Sunday, July 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిద్వేషముల్లు

విద్వేషముల్లు

- Advertisement -

నిర్మాతలు, సినీరచయితలు, హీరో పాత్రధారులు చరిత్రబోధకులు – చరిత్రకారులూ అయ్యాక, ఇంకేముంది సినిమా హాళ్ళన్నీ తరగతి గదులైపోతాయి. సినిమాళ్ళోని నాయకులు ధర్మరక్షకులై చరిత్రను విచిత్రంగా వినిపిస్తుంటారు. అవి విని తలకెక్కించుకోని వాళ్ళంతా దేశ ద్రోహుల జాబితాలో చేరిపోతారు. రాజకీయాల్లోకి తెచ్చిన విద్వేషమంతా నేడు సినిమా కళలోకి చేరి సామాన్య ప్రజలపై స్వారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా చరిత్రకు సంబంధంలేని అనేక కల్పిత కథనాలతో ప్రజల మధ్య చీలికలను ప్రోత్సహిస్తోంది. వీరమల్లు అనే పాత్ర అసలు చరిత్రలో లేనేలేదు. ఇక కథలోని సంఘటనలు కల్పితాలు. వీటితో ఒక సినిమాటిక్‌ మసాలా నూరి, వాళ్ల రాజకీయ మతవిద్వేషాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల తలకు మత్తెక్కిస్తున్నారు.
ఇలాంటి సినిమాలు, మతతత్వ రాజకీయాలు అధికారంలోకి వచ్చాక ఎక్కువయి పోయాయి. ఇటీవలి ‘చావా’ సినిమా కానీ రజాకార్‌, కశ్మీర్‌ ఫైల్స్‌, కేరళఫైల్స్‌, మొదలైనవన్నీ ఫాసిస్టు ఆలోచనలతో కూడుకుని, ఒక జాతిని, మతాన్ని హీనపరుస్తూ ద్వేషం నింపే సినిమాలు. హరిహర వీరమల్లులో కూడా ఔరంగజేబు పాత్రనుపెట్టి, కోహినూర్‌ వజ్రాన్ని తీసుకువచ్చే వీరమల్లు పాత్రని సనాతన ధర్మాన్ని కాపాడేవానిగా, వీరునిగా చూపించి వైషమ్యాలను రెచ్చగొట్టటం, దాన్ని వాస్తవ చరిత్రగా ప్రచారం చేయటం సినీ కళా చరిత్రకు తీవ్ర కళంకం. సినిమా విడుదలయ్యాక పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. సినిమా విజయం విషయం తర్వాత… నేననుకున్న విషయం జనంలోకి వెళ్లింది అదేనా విజయం అన్నాడు. అంటే ఔరంగజేబును ఒక దుర్మార్గుడిగా, ఆ వర్గం మనకు చేసిన అన్యాయాన్ని చూపెట్టానని చెప్పాడు. అంతేకాదు, మన హిందూరాజులను ఎవరూ గొప్పగా చూపెట్టలేదనీ బాధపడ్డాడు. పవన్‌ గారు చదివే చాలా పుస్తకాల జ్ఞానం ఇదన్నమాట! తరతమ భేదం లేకుండా రాజులందరూ ప్రజలను పీడించి, పన్నులు వసూలు చేసి, తమ విలాసాలకు ఉపయోగించారన్న విషయం తెలియనిదా! ఔరంగజేబే కాదు, హిందూరాజులు సైతం ఇతర హిందూ రాజ్యాలపై దండెత్తినపుడు గుళ్ళను, గోపురాలను ధ్వంసం చేసిన చరిత్రను చదివితే కదా తెలిసేది! ఇదే హిందూ రాజులు బౌద్ధ మత ప్రచారాన్ని, ఆరామాలను అడ్డుకుని, ధ్వంసంచేసి, తమ మందిరాలుగా మార్చుకోవటం, చరిత్రను చదివితే అర్థమవుతుంది. అదంతా రాజులు, చక్రవర్తులు వారి వారి ప్రయోజనాల కోసం చేసిన పనులు. చరిత్రను, చరిత్రగానే చూడాలిగానీ, తిరిగి నేడు ద్వేషం పెంచి కక్షతీర్చుకోవటానికి ప్రేరేపించడం మూర్ఖుల పని మాత్రమే. ఇంకా ‘అభిమానులు సున్నితంగా ఉండొద్దు. సోషల్‌ మీడియాలో సినిమాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్న వాటిని చూసి కుమిలిపోవద్దు. తిరిగి దాడి చేయండి’ అని పిలుపునిచ్చాడు. అంటే అభిమానులను, విమర్శించే వారి పైకి ఉసిగొల్పుతున్నాడు. తన సినిమాను ప్రమోట్‌ చేసుకోవటానికి ఇలాంటి అరాచకానికి కూడా వెనుకాడటం లేదు. సినిమా నియంతృత్వం ఇది.
మొదట మన పవన్‌ కళ్యాణ్‌ పల్లవి చేగువేరా. ఆ జీవితాన్ని ప్రేరణగా మొదలయిన నాయకుడు వీర విప్లవకారుడిగా ఫోజులు పెట్టి, ప్రజాస్వామ్యం, ప్రజల బాధలు, యువత నిరుద్యోగం గురించి తెగ బాధపడిపోయిన ఈయన, తన రాజకీయ ఆశ్రయం, అవసరాలకోసం వీరసావర్కర్‌ అనుచరుడి అవతారమెత్తాడు. విప్లవం గురించి గర్జన చేసిన గొంతుకే విద్వేషం నినదిస్తోంది. ఒకవైపు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మామిడి రైతులు ధర పలకక అల్లాడిపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ అధికారం ఉందని సినిమా టికెట్‌ రూ.600లు పెంచుకున్నాడు. ప్రజల బాధలను మాత్రం మాటవరుసకైనా మాట్లాడటంలేదు. ఇదీ అమాత్యుల కళాపోషణాచాతుర్యం!
తెలుగు చలన చిత్రసీమలో అనేక సినిమాలు ప్రజల మధ్య విభేదాలను గతంలో సృష్టించలేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు – అందరు మతాలకతీతంగా స్నేహంతో మెలిగిన సన్నివేశాలనే చూపేవారు, ఇపుడు విద్వేష రాజకీయాలను సినిమాలలోకి తెచ్చి విభజన బోధనకు పూనుకుంటున్నారు. చరిత్రను వక్రీకరించి ద్వేషాన్ని నింపుతున్నారు. వాస్తవంగా ప్రజలు సహనంతో, స్నేహంగా జీవిస్తున్నారన్నది కాశ్మీర్‌ పహల్గాం సంఘటనతో ప్రస్ఫుటమైంది. రెచ్చగొడితే అమాయకంగా రెచ్చిపోరనేది తేలిపోయింది. అయినా సాంస్కృతిక, కళారంగాల ద్వారా, ముఖ్యంగా సినిమా ద్వారా ఈ ప్రచారాన్ని తలపెట్టే వీరి చర్యలను అవగాహన చేసుకోవాలి. అబద్ధాలు అల్లి దేశంలోని ఒక మతంపట్ల విద్వేషాలు లేపటం, మరో మతం పట్ల కుహనా ప్రేమను నటించడం తద్వారా వచ్చే రాజకీయలబ్దిని పొందడం ఈ సినిమా లక్ష్యంగా ఉంది. సినిమా నిర్మాతలు, ఇది కల్పిత కథ అని ప్రకటించినా, చరిత్రలోని కొన్ని పాత్రలను తీసుకుని, కాలాలకు ఘటనలకు సంబంధంలేని కలగాపులగపు సినీ వంటకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక జీవో ఇచ్చి టికెట్లు ధర పెంచుకోవటానికి అనుమతినివ్వడం సహించరానిది. కళ ఏదైనా మనుషుల్ని కలుపుతుంది. కానీ, విడగొట్టేందుకు కళను ఉపయోగించడం వికృతం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -