ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ(ఎస్) గ్రామంలో బేస్‌మెంట్ లెవల్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కొలాం ఆదివాసులు పోరుబాట పట్టారు. సీపీఐ(ఎం) ఏరియా కమిటీ నాయకత్వంలో దశలవారీ పోరాటాలు చేపట్టారు. పట్టువదలని ఐక్యతతో అధికార యంత్రాంగం దిగొచ్చేలా చేశారు. టీఏజీఎస్ జిల్లా కమిటీ, వామపక్ష పార్టీలు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, కొలాంసంఘం, గిరిజన సంఘాలు వీరికి అండగా నిలిచాయి. పలువురు సర్పంచులు కూడా మద్దతు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ప్రతినిధిగా తహశీల్దార్ రామారావు వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఎట్టకేలకు ఇండ్ల నిర్మాణానికి అనుమతించారు. దుబ్బగూడలో పదహారు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. లబ్దిదారులంతా నిరుపేద కొలాం ఆదివాసులే. ఇళ్లు కట్టుకోవడానికి వారికి గుంటెడు జాగా కూడా లేదు. దీంతో అదే గ్రామానికి చెందిన శ్రీమతి ఆత్రం లేతుబాయి ఒక ఎకరం తన సొంత భూమిని దానం చేశారు. అందులోనే లబ్దిదారులు నిర్మాణం ప్రారంభించారు. పునాది వరకు నిర్మించుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారులు వాటిని అడ్డుకున్నారు.
అది ఫారెస్టు భూమి అనీ, అందులో ఇండ్లు కట్టరాదని బెదిరింపులకు దిగారు. ఈ సమస్యపై ఆదివాసులు సుమారు రెండునెలల పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. తాము పట్టా భూమిలోనే కట్టుకుంటున్నామని, భూమి ఇచ్చిన దాత లేతుబాయి రెవెన్యూ పట్టాను సైతం చూపించారు. ఎవరికి మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఈ దశలో సీపీఐ(ఎం)ను ఆశ్రయించారు. పిల్లా పాపలు, ముసలీ అంతా కలిసి జిల్లా కేంద్రానికి వచ్చి కా|| బాసెట్టి మాధవరావు భవనం(సీఐటీయు)లో ఆశ్రయం పొందారు. పదమూడు రోజుల పాటు ఇక్కడే వంటా వార్పు చేసుకుంటూ పట్టు వదలకుండా పోరాటం చేశారు. వీరి పోరాటంపై అటవీ అధికారులు కర్కశత్వం ప్రదర్శించారు. భూమి దానం చేసిన లేతుభాయి భర్త ఆత్రం జంగుపై, ఇండ్లు కట్టిస్తున్న కాంట్రాక్టరుపై అక్రమంగా కేసులు వేశారు. కాంట్రాక్టర్‌పై దాడి కూడా చేశారు. ఫారెస్ట్ అధికారుల భయబ్రాంతులను, అక్రమ కేసులను ఈ ఆదివాసీ లబ్దిదారులు లెక్కచేయలేదు. పోలీసులు, ఇతర అధికారులూ భయపెట్టారు. వేటినీ లెక్కచేయకుండా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టుసడలని పోరాటం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్, ఫారెస్ట్ కార్యాలయాలను ముట్టడించారు.
కలెక్టర్, ఎస్‌పీలను కలిసి గోడు వినిపించారు. ఆత్రం లేతుబాయి ఆ భూమిని దానం చేసిన సమయంలో స్వయంగా కలెక్టర్ ఆమెను సన్మానించిన విషయం గుర్తుచేశారు. ఎంఆర్‌ఓ, పలు స్వచ్ఛంద సంస్థలూ అమెకు అవార్డులిచ్చి సత్కరించారని, అది రెవెన్యూ భూమి కాకపోతే నాడు ఎందుకు సత్కరించారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఫారెస్టు భూమి అంటూ ఇండ్లు కట్టుకోకుండా అడ్డుకోవడం అన్యాయమని నిలదీశారు. ఇది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘన అవుతుందనీ తేల్చి చెప్పారు. దశలవారీ పోరాటాల్లో భాగంగా వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా విశాల మద్దతు, సంఘీభావం కూడగట్టుకున్నారు. మండలంలోని పద్నాలుగు గ్రామపంచాయతీలు వీరిది న్యాయ పోరాటమని, అది పట్టాభూమే అని తేల్చిచెప్పాయి.
వీరికి అదే భూమిలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పంచాయతీల్లో తీర్మానం చేశారు. ఇంతటి విశాల మద్దతు లభించాక అధికారులు తలవంచక తప్పలేదు. పోరాటం ప్రారంభమైన పదమూడు రోజులకు జిల్లా యంత్రాంగం దిగొచ్చింది. ఇండ్ల నిర్మాణానికి అనుమతించింది. విజయం సాధించే వరకు పట్టువదలని పోరాట స్పూర్తి, ఐక్యతను ప్రదర్శించిన దుబ్బగూడ ఆదివాసులకు సీపీఐ(ఎం) ఏరియా కమిటీ జేజేలు పలుకుతున్నది. వీరికి సంఘీభావం ప్రకటించి చివరి వరకూ మద్దతుగా నిలిచిన పార్టీలు, ప్రజా సంఘాలకు, గ్రామ పంచాయతీల సర్పంచులకు ధన్యవాదాలు తెలుపుతున్నది.ఫారెస్టు భూమి పేరుతో ఇలాంటి అన్యాయాలు, దౌర్జన్యాలకు గురవుతున్న బాధితులు ఎవరైనా సరే దుబ్బగూడ ఆదివాసుల పోరాటాన్ని, పట్టువదలని దీక్షను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిస్తున్నది.
- లంకా రాఘవులు, 9490098852



