నేను జీవితంలో చేసిన అతి పెద్ద నేరం ఏంటంటే బ్రెండా గోరింగుని హత్య చెయ్యడం. ఆమె అనవసరంగా నాకూ, నా భార్యకు మధ్య చిచ్చు రేపింది. అలా అని ఆమె చెడ్డదేమీ కాదు. నా భార్య లారాకు ఆమె ప్రాణ స్నేహితురాలు. ఆమె వల్లే నా భార్య లారాకు నాకూ బాగా దూరం పెరిగింది. నా భార్యకు మళ్ళీ దగ్గర కావాలనే నేను ఆమెను హత్య చేశాను.
హత్య చేసే ముందు నేనేమీ పెద్దగా ఆలోచించలేదు కానీ చేసిన తరువాత ఇప్పుడు నాకు పడబోయే జైలు శిక్ష గురించి బాగా భయం వేస్తోంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేమిటి చెప్పండి? అదేదో ముందుగానే ఆలోచించుకోవలసింది.
బ్రెండా నాకు రెండేళ్ల నుంచి తెలుసు. అంతకు మునుపు ఆమె ఎవ్వరో నాకు తెలియదు. ఆమెకు ఇదివరకెప్పుడో పెళ్లయింది కానీ, తరువాత ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు విడాకులివ్వడం కోసం ఆమె భర్త ఆమెకు బాగానే డబ్బులు ముట్టచెప్పాడనీ నాకు చాలామంది చెప్పారు. అతను ఇచ్చిన డబ్బుతో కొంత భాగం వెచ్చించి ఓ మంచి ఇల్లు కొనుక్కొని, మిగతా డబ్బుని బ్యాంకులో వేసుకొని హాయిగా జీవితాన్ని గడిపేస్తోంది.
బ్రెండాకి ముప్పై ఐదేళ్లు ఉంటాయి కానీ చాలా పొడవుగా, తెల్లగా, అందంగా ఉంటుంది. ఆమె మేముంటున్న కాలనీలోనే ఉండేది. ఆమెకు రాను రాను నా భార్యతో స్నేహం కుదిరింది. దానికి కారణం నా భార్య కూడా ఆమె వయస్కురాలు కావడమే కాకుండా, ఆమె ఉద్యోగం చెయ్యడం లేదు. అందుకే ఇద్దరికీ బాగా స్నేహం కుదిరింది. కానీ బ్రెండా అంటే మా కాలనీలో ఎవ్వరికీ మరీ ముఖ్యంగా ఆడవారికి పడదు. బ్రెండా అందంగా అలంకరించుకుని పార్టీలకు, పెళ్ళిళ్ళకూ వచ్చినపుడు మా కాలనీలోని భర్తలందరూ ఆమెనే చూడటం, ఆమెతో మాట్లాడటం నా భార్య లారాతో సహా ఎవరికీ నచ్చేది కాదు.
నా భార్య లారా చాలా మంచిది. చాలా తెలివైనది. నేను ఆమెతో చాలా ప్రేమగా ఉండేవాడిని. ఆమె అమ్మ నాన్నలిద్దరూ లెక్చరర్లు కావడంతో ఆమెను చాలా బాగా పెంచారు. అయితే నేను నా ఉద్యోగ బాధ్యతల వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండకపోవడం వల్ల ఆమెకు స్నేహితురాలు అవసరమై బ్రెండాతో స్నేహం చేసింది.
అయితే ఆ స్నేహం నేను లేని సమయం అయిన పగలంతా ఉంటే నాకేం ఇబ్బంది ఉండదు. అప్పుడు నేను ఏ అభ్యంతరం పెట్టి ఉండేవాడిని కాను. కానీ వాళ్ళ స్నేహానికి, బాతాఖానీలకు ఉదయం, రాత్రి తేడా ఉండకపోవడంతో నాకు నచ్చేది కాదు. నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆమె మా ఇంట్లోనే ఉండేది. బ్రెండా మాటలంటే నా భార్య చెవులు కోసుకునేది. వాళ్ళిద్దరి మాటల్లో ప్రపంచంలోని రాజకీయాలు దగ్గరనించి భార్యాభర్తల అక్రమ సంబంధాల వరకూ అన్నీ చర్చకు వచ్చేవి. అయితే ఈ మాటలన్నీ చెప్పేది బ్రెండా. లారా శ్రోతగా ఉంటూ ఆమె మాటల్ని శ్రద్ధగా వింటూ ఉండేది. ఇదే నాకు నచ్చేది కాదు.
నేను అలసి పోయి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మోకాళ్ళ వరకూ స్కర్టు వేసుకొన్న బ్రెండా సోఫాలో పడుకొని సిగరెట్ తాగుతూ, పొగ గాల్లోకి సుడులు సుడులుగా వదులుతో, చేతిలో మద్యం సీసాతో మాట్లాడుతుంటే లారా ఆసక్తిగా ఆ మాటలు వింటున్న దశ్యం నాకు బాగా చిరాకునీ, కోపాన్ని తెప్పించేది. అలా వాళ్ల బాతాఖానీ నేను స్నానం చేసి, కాసేపు టీవీ చూసి భోజనానికి డైనింగు టేబుల్ దగ్గరకు వచ్చేవరకూ కొనసాగేది. నేను మా పడక గదిలో ఉన్నా సరే ”అసలు మనుషులకు పెళ్లిళ్లు అవసరమా? భర్తను మనం ఎందుకు గౌరవించాలి? తల్లితండ్రులను మనం ఎందుకు పోషించాలి?” అన్న బ్రెండా రెచ్చగొట్టే మాటలు నా చెవుల్లో మారుమోగుతూ చిరాకుని మరింత పెంచేవి.
నాకేమో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే లారాతో ఇంటి ముందర లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది. కానీ బ్రెండా వల్ల ఆ కోరిక గగన కుసుమం అయిపోతోంది. ఒక్కోసారి బ్రెండా వాళ్ళింటికి మా ఇద్దర్నీ కాఫీకి పిలిచి రాత్రి పది గంటల వరకు రకరకాల కబుర్లు చెబుతూ నా సహనానికి పరీక్ష పెడుతుండేది. నేను ఆమె ఇంటికి రానంటే లారాకి కోపం వస్తుంది.
బ్రెండాకి రిచర్డ్, స్టీఫెన్ లాంటి ఎందరో మగ స్నేహితులున్నారు. వాళ్ళని కలవడానికి ఆమె తరచూ లండన్ వెళుతుంటుందనీ మా కాలనీలో అందరూ చెప్పుకుంటుంటారు. ఇంతమంది మగ స్నేహితులుండబట్టే ఆమె భర్తతో విడాకులు తీసుకున్నదని నా స్నేహితులు చెప్పారు.
మొత్తానికి బ్రెండా వల్ల లారా నాకు దూరం అవుతోందన్న భావం నాలో రోజు రోజుకీ పెరిగిపోతోంది. నాకు లారా దగ్గరవాలంటే బ్రెండా ఆమెకు దూరమవ్వాలి. అప్పుడే పెళ్ళైన కొత్తలో ఉన్నట్లు మళ్ళీ లారా నా స్వంతమౌతుంది. కానీ ఆమెను ఎలా వదిలించుకోవాలో అర్ధం కావటం లేదు. పోనీ ఈ కాలనీ వదిలి ఆమెకు దూరంగా వెళ్ళిపోతే అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ మేం అలా దూరంగా వెళ్లినా బ్రెండా మా దగ్గరకు వచ్చేస్తుందన్న విషయం నా భార్య ద్వారా తెలిసి ఆ ఆలోచన మానుకున్నాను.
ఇంతలో క్రిష్టమస్ వచ్చింది. ఆమెకు లండన్లో బోలెడు మంది స్నేహితులున్నా వాళ్ళెవ్వరూ ఆమెను క్రిష్టమస్‌కి పిలవలేదు. ఇక తప్పక మేమే ఆమెను మా ఇంటికి ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనూ, బ్రెండా ఇంటికి అలంకరణ చేస్తూ గడిపితే లారా మాత్రం వంట గదిలో వంట చేస్తూ ఉండిపోయింది.
రాత్రి ఎనిమిదప్పుడు లారా వంట గదిలో ఉన్నప్పుడు బ్రెండాని పెదవుల మీద ముద్దుపెట్టుకున్నాను. ఆలా నేను ఎందుకు చేసానో ఇప్పటికీ నాకు అర్ధం కాదు. నాలో బ్రెండా పట్ల అంతర్గతంగా ఉన్న కొరికే బహుశా నన్నా పనికి పురిగొల్పి ఉంటుందని నా భావన. కానీ ఆ ఘటన తరువాత బ్రెండా ముఖం ఆవేశంతో ఎర్రగా మారిపోయి నాతో చాలా సేపటివరకూ మాట్లాడకుండా ముభావంగా ఉంది. ఆమె ప్రవర్తన నా కెందుకో ఆశ్చర్యం కలిగించింది. మగవాళ్ళతో చాలా ఫ్రీగా మెలిగే ఆమె నేను ముద్దు పెట్టుకోగానే ఎందుకలా మారిపోయిందో నాకర్ధం కాలేదు. అందుకే ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం అంత సులభం కాదనీ అంటారు. అది ముమ్మాటికీ నిజం.
ఆ మర్నాడు లారాతో బ్రెండాను ముద్దు పెట్టుకున్న విషయాన్ని చెబుదామనుకున్నా. కానీ లారా పనులతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. కానీ చెబితే లారా ఏం అనుకుంటుందోనన్న బెంగ లోలోపల లేకపోలేదు.
ఇంతకీ బ్రెండాకు నా భార్య లారా అంటే ఎందుకంత ఇష్టం? ఎందుకు ఆమెను వదిలి ఉండలేదు? వాళ్ళిద్దరి మధ్యా ఒకరినొకరు వదులుకోలేనంతటి స్నేహం ఎందుకు? బహుశా లారా మంచితనం, అమాయకత్వం బ్రెండాకి బాగా నచ్చివుంటాయి. బ్రెండా జీవితంలో చాలా చెడ్డ వాళ్ళని, అసూయపరులను చూసింది కానీ మొదటిసారిగా లారాలో అవేమీ లేని స్వచ్ఛమైన మనిషిని చూసి ఉంటుంది. అందుకే లారా అంటే బ్రెండాకి అంత ఇష్టం. కానీ అది నాకు చాలా కష్టాలు తెస్తోంది.
ఆ మర్నాడు నేను నిద్ర లేచేసరికి లారా నిద్ర పోతోంది. ఆ రాత్రంతా బ్రెండా, లారా నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటూ గడపటం వల్ల లారాకి నిద్రలేదట. నా భార్య లారా నా స్వంతమవాలంటే బ్రెండా ఉండకూడదు. ఆమె ఉన్నంత కాలం నాకు లారా దూరం అవక తప్పదు. అందుకే బ్రెండాని చంపాలని నిర్ణయించుకున్నాను.
అయితే ఆమెను చంపినట్లు మా కాలనీలో ఎవ్వరికీ నామీద అనుమానం రాకుండా ఉండాలంటే నేను ఆమెతో మంచిగా ఉండాలి. ఆమె మీద నాకు ద్వేషం ఉన్నట్లు కనిపించకూడదు. అందుకే కొత్త సంవత్సరం ముందు ఆమె ఒక రోజు బజారుకి వస్తే నేను ఆమెను నా బైక్ మీద కూర్చోబెట్టి ఇంటి దగ్గర దింపాను. ఇంకోరోజు నేను ఇంటికి వచ్చినప్పుడు లారా వంటరిగా ఉంటే ”బ్రెండాని పిలవలేకపోయావా? నీకు టైం పాస్ అవుతుంది” అన్నప్పుడు లారా ఆనందంతో ”మీకు బ్రెండా అంటే ఇష్టం లేదేమో అనీ అనుకునేదాన్ని. కానీ అది తప్పని ఇప్పుడు తెలిసింది” అంది. బ్రెండా మీద నాకు ద్వేషం, కోపం లేదనీ ఈ సంఘటన తరువాత లారాకి నమ్మకం కుదిరిందని గ్రహించాను.
నా మీద ఎవరికీ అనుమానం రాకుండా బ్రెండాని ఎలా చంపాలి? అన్న ఆలోచన నన్ను రోజూ పీడించసాగింది. కానీ రోజులు గడుస్తున్నా దానికి సమాధానం దొరకటం లేదు. ఆ సమయంలో మా కాలనీ పొలిమేరలో ఉన్న గుడిసెలో ఉంటున్న అవివాహిత స్త్రీ పెగీ డాలీ హత్య నాకు ఓ దారి చూపింది. పెగీ డాలీ పెళ్లి కాని యువతి. ఆమె ఆ గుడిసెలో ఒంటరిగా ఉంటోంది. వారం క్రితం ఆమెను ఎవరో కూరలు కోసే కత్తితో దారుణంగా చంపేశారు. ఆ కత్తి ఆమె వంట గదిలో వున్నదే. దాంతోనే హంతకుడు ఆమెను నరికి చంపాడు. ఆ ఇంట్లో ఏ విధమైన వస్తువులు కానీ డబ్బు కానీ దొంగిలించకపోవడంతో పోలీసులు ఆమెను ఎవరో ఓ మానసిక రోగి చంపి ఉంటాడన్న నిర్ధారణకి వచ్చారు. అయితే ఆ హంతకుడు దొరకలేదు. పోలీసులు కూడా ఆ హంతకుడి మీద పెద్దగా ధ్యాస పెట్టకుండా ఆ కేసుని మూసేసారు.
ఆ వార్త విన్న తరువాత నాకు ఓ ఆలోచన వచ్చింది. డాలీని ఆ హంతకుడు చంపినట్లు నేను కూడా బ్రెండాను కత్తితో చంపితే పోలీసులు బ్రెండాని కూడా డాలీని చంపిన మానసిక రోగే చంపి వుంటాడనుకునే అవకాశం ఉంది. ఆ విధంగా నేను ఆ హత్య కేసు నుంచి బయట పడవచ్చు. ఈ ఆలోచన రాగానే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను.
ఆ సమయంలో లారాకి బాగా జలుబు చేసింది. రెండు రోజుల పాటు మంచం దిగలేదు. అప్పుడు బ్రెండా మా ఇంటికొచ్చి వంటతో సహా అన్ని పనులూ చేసింది. అప్పటికింకా డాలీ హత్యని కాలనీలో ఎవ్వరూ మరిచిపోలేదు. కాబట్టి రాత్రి అయితే బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు.
అందుకే ఆ రాత్రి వంట అయిపోగానే బ్రెండా ఇల్లు మా ఇంటికి దగ్గరే అయినా ఆమెను దిగపెట్టడానికి తోడుగా బ్రెండా ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో నాకు బ్రెండా ఇంటిని పూర్తిగా పరిశీలించే అవకాశం కలిగింది. లారాకి జలుబు తగ్గేవరకూ బ్రెండాకి తోడుగా ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో కొద్దిసేపు మాట్లాడి వచ్చేవాడిని. అలా వెళ్ళినప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు నన్ను మా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరూ చూడకుండా జాగ్రత్త పడ్డాను. అదీకాక నాకు తెలిసిన వాళ్లందరితో లారాకి ఒంట్లో బాగులేనప్పుడు బ్రెండా చేసిన సహాయం గురించి చెప్పేను. దానివల్ల బ్రెండా అంటే మాకెంత అభిమానమో అందరికీ అర్ధం అయ్యే అవకాశం ఉందని నమ్మకం.
నాలుగు రోజుల తరువాత నాకు కూడా జలుబు చేసింది. దానివల్ల బ్రెండా హత్య ఆలస్యం అయ్యే అవకాశం ఉందనీ నాకు భయం వేసింది. ఈ మధ్యనే డాలీ హత్య జరిగింది కాబట్టి బ్రెండా హత్య వెంటనే జరిగితే పోలీసుల దష్టి డాలీ హంతకుడైన మానసిక రోగి మీదకు పోతుంది. ఆలస్యం అయితే పోలీసులతో సహా అందరూ ఆ హత్యని మరిచిపోయి మళ్ళీ కొత్తగా పరిశోధించే అవకాశం ఉంది.
ఆ రోజు తీవ్రమైన జలుబు వల్ల నేను మంచం దిగలేదు. ఈ అనారోగ్యాన్ని బ్రెండా హత్యకి ఎలా ఉపయోగించాలని తీవ్రంగా ఆలోచించ సాగాను. లారాకి కొద్దిగా నయమైంది కానీ పూర్తిగా తగ్గలేదు కాబట్టి బ్రెండా నాకు ఆ రోజు నా భార్య లారా లాగ సపర్యలు చేసింది. మాకు వంట కూడా వండి ఇంటికి వెళ్ళిపోయింది.
మూడు రోజుల తరువాత నాకు జలుబు తగ్గుముఖం పట్టింది. లారా ఆ రోజు బయటకు వెళ్లే పని పడింది. నేనింకా మంచం మీదే ఉంటే ఆమె బయటకు వెళ్ళదు. లారా ఇంట్లో ఉంటే బ్రెండాని చంపే అవకాశం రాదు. అందుకనే నాకు నీరసంగా ఉన్నా మంచం మీద నుంచి లేచి తిరగడం మొదలు పెట్టాను. డాక్టర్ లాసన్ వచ్చి పరీక్షించి కొన్ని మందులు రాసి రెండు రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు.
ఆ మర్నాడు లారా సాయంత్రం ఏడు గంటలప్పుడు బయటకు వెళ్ళింది. ఆమె వెళ్ళగానే నేను ఒక్కసారిగా లేచి కిటికీలోంచి బ్రెండా ఇంటి వైపు చూశాను. లారా ఇంటికి తిరిగి వచ్చేసరికి రెండు గంటలు పడుతుంది కాబట్టి ఈ లోపు బ్రెండాని హత్య చెయ్యాలి. ఇప్పుడా పని పూర్తి చెయ్యకపోతే నాకు ఆ అవకాశం మళ్ళీ రాదు. బ్రెండా ఇంట్లో లైట్లు వెలుగుతునాయి.
వెంటనే వంట గదిలోకెళ్లి కత్తి తీసుకున్నాను. ఎవ్వరికీ కనిపించకుండా రైన్ కోట్, గ్లౌజెస్ వేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. మా ఇద్దరి రెయిన్ కోట్లు, గ్లౌజెస్ వంట గదిలోని అలమరాలో ఉంటాయి. నేను ఆ చీకట్లో అలమరా తలుపులు తీసి పైనే ఉన్న రెయిన్ కోటు తీసి వేసుకున్నాను. అది చాలా ఇరుకుగా ఉంది. ముఖ్యంగా పేంటు వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది కలిగింది. బహుశా ఆ రెయిన్ కోటు లారాది అయి ఉంటుంది. తొందర్లో చీకటి వల్ల నేను సరిగ్గా చూసుకోక లారా రెయిన్ కోటు తీసి వేసుకున్నాను. అయినా ఇప్పుడు దాన్ని మార్చడం కుదరదు. సమయం లేదు. ఆలస్యం అయితే లారా వచ్చేస్తుంది. వెంటనే ఆ చీకట్లో నడుచుకుంటూ బ్రెండా ఇంటికి బయలుదేరాను.
నేను ఆమె ఇంట్లోకి వెళ్లేసరికి బ్రెండా కిచెన్‌లో పనిచేసుకుంటూ కనిపించింది. కిచెన్లోకి వెళ్ళాను. నన్ను చూడగానే బ్రెండా ”మంచం మీద విశ్రాంతి తీసుకోకుండా ఎందుకు లేచావు” అంటూ నా మీద కోప్పడింది. ఆ తరువాత నా రెయిన్ కోటుని చూసి ”అదేంటి, ఇంత ఇరుకు రెయిన్ కోటు ఎందుకు వేసుకున్నావు?” అంది.
నేను ఆమె ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పకుండా కత్తి తీసి ఆమె గుండెల్లో రెండు పోట్లు పొడిచాను. అంతే! బ్రెండా ఒక్కసారిగా నేలమీద కూలిపోయింది. రక్తం ఒక్క సారిగా చిమ్మడంతో రెయిన్ కోటంతా రక్తంతో తడిసిపోయింది. నేను వెంటనే నా రెయిన్ కోటుని విప్పాను. దానికి అంటిన బోలెడు రక్తపు మరకల్ని చూసి ఆశ్చర్యపోయాను. నా బూట్లకు, పేంటుకీ, కత్తికీ అంటిన రక్తాన్ని తుడిచి, మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. తరువాత ఆ రెయిన్ కోటుని, గ్లౌజెస్‌ని విప్పేసి మా పెరట్లో నీళ్లు మరగపెట్టే పొయ్యిలో పెట్టేసాను. కత్తిని కడిగి వంటింట్లో పెట్టేసి ఏమి తెలియని వాడిలా మంచం మీద పడుకుండిపోయాను.
అరగంట తరువాత లారా వచ్చింది. నేను ఆమెను చూడగానే ”చెప్పిన టైముకన్నా అరగంట ముందే వచ్చేశావు” అన్నాను.
”నీకు ఒంట్లో బాగులేదు కదా, అందుకే వచ్చేశాను. నీకేమైనా కావాలా”? అని అడిగింది.
”ఏమీ వద్దు, నేను నిద్ర పోతాను” అని చెప్పి కళ్ళు మూశాను.
ఆ రాత్రంతా నాకు ఆందోళనతో నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర పట్టింది. తెల్లారి లేచేసరికి కిటికీలోంచి ఎండ పడుతోంది. ఆ సమయంలో ఒక పోలీసు వేన్ బ్రెండా ఇంటింటివైపు వెళుతూ కనిపించింది.
ఒక గంట తరువాత లారా వచ్చి ”బ్రెండాని ఎవరో చంపేశారు. పోలీసులొచ్చి ఇదివరకు డాలీని చంపినవాడే బ్రెండాని కూడా చంపేసి ఉంటాడని అంటున్నారు” అని చెప్పింది.
నేను బాధ పడుతున్నట్లు నటిస్తూ ”ఇంతకీ నువ్వేం అనుకుంటున్నావు? ఆమెను అడిగాను.
”పెగీ డాలీని చంపినట్లే ఏ దొంగతనం చెయ్యకుండా కత్తితో పొడిచి చంపాడంటే ఆమెను చంపినవాడే చంపివుంటాడు. అందులో ఏం అనుమానం లేదు” అని చెప్పింది లారా.
అప్పటికి నాకు జలుబు, జ్వరం పూర్తిగా తగ్గాయి. అన్నీ నేను అనుకున్నట్లే జరుగుతునాయి.
”లారా, నీకు ఎంతో ప్రియమైన స్నేహితురాలు బ్రెండా చనిపోయినందుకు నీకు ఎంతో బాధ కలుగుతోందనుకుంటాను” అన్నాను ఆమెతో. కానీ లారా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
ఇంతలో నేను మా పెరట్లో పొయ్యిలో దాచిన రెయిన్ కోటు గుర్తుకువచ్చింది. ఉదయాన్నే లేవగానే దాన్ని కాల్చి వెయ్యాలనుకున్నాను. కానీ బాగా నిద్ర పట్టేయడంతో ఆ విషయం మరిచిపోయాను. ఇప్పుడా పని చెయ్యాలి. అయినా నాకు ఆందోళన ఏమీ కలగటం లేదు. ఎందుకంటే లారా లాగే పోలీసులు, ఊళ్ళో వాళ్ళూ డాలీ హంతకుడే బ్రెండాని చంపేడనీ అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మా ఇంటికి విచారణకు వచ్చే అవకాశమే లేదు.
కానీ ఆశ్చర్యకరంగా ఆ మధ్యాహ్నం ఒక పోలీసు ఇనస్పెక్టర్, కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దర్నీ లారా నా దగ్గరకు తీసుకువచ్చింది. ఇనస్పెక్టర్ నా మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ”మిస్టర్ డేవిడ్, మీ భార్యా భర్తలిద్దరూ హత్య చెయ్యబడ్డ బ్రెండా గోరింగుకి బాగా కావలసిన వాళ్ళనీ తెలిసింది. అందుకని మీరిద్దరూ ఆమెను చివరిసారిగా ఎప్పుడు చూసారో, ఆ సాయంత్రం మీరెక్కడ ఉన్నారో తెలుసుకుందామని వచ్చాం. ఇంతకీ ఆమెను ఎవరు చంపివుంటారో మీకేమైనా తెలుసా?” అనడిగాడు.
”ఆ డాలీని చంపిన వాడే బ్రెండాని కూడా చంపి ఉంటాడు. ఇందులో అనుమానమేమీ లేదు” అని చెప్పింది లారా.
”దయచేసి పేపర్లు చదివి వాటిలో రాసినవి నమ్మకండి” అన్నాడు ఇనస్పెక్టర్.
మేం రోజూ పేపర్లు చదువుతాం. ఈ రోజు పేపర్లో డాలీని చంపిన హంతకుణ్ణి పోలీసులు అరెస్టు చేశారని ఉంది. ఆ తరువాత వాళ్ళు బ్రెండా గురించి మరికొన్ని ప్రశ్నలడిగి వెళ్లిపోయారు.
ఆ రాత్రి నేనూ లారా ఆ గదిలోనే పడుకున్నాం. నేను పడుకున్నానే గానీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే తెల్లవారగానే లేచి పెరట్లోని పొయ్యిలోని రెయిన్ కోటుని కాల్చెయ్యాలి. లేకపోతే అది పోలీసులకు దొరికిపోయే ప్రమాదముంది. పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారాలూ దొరక్కూడదు.
అందుకే ఆ ఉదయం లారా లేవక ముందే నేను లేచి పెరట్లోకి వెళ్ళాను. కానీ అప్పటికే అక్కడ పోలీసులు ఏవో వెతుకుతూ కనిపించారు. వాళ్ళని ఆ సమయంలో అక్కడ చూడగానే నాకు భయం వేసింది. ఆ రోజంతా నేనూ, లారా ఏమీ మాట్లాడుకోలేదు. మాకు తెలియకుండానే మా ఇద్దరిలో ఆందోళన మొదలైనట్లు గుర్తించాను.
ఆ మర్నాడు ఉదయాన్నే పోలీసులు సెర్చి వారెంటుతో వచ్చి మా ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. నేను బ్రెండా హత్య కోసం ఉపయోగించిన కత్తిని మా వంట గదిలో కొనుగొన్నారు. దానికి రక్తపు మరకలు ఉన్నాయి. హత్య చేసిన రోజు నేను దాన్ని కడిగినప్పుడు దానికి అంటుకున్న మరకలు పూర్తిగా పోలేదనీ దాన్ని చూసిన తరువాత తెలిసింది. కొంతసేపటి తరువాత ఇనస్పెక్టర్ ఒంటరిగా నా దగ్గరికి వచ్చాడు.
”మీరు బ్రెండా గోరింగుకి స్నేహితుడిని అని చెప్పారు” అని అడిగాడు.
”సారీ ఇనస్పెక్టర్, నేను ఆమెతో స్నేహంగా ఉండేవాడిని. కానీ ఆమె నా భార్య లారాకి స్నేహితురాలు” అని చెప్పాను. కానీ ఇనస్పెక్టర్ నేను చెప్పిన మాటలు సరిగ్గా వినలేదు.
”కానీ మీరు బ్రెండాతో చాలా సన్నిహితంగా మెలిగేవారనీ, ఆమెతో మీకు లైంగిక సంబంధం ఉండేదన్న విషయాన్ని మాకెందుకు చెప్పలేదు’?” అతను నా వైపు కోపంగా చూస్తూ అడిగాడు.
అతని మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ వెంటనే నాలో ఆందోళన మొదలైంది.
”అది శుద్ధ అబద్ధం” గట్టిగా చెప్పాను.
”మిస్టర్ డేవిడ్, అది నిజమనీ మాదగ్గర రుజువులున్నాయి” అన్నాడు ఇనస్పెక్టర్.
”ఏమిటా రుజువులు?” అన్నాను కోపంగా
”బ్రెండా గోరింగ్ చనిపోక ముందు మీతో తనకున్న లైంగిక సంబంధం గురించి లండన్‌లోని తన ఇద్దరు స్నేహితులతో చెప్పింది. అలాగే మీ ఇరుగు పొరుగు వాళ్లకు కూడా ఒక పార్టీలో ఆ విషయాన్ని చెప్పింది. మీ భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు బ్రెండాతో సాయంత్రం పూట ఏకాంతంగా గడిపినట్లు మిమ్మల్ని చూసిన వాళ్ళు చెప్పారు. అదీకాక మీరు ఆమెను ఓ పార్టీలో ముద్దు పెట్టుకున్న విషయాన్ని కూడా ఒకరు మాకు చెప్పారు. ఇంతకన్నా ఇంకేం సాక్ష్యాలు కావాలి?” చెప్పాడు ఇనస్పెక్టర్.
”ఇనస్పెక్టర్, ఆమెకు ఎంతోమంది స్నేహితులున్నారు. ఎంతో మందితో ఆమెకు లైంగిక సంబంధాలున్నాయి. వాళ్లలో ఎవరైనా ఆమెను చంపి ఉంటారు” అన్నాను అతనితో.
”మిస్టర్ డేవిడ్, బ్రెండాతో విడాకులు తీసుకుని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఆమె మాజీ భర్తతో సహా ఆమె జీవితంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరనీ మా విచారణలో తేలింది” అన్నాడు ఇనస్పెక్టర్.
అతని మాటలు నాకు ఏడుపు తెప్పించాయి” నేను ఒట్టేసి చెబుతున్నాను, నేను ఆమెను చంపలేదు” అన్నాను కళ్ళు తుడుచుకుంటూ.
”మిస్టర్ డేవిడ్, మీరు బ్రెండాని చంపలేదన్న విషయం నాకు తెలుసు. అయినా బ్రెండా హత్య చేయబడిన రోజు మీకు వంట్లో బాగులేదనీ, జ్వరంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నారనీ మీ డాక్టర్ లాసన్ మాకు చెప్పారు. అంతేకాక మీ పెరట్లోని పొయ్యిలో దొరికిన హంతకుడు ఉపయోగించిన రెయిన్ కోటు, గ్లౌజెస్ కూడా మీవి కావని గుర్తించాం” అన్నాడు ఇనస్పెక్టర్.
అతని మాటలు వినగానే నాకు ఆ రాత్రి బ్రెండాని చంపడానికి వెళ్ళినపుడు ఆమె నా రెయిన్ కోటుని చూసి ”అంత ఇరుకు బట్టలు ఎందుకు వేసుకున్నావు” అని బ్రెండా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
వెంటనే నేను ఇనస్పెక్టర్‌తో ”సార్, నేను బ్రెండాని చంపలేదు. ఆ రాత్రి జ్వరంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నాను. నన్ను నమ్మండి. నాకు ఆ హత్యతో ఏ సంబంధం లేదు” అని అతని చేతులు పట్టుకుని ఏడుస్తూ చెప్పాను.
”డేవిడ్, మీకు ఆ హత్యతో ఏ సంబంధం లేదనీ చెప్పడానికే నేనిక్కడకు వచ్చాను. మీరు మీ భార్య లారాని తీసుకొని మాతో స్టేషనుకి రండి. మీ భార్య లారాయే బ్రెండాని హత్య చేసిందనీ మేం నిర్ధారణకు వచ్చాం. అందుకు తగ్గ ఆధారాలు రెయిన్ కోటుతో సహా అన్నీ మాకు లభించాయి. మీకు బ్రెండాకి అక్రమ సంబంధం ఉందన్న విషయం మీ భార్య లారాకి తెలిసిపోయింది. అందుకే ఆమె బ్రెండాని హత్య చేసింది. స్టేషనుకి వస్తే ఆమెను హత్య నేరం కింద అరెస్టు చేస్తాం” చెప్పాడు ఇనస్పెక్టర్.
అతని మాటలు వినగానే నా మస్తిష్కం మొద్దుబారి వెంటనే కిందపడిపోయాను.
- గన్నవరపు నరసింహ మూర్తి
(రూత్ రెండెల్ ‘ది ఐరనీ ఆఫ్ హేట్’ కథ ఆధారంగా )