విద్వేషం ఎప్పుడూ రగులుతూనే ఉండాలి. విధ్వంసం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అలా జరగకపోతే వారి హృదయాలు శాంతించవు. ప్రజల్లో నిత్యం విధ్వంసం, విద్వేషాలను రగిలించడం ద్వారా ఓట్లు దండుకునే పన్నాగాలను అవపోసన పట్టిన వారు ఆ పనిలో అనుక్షణం నిమగమయ్యే ఉంటారు. అదే హిందూత్వవాదుల అజెండా. ”ఎక్కడ ఎన్నికలు మొదలవుతాయో! ఎక్కడ అధికారం కోసం తమ బాహువులను చాస్తుందో! అక్కడ కచ్చితంగా మత విద్వేషం రగులుకుంటుంది. ఉన్మాదం తలలెత్తుతుంది.” ఇది అక్షరాలా ఆచరిస్తూ ఉన్నది కాషాయ పరివారం.దానికి తాజా ఉదాహరణ ఆదివారం కోల్‌కతా వేదికగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.
ఈ దేశానికి రెచ్చగొట్టే మాటలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు కొత్తకాదు కానీ, వాటికి పాల్పడేవారికి రాజ్యమే అండగా నిలవడం, వెన్నుతట్టి ప్రోత్సహించడం ఇటీవల పరిపాటిగా మారింది. ఆరెస్సెస్ వందేండ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో భారీసభలో ఆరెస్సెస్ చీఫ్ ”సూర్యుడు తూర్పున ఉదయించడానికి రాజ్యాంగ ముద్ర అవసరం లేనట్లే.. హిందుస్థాన్ హిందూ దేశం అనడానికి కూడా ఎవరి ఆమోదమూ అక్కర్లేదు” అంటూ ‘దేశ సాంస్కృతిక అస్తిత్వం’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కళ్లద్దాలతో ఆరెస్సెస్‌ను చూడొద్దని చెబుతూ ఆయన మాత్రం అదే ఆరెస్సెస్ కళ్లద్దాలతోనే దేశాన్ని చూస్తుండటంలో వింతేమిలేదు.
స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు, భిన్నత్వాన్ని ప్రతిబింబించే విధంగా భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. దేశాన్ని భిన్న జాతుల సమ్మేళనం(యూనియన్ ఆఫ్ ఇండియా)గా రాజ్యాంగం పేర్కొంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం రాజ్యాంగ మౌలిక లక్ష్యాలుగా ప్రకటించబడ్డాయి. పౌరుని ప్రాథమిక హక్కులను చట్టబద్ధం చేసింది. పౌరసత్వా నికి కులం, మతం, భాష, లింగంతో సంబంధంలేదని స్పష్టం చేసింది. ఆదివాసులు, వెనకబడిన ప్రాంతాల ప్రజల భూమికి రక్షణలు కల్పించింది. దళితులు, ఆదివాసీలకు విద్య, ఉద్యోగం, చట్టసభల్లో తగు ప్రాతినిధ్యాలకు రిజర్వేషన్లు కల్పించింది. అలాంటి రాజ్యాంగాన్ని చడీ చప్పుడూ లేకుండా ఇష్టానుసారం ఉల్లంఘించడం, ఎద్దేవా చేయడం సంఫ్‌ు పరివార్ ఎప్పటి నుంచో చేస్తున్న పని. అసలు చాలాకాలంపాటు రాజ్యాంగాన్నే వారు అంగీకరించలేదు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఆరెస్సెస్ అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగాన్ని తూర్పార పడ్తూనే ఉంది. గోల్వార్కర్ దగ్గర నుంచి ప్రస్తుత మోహన్ భగవత్ వరకు నేతలందరూ రాజ్యాంగాన్ని కించ పరుస్తూనే వచ్చారు. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు.
ఆరెస్సెస్ ప్రార్థనలో ప్రజాస్వామ్య, సెక్యులర్ రాజ్యాంగం మీద విద్వేషం వెళ్లగక్కుతూనే ఉంటారు. స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు విడుదలైన వారి అధికార పత్రిక ”ఆర్గనైజర్”లో అసలు మన జాతి నిర్మాణాన్నే తూలనాడారు. హిందుస్థాన్ హిందువులది మాత్రమేనన్నది వారు ప్రగాఢంగా నమ్ముతుంది. దేశ నిర్మాణం ఆ పునాదిపైనే నిర్మించాలని సంఫ్‌ు పరివార్ అభిలాష. హిందూ సంప్రదాయాలు, సంస్కృతి, భావనలు, ఆకాంక్షలే వ్యక్తం కావాలన్నది దాని ఆలోచన. అందుకే మోహన్ భాగవత్ ”భారతదేశం హిందూ దేశం కావడానికి పార్లమెంటు చట్టాలు చేయాల్సిన పని లేదంటూ రాజ్యాంగ పీఠికలో ఆ పదాన్ని చేర్చినా, చేర్చకపోయినా మాకు అభ్యంతరం లేదు” అని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే సమాజంపై ‘మత’ విషాన్ని చిమ్మడం కాదా.
మోహన్ భగవత్ చెప్పినట్టు లౌకిక భారతం కాస్త హిందూదేశం అయితే భవిష్యత్తులో అనేక తరాల వారు ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, న్యాయవ్యవస్థ స్వతంత్రత లాంటి మాటలను మరిచి పోవాల్సిందే. ఈ మౌలిక అంశాలను పరిరక్షించే బాధ్యత భారత పౌరులదే. ఆ తానులో నుంచే వచ్చిన మన ప్రధానమంత్రి కూడా భారత రాజ్యాంగాన్ని తూలనాడిన వారే. అతుకుల బొంతగా అభివర్ణించిన వారే. కాబట్టి జాతీయోద్యమ లక్ష్యాలకు, ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్న ఇలాంటి వారిపై మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిందే. దేశ సంపదను కాపాడుకోవాలన్నా, దేశాభివృద్ధిని, ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు రక్షించుకోవాలన్న ఉద్యమాలే మార్గం.
ద్వేషోపన్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



