన గన్‌మెన్‌పై చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు. వెంటనే పోలీసుల తీరు మార్చుకోవాలని, లేనిచో మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.


