Sunday, July 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతీహార్‌ జైల్లోనే ఉన్నారు

తీహార్‌ జైల్లోనే ఉన్నారు

- Advertisement -

– బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకెప్పుడు పోరాడారు?
– ఎమ్మెల్సీ కవితకు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటించిన సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్‌ జైల్లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ గుర్తు చేశారు. జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాటం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, యడ్మ బొజ్జుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో కులసర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం విప్లవాత్మకమైన నిర్ణయాలని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని పట్టుదలతో ఉందన్నారు. దాన్ని కవిత తన విజయంగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు మనసు రావటం లేదని చెప్పారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశ పెట్టిన ఎన్నో బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని వివరించారు. బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్‌ నోరు విప్పడం లేదని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ బీసీ రిజర్వేషన్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీకి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల బిల్లుపై ఇంత వరకు కేంద్ర నుంచి ఉలుకు, పలుకు లేదని ఆయన విమర్శించారు.
చర్చకు రాకుండా సీఎంపై నిందలా? : బీఆర్‌ఎస్‌ నేతలపై చామల ఆగ్రహం
అసెంబ్లీలో చర్చకు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డిపై ఎందుకు నిందలు వేస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చారో గులాబీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రజలు ఆశిస్తున్నారని గుర్తు చేశారు. తాము నీటిపారుదల శాఖ గురించి మాట్లాడుతుంటే, బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పదేండ్లపాటు బీఆర్‌ఎస్‌ దోపిడీని 70 ఎంఎంలో చూపిస్తామన్నారు. దీన్ని పక్కదారి పట్టించేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ను బీఆర్‌ఎస్‌ మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏదో లింక్‌ పెట్టి డ్రామా చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -