Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికాలో భారతీయ టెకీలపై ద్వేషభావం

అమెరికాలో భారతీయ టెకీలపై ద్వేషభావం

- Advertisement -

చొరబాటుదారులు, దొంగలు అంటూ నిందలు
ఎన్ని సేవలు అందించినా గుర్తింపులేని ఉద్యోగాలు
‘మాగా’ ఉద్యమకారుల్ని సంతోషపెట్టేందుకు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న ట్రంప్‌

న్యూఢిల్లీ : అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా ఎంత శక్తివంతమైనదైనప్పటికీ దానికీ భయాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత… 1950, 1960 దశకాల్లో అమెరికన్లు సోవియట్‌ కమ్యూనిస్టులకు భయపడ్డారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌-అమెరికన్లు మొదలు స్వలింగ సంపర్కుల వరకూ, దేశంలోని హిస్పానిక్‌ సమూహాల నుంచి ఆసియన్ల వరకూ… ఈ విధంగా ఎందరినో చూసి అమెరికా భయపడింది. ఇప్పుడు దానికి భారతీయ సాంకేతిక నిపుణులు (టెకీలు) అంటే భయం పట్టుకొని వారిని శత్రువులుగా చూస్తోంది.

‘మాగా’ ఉద్యమకారులను సంతోషపెట్టేందుకే…
నిజం చెప్పాలంటే మన దేశానికి చెందిన టెకీలు అమెరికాకు అందిస్తున్న సాంకేతిక సేవలు ఎనలేనివి. అయినప్పటికీ అమెరికా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉంటున్న, సిలికాన్‌ వ్యాలీలో ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ టెకీలు ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వం నుంచి దాడిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ తన మాగా ఉద్యమకారులను సంతోషపెట్టే ప్రయత్నంలో భారతీయ ఇంజినీర్లు, కోడర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారు అమెరికాలో ప్రవేశించేందుకు ఉపకరించిన హెచ్‌-1బీ వీసా పథకం నేడు అసాధారణ శల్యపరీక్షకు గురవుతోంది. కొత్తగా హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే వారు లక్ష డాలర్ల ఫీజు సమర్పించుకోవాల్సి వస్తోంది. వారి సోషల్‌ మీడియా ఖాతాలపై తీవ్రమైన నిఘా పెడుతున్నారు. జాత్యాహంకార ధోరణులు సరేసరి. ఇలా వారు దాటాల్సిన అడ్డంకులు ఎన్నో ఉంటున్నాయి.

ప్రబలుతున్న జాత్యాహంకార ధోరణులు
భారతీయ టెకీలకు వ్యతిరేకంగా మాగా ఉద్యమకారులు చేస్తున్న వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. మన టెకీలు ఉద్యోగాలను దొంగిలిస్తున్నారట. వారిలో నైపుణ్యం తక్కువగా ఉంటుందట. అసలు హెచ్‌-1బీ వీసా పథకమే ఓ కుంభకోణమట. అమెరికాలో భారతీయులు లేదా భారత సంతతికి చెందిన వారికి వ్యతిరేకంగా జాత్యాహంకారం బాగా పెరిగిపోయింది. హెచ్‌-1బీ వీసా పథకంలో చేసిన మార్పులు అక్కడ భారతీయులకు ఉన్న స్థానమేమిటో చెబుతున్నాయి. మన టెకీల పైన్న ఉన్న ద్వేష భావం క్రమేపీ ప్రధాన స్రవంతిలో ప్రవేశించింది. ప్రభావవంతమైన భారతీయ అమెరికన్లు సైతం లక్ష్యంగా మారిపోయారు. హెచ్‌-1బీ వీసా పథకంలో చేసిన మార్పులు భారతీయుల పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చేశాయని న్యూయార్క్‌లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెకీల భవిష్యత్తు వ్యక్తిగత పనితీరు, భాగస్వామ్యం కంటే విధానపరంగా జరిగే మార్పులపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. అధిక జీతం పొందుతున్న వారిని ప్రోత్సహించడం, చౌకగా లభించే ఉద్యోగులను నిరుత్సాహపరచడం వంటి మార్పులను ఆయన ఉదహరించారు.

ప్రముఖులను సైతం వదలడం లేదు
చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే అమెరికా సంస్థల తమ వద్ద పనిచేస్తున్న భారతీయ టెకీల గుర్తింపును గోప్యంగా ఉంచాల్సి వస్తోంది. దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పే విషయంలో కూడా ద్వేషభావం స్పష్టంగా కన్పించింది. అమెరికన్లు లక్ష్యంగా చేసుకున్నది కేవలం హెచ్‌-1బీ వీసా హోల్డర్లనే కాదు. ఎఫ్‌బీఐ చీఫ్‌ కష్‌ పటేల్‌, రాజకీయవేత్త, దౌత్యవేత్త నిక్కీ హేలీ వంటి ప్రముఖులను కూడా స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా వందలాది శ్వేతజాతి ఆధిపత్య ఖాతాలు సూచించాయి. గత దశాబ్ద కాలంలో ఆన్‌లైన్‌లో భారతీయులపై విద్వేష భావన బాగా పెరిగిపోయిందని పరిశోధకులు గుర్తించారు. భారతీయులను చొరబాటుదారులుగా, ఉద్యోగాల దొంగలుగా చిత్రించే పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కమూనిస్టులను ఆ నాడు ఎలా చూశారో ఇప్పుడు మన టెకీలను కూడా అలాగే చూస్తున్నారు.

ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు
భారతీయ టెకీలు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారన్న భయం ఇప్పుడు అక్కడ బాగా పెరిగిపోయింది. అమెరికాలో వలస వ్యతిరేక ధోరణులు ప్రబలిపోయాయి. భారతీయులపై జాత్యాహంకారం కూడా పెరిగింది. రాబోయే ఏడాదిలో భారతీయులను, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చునని క్రిస్మస్‌ సందర్భంగా అమెరికా పాత్రికేయుడు మాట్‌ ఫోర్నీ బాహాటంగానే హెచ్చరించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులందరినీ స్వదేశానికి పంపే అవకాశం ఉన్నదని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు అమెరికాలో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆ సమయంలో సోవియట్‌ రష్యా, చైనా, క్యూబా, తూర్పు జర్మనీలకు చెందిన కమ్యూనిస్టులను అమెరికాలో బాగా ద్వేషించారు. వారంటే భయపడ్డారు. జీవిత భాగస్వాములపై కూడా నిఘా పెట్టారు. తెల్లని చర్మం కింద ఎరుపు రంగును దాచి పెట్టారేమోనని అనుమానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -