Tuesday, February 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'హిమంత' ద్వేషం!

‘హిమంత’ ద్వేషం!

- Advertisement -

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలు, చేసే హావభావాల ప్రదర్శనలు మతసామరస్యాన్ని తెబ్బతీసే విధంగా ఉన్నాయి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తులు నేరుగా ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసుకుని మాట్లాడటం పౌరులను అభద్రతలోకి నెట్టడమే తప్ప వేరేకాదు. అస్సాం యూనిట్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసిన హిమంత వీడియోలో తన చేయిని తుపాకివలే పెట్టి కాల్చేస్తామ న్నట్టుగా అందులో విజువల్‌ ఉంది. అయితే, అది ముస్లింల మైనార్టీలను టార్గెట్‌ చేస్తూ దేశం నుంచి వెళ్లగొట్టే కుట్రలో భాగంగా చేసిందేనని విమర్శలు వచ్చాయి. తర్వాత తొలగించినప్పటికీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విభజన ఆలోచనలకు బలాన్ని చేకూర్చాయి. ఒక రాష్ట్రానికి అత్యున్నతమైన పదవిలో ఎన్నికైన వ్యక్తి అన్ని కులాలు, మతాలను సమానంగా చూడాలి, గౌరవించాలి. ఎందుకంటే వారు వేసే అడుగు, చెప్పే మాట ప్రభావితం చేస్తుంది. కానీ, హిమంత పాలన మాత్రం ‘విభజించు పాలించు’ సూత్రంతో హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. దీన్ని అడ్డుకోకపోతే ఇంతకన్నా దేశానికి వేరే ప్రమాదం ఏమీ ఉండదు!

దేశం కుల, మత, ప్రాంత రాజకీ యాలతో అట్టుడుకుతున్నది. గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా సంఫ్‌ు పరివారం వికటహాసాన్ని ప్రదర్శిస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వానికి అడుగడుగునా తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని నిలువునా పాతరేస్తున్న విద్వేషి హిమంత బిశ్వశర్మ. అతను మాట్లాడే మాటలు, ఆచరణలో వేసే అడుగులు ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చిత్రీకరించేలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చర్చ జరుగు తున్న అంశం ‘సర్‌’. తమ ఓట్లు చోరీ అయ్యాయని ఓటర్లు ఓవైపు ఆందోళన చేస్తుంటే ‘ఇది కచ్చితంగా ముస్లిం ఓట్లను తొలగించేందుకు తీసుకొచ్చిందే’ అని హిమంత కుండబద్ధలు కొట్టారు. ఆయన గతంలోనూ ముస్లింల సంస్కృతిని ప్రతిబింబించే ‘మియా మ్యూజియం’పై చేసిన వ్యాఖ్యలు సామాజిక వాతావరణంలో అనుమానాలు, భయాలు సృష్టించాయి. ముస్లింల జనాభా పెరుగుదలను ఆ వర్గంపైకి నెట్టి అదో నేరంగా చూపించే ప్రయత్నం చేశారు. భూముల విషయంలో కూడా ‘ల్యాండ్‌ జిహాద్‌’ అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు పోలీస్‌ స్టేషన్లు, కోర్టు పిటిషన్ల దాకా వెళ్లా రు. అయిన ప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదంటే అధికార శాసనం ఎలా చెలరేగుతుందో అర్థం చేసుకోవచ్చు.

భారతీయ శిక్షాస్మృతి ప్రకారం మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే వ్యాఖ్యలు శిక్షార్హం. కానీ, నిత్యం హిందూ ముస్లింల మధ్య ‘విభజన రేఖ’ను గీస్తూ ప్రజల్లో విద్వేషం రగిలిస్తున్న హిమంత రోజురోజుకూ రెచ్చిపోయి మాట్లాడటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడు విడుదలైన విజువల్‌ వీడియో కూడా దాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నది. రాజకీయ నాయకుడిది సాధారణ వ్యక్తి మాట కాదు. అది పాలనా దశదిశను చూపిస్తుంది. ఒకవర్గాన్ని టార్గెట్‌ చేస్తూ చేసే వ్యాఖ్యలు ప్రజల్లో ఒక అభద్రతను తీసుకొస్తుంది. ఎన్నికల చద రంగంలో లాభనష్టాలకు ముస్లింలను పావులుగా వాడుకోవడం, హిందూ,ముస్లింల ఐక్యతను పణంగా పెట్టడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజా సమస్యలను చర్చించంకన్నా మతాల మధ్య చిచ్చును పెట్టేందుకే అధికారాన్ని వాడుకోవడం విచాకరం. భిన్నాభిప్రాయాలున్నా, భిన్న మతాలు ఉన్నా అందరినీ ఒకేతాటిపై నడపాల్సిన బాధ్యత అందరి కన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిది. కానీ, ఇక్కడ హిమంత చేసే ‘విద్వేష’ వ్యాప్తి ప్రజల్ని కలిపేలా కాకుండా విడదీసే విధంగా ఉంటున్నది.

అందుకే హిమంత విజువల్‌ మత సామరస్యానికి భంగం కలిగించే చర్యగా పేర్కొంటూ సీపీఐ(ఎం), సీపీఐ సహా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే గౌహతి కోర్టులోనే తేల్చుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ ఆదేశం ”సామాజిక విభజన”ను ప్రేరేపించడమేన్ననది పౌర సమాజం అభిప్రాయం. రాజ్యాంగం ఆర్టికల్‌ 32 ప్రకారం మూల హక్కుల ఉల్లంఘన జరుగుతున్న క్రమంలో పౌరులు ఎవరైనా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. దీన్నే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ‘రాజ్యాంగపు హృదయంగా, ఆత్మ’గా పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, మత సామ రస్యంపై ప్రభావం చూపే ఆరోపణలు వచ్చినప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం తక్షణ స్పష్టత ఇస్తే న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేది. ఈ అంశాన్ని నేరుగా విచారించకుండా ‘బదిలీ’ చేయటం భరోసాకన్నా ఎక్కువగా బాధను పంచింది. ప్రజాస్వామ్యంలో న్యాయం కనిపించడమే కాదు, కనిపించేలా ఉండటం కూడా అంతే ముఖ్యం. హిమంత విద్వేషాలపై విచారణ చేయాల్సిన అనివార్యత నొక్కిచెబుతున్నది ఇదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -