Friday, March 20, 2026
E-PAPER
Homeకరీంనగర్అతడు సామాన్యుడే.. కానీ అందరివాడు

అతడు సామాన్యుడే.. కానీ అందరివాడు

- Advertisement -

ఐదు దశాబ్దాల పరిణామాలు.. నూనుగొండ రవీందర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

మీరు ఎప్పుడైనా సిరిసిల్ల పాత బస్టాండ్ వెళ్లారా..! అక్కడ మీకు ఒక సాధారణమైన సాధాసీదాగా  ఆ వ్యక్తి తారసపడే ఉంటాడు. తెల్లవార్లు చీకట్లను పారాద్రోలుతూ వెలుగు రేఖలు వెదజల్లుతున్నట్లే అక్షరాలను మూటకట్టి సమాచారాన్ని అందించే దినపత్రికలను చిరునవ్వుతో అందించే సామాన్యుడైన నునుగొండ రవీందర్ ఆప్యాయ పలకరింపులు  గుర్తుండే ఉంటాయి. ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 5 దశాబ్దాల పాటు రవి దినచర్య వార్తాపత్రికలను పాఠకులకు చేరవేయడమే. అతడు కేవలం దినపత్రికలను విక్రయించే “రవన్న”గా ప్రేమగా పిలుచుకునే వాడు. తరతమ్యా, వయో బేధాలు లేకుండా , అందరితో ఆప్యాయంగా మెలిగే సామాన్యుడు రవీందర్. సామాన్యుడైన రవీందర్ గురించి తెలుసుకోవడం అంటే ఐదు దశాబ్దాల సిరిసిల్ల పరిణామాలను తడిమి చూసుకోవడమే ..

ఐదు దశాబ్దాలలో అనేక మార్పులు.. అయినా ఆయన అక్కడే
సిరిసిల్ల ప్రాంతంలో ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నో మార్పులు, సామాజిక పరిణామాలు కాలంతో పాటు వేగంగా మారిపోతు వస్తున్నాయి. సిరిసిల్ల ఒకనాడు తాలూకా పరిధి నుంచి డివిజన్ గా అనంతర కాలంలో జిల్లాగా మన ముందు ప్రస్తుతం కొనసాగుతున్నది. సిరిసిల్ల ప్రాంతంలో 1978 నుంచి రవీందర్ దినపత్రికలను విక్రయిస్తూ వస్తున్నారు. వార్తలను బస్సుల ద్వారా చేరేవేసే కాలం నుంచి ఇప్పటి ఆధునిక పరిణామాల దాకా అనేక మార్పులకు రవీందర్ కాలంతో పాటు తాను ఓ సాక్షిగా నిలబడ్డాడు. కేవలం వార్త పత్రికల విక్రేత గానే కాకుండా  తన పరిధిలో ప్రజలకు అందించ గలిగే సేవలను అందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

తొలితరం పాత్రికేయుల నుంచి ఇప్పటిదాకా అందరికీ ఆత్మీయుడు..
ఇప్పుడు మన ముందున్న తీరుగా పాత బస్టాండ్ నమూనా ఒకప్పుడు అలా లేదు. పెద్ద వేప చెట్టు, సిమెంట్ వాటర్ ట్యాంక్, పరుచుకున్న టెలాలు, అనంతరం వచ్చిన వసంత్ విహార్ హోటల్, సుదీర్ఘ ప్రయాణాలకు నేలవుగా ఆవిర్భవించిన పాత బస్టాండ్. పాత బస్టాండ్ మధ్యలో దినపత్రికలతో పాటు అన్ని రకాల పత్రిక విక్రయించే బుక్ స్టాల్ ఆనాటి పాత తరానికి గుర్తుండే ఉంటుంది.! అనంతర కాలంలో సిరిసిల్ల మునిసిపల్ సహకారంతో ఏర్పాటై ప్రస్తుతం మనం చూస్తున్నా బస్టాండ్ కాంప్లెక్స్ ఇదంతా జరిగిన మార్పులకు కేంద్రంగా కనిపిస్తుంది. ఈ మార్పులతో పాటు సిరిసిల్ల లో తొలితరం పాత్రికేయులతో ప్రారంభమైన జీవనంతో నునుగొండ రవిని విడదీసి చూడలేమ్ .

తొలితరం పాత్రికేయులు..
సిరిసిల్ల లోని తొలి తరం పాత్రికేయులు మాగంటి భాస్కర్, కరుణాల భద్రాచలం, తడక విశ్వనాథం, మచ్చ ఆనంద్, తవుటు నాగభూషణం, రెండవ తరంలో క్రాంతి ప్రకాష్ శుక్ల, టి.వి. నారాయణ, ఊరడి మల్లికార్జున్, రాపేల్లి సంతోష్, జయంత్ కుమార్ ,రాచ లక్ష్మణ్, సిద్ధుల మురళి, కంబోజి ముత్యం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కొనసాగుతున్న పాత్రికేయులతో పూలదండలో దారంల పెనవేసుకున్న రవి జీవితాన్ని విడదీసి చూడలేం. సిరిసిల్ల పాత బస్టాండ్ లో 1978లో ప్రారంభమైన రవి జీవనంలో ప్రత్యేక ముద్రవేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సాదా సీదాగా కనిపించే రవి సమాజంలో విజ్ఞానం పెంపొందించేందుకు చేస్తున్న కృషిని గుర్తించి అప్పట్లోనే 1980లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్టిడిని ఏర్పాటు చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎస్.టి.డి బూత్ 1989 వరకు వచ్చిన పరిణామాల నేపద్యంలో తనకు ఆసరాగా ఉన్న కాస్త ఉపాధిని సైతం పెరిగిన సాంకేతి పరిజ్ఞానం ఎట్లా లేకుండా చేసిందో రవి చెబుతాడు తన జీవన ఉపాధి కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికి రవి వినంబరంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సురపరిచితులైన సీనియర్ పాత్రికేయులు జీవగడ్డ విజయ్ కుమార్ తో పాటు దేవులపల్లి అమర్ లాంటి వాళ్ళు కూడా రవిని గుర్తించి పలకరించే వారని రవి తెలిపారు. మరో సీనియర్ పాత్రికేయులు పద్మ పీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్ లాంటి వాళ్ల ఆత్మీయత ఇప్పటికి కొనసాగుతుందని రవి అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఆత్మీయ పలకరింపు రవి. కాలంతో పాటు సాగుతున్న ఐదు ఐదు దశాబ్దాల పరిణామ క్రమంలో సిరిసిల్ల పాత బస్టాండ్ తో ఇప్పటికీ విడదీయరాని బంధం “రవి”కి ఉన్నది. మనుషులతో ఎడతెగని ఆత్మీయత ఉన్నది. రవి పలకరింపులోని కొలవలేని ఆత్మీయత రవికి ఉన్నది. ఏప్పుడైనా పాత బస్టాండు వెళితే సమాచారాన్ని మోసుకొచ్చే పత్రికల్నే కాదు ఆ పత్రికలను అందించి పలకరించే “రవన్న” చిరునవ్వులు మనసును పలకరిస్తాయి. కాలంతో పాటు పెను వేసుకుని ఎన్నో పరిణామాలను పూస గుచ్చినట్లు చెబుతున్నట్లు అనిపిస్తుంది. సామాన్యుడితో సంభాషణ సిరిసిల్లతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది.ఎన్నో చారిత్రక పరిణామాలు గుర్తు చేస్తుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -