Saturday, February 14, 2026
E-PAPER
Homeజాతీయంవిద్వేష రాజకీయం

విద్వేష రాజకీయం

- Advertisement -

మతం, జాతీయత చుట్టూ బీజేపీ నేతల ప్రసంగాలు
మోడీ, యోగి, హిమంత శర్మలదీ అదే దారి
శత్రువులను సృష్టించి మరీ ప్రజల్లో విభజనలు
క్రీడలకూ పాకిన పాలిట్రిక్స్‌
మేధావులు, విశ్లేషకులు, పరిశీలకుల ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు, ద్వేష రాజకీయాలు ప్రపంచ దేశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది అన్ని దేశాలకూ ఒక హెచ్చరికగా నిలుస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. తమ రాజకీయ లబ్ది కోసం శుత్రువులను సృష్టించి ప్రజల్లో విభజన కలిగించే ధోరణి ట్రంప్‌ పాలనలో అమెరికాలో.. మోడీ ప్రభుత్వంలోని భారత్‌లోనూ కనిపిస్తున్నదని అంటున్నారు.

అయితే ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పబడే ఈ రెండు దేశాలలో ఈ విధమైన ద్వేషభావన అక్కడి ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని వివరిస్తున్నారు. ట్రంప్‌ శైలి భారత్‌కు ఏ మాత్రమూ మంచిది కాదనీ, అలాంటి ద్వేషపూరిత రాజకీయాలక స్వస్తి పలకాలని మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు.

న్యూఢిల్లీ : భారత్‌లోని ప్రజల్లో జాతీయత, మతం పేరుతో కోపం, ద్వేషం రగిలించేందుకు బీజేపీ నాయకులు ఒక వర్గాన్ని, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటున్న పరిస్థితులు తరచూ కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రజాస్వామ్య సంస్కృతిని బలహీనపరుస్తుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. బీజేపీ, ఆ పార్టీ అగ్రనాయకులు వ్యవహరిస్తున్న తీరు, ట్రంప్‌ శైలికి ఏ మాత్రమూ తీసిపోని విధంగా ఉన్నదని వివరిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సాక్షాత్తూ ప్రధాని మోడీ ముస్లింలను టార్గెట్‌ చేసుకుంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారనీ, ఆయన బాటలో ఇతర బీజేపీ అగ్రనాయకులు, నేతలు నడుస్తున్నారని గుర్తు చేస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ద్వేషపూరిత రాజకీయాల్లో ముందున్నారు. 80:20 అంటూ, రాళ్లు విసిరేవారు అనే పదాలను వినియోగిస్తూ ఓ వర్గం ప్రజలను టార్గెట్‌ చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు.

ఆయన తన వ్యాఖ్యలతో హిందూ, ముస్లింల మధ్య విభజన తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఇక బుల్డోజర్‌ రాజకీయాలతో ఓ వర్గం వారిని అక్రమ వలసదారులుగా చిత్రీకరించారనీ, ఇది ఆ వర్గం ప్రజలపై ఒక చెడు మచ్చని వేసిందని అంటున్నారు. అసోం ముఖ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ మరో అడుగు ముందుకేసి ముస్లింలను ‘మియా’ వంటి పదాలతో సంబోధిస్తున్నారు. ఇక్కడ కూడా ముస్లింలను అక్రమ వలసదారులుగా చిత్రీకరించే చర్యలకు ఆయన దిగారని పరిశీలకులు చెప్తున్నారు. అసోంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమ నివాసితుల ఇండ్ల కూల్చివేతల పేరిట ద్వేష రాజకీయాలకు తెరలేపారని చెప్తున్నారు. హిందూ-ముస్లిం విభజనే కాదు.. భారత్‌-పాక్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ పేరిట ప్రజలను రెచ్చగొట్టడం జరుగుతోందని అన్నారు.

ఇటీవల అసోం మాజీ ముఖ్యమంత్రి గౌరవ్‌ గొగోయ్ పై హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలు కూడా ఇందులో భాగమని వారు అంటున్నారు. ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న హిమంత బిశ్వ శర్మ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కలు సమీపిస్తున్న తరుణం లోనే ఇలాంటి ఆరోపణలు చేయటం దేనికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీతో పాటు అధి కారాన్ని పంచుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చ గొడుతున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఈ విపరీత ధోరణి కనిపిస్తున్నది. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఆలోచనను ఎప్పుడూ మతం, జాతీయ భావన అనే సున్నిత అంశాల చుట్టే తిప్పుతూ రాజకీయ లబ్ది పొందడంలో బీజేపీ సఫలీకృతం అవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. దేశ అభివృద్ధి గురించి ఆలోచించే యువతను కూడా సున్నిత అంశాలపై రాజకీయం పేరుతో వారి దృష్టిని మళ్లిస్తున్నారని అంటున్నారు.

క్రికెట్‌లోనూ రాజకీయల ప్రభావం
భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను జాతీయ గౌరవం, రాజకీయ సందేశాల వేదికగా మార్చడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత తీవ్రమైందని చెప్తున్నారు. కళలకు కూడా విద్వేష రంగు పులమడం కాషాయపార్టీ చేస్తున్నదని అంటున్నారు. క్రీడలను రాజకీయ ద్వేషానికి వేదిక చేయడం సముచితం కాదని వారు సూచిస్తున్నారు.

ప్రజాస్వామ్య ప్రమాణాల తగ్గుదల
రాజకీయాల్లో సంయమనం, మర్యాద, రాజ్యాంగ విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. మోడీ పాలనలో అది తీవ్రస్థాయికి చేరిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ తన ప్రజాస్వామ్య ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంతో ముందుకు సాగాలంటే రాజకీయ సంస్కృతిలో రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం చాలా అవసరమని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -