Sunday, January 25, 2026
E-PAPER
Homeచౌరస్తావాడే వీడు

వాడే వీడు

- Advertisement -

సప్తసముద్రాల్ని, మహాపర్వతాల్ని, దట్టమైన అడవుల్ని, జంతువుల్నీ, మామూలు మనుషుల్నీ, మంచి మనుషుల్నీ, రకరకాల వృత్తులవాళ్లని, ఏ పనీ లేనివాళ్లని ముఖ్యంగా రాజకీయ నాయకుల్నీ మోస్తూ తిరుగుతున్నది భూమి. ఇంత భారాన్ని మోస్తూ తన చుట్టూ తాను తిరగడమే కాకుండా ఎండాకాలం ఎండల్లో మనుషులకి చెమట్లు పట్టించే సూర్యుడి చుట్టూతా తిరుగుతున్నది. క్షణం ఆగడానికి లేదు. డ్యూటీ మరొకళ్లకి ఒప్పచెప్పేది లేదు. ఎప్పట్నించి ఇలాగ తిరుగుతున్నదో తనకీ గుర్తులేదు. ఎప్పటిదాకా ఇలాగ తిరుగుతూనే వుండాలో అదీ అతీగతీ లేదు.

ఎవరి పని వారు చేసుకుంటూ పోతే, ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోకుండా వుంటే ఈ గ్లోబ్‌ అంత గ్లోబ్‌ మరొకటి వుండదు. అల్లర్లూ, అఘాయిత్యాలు, అకృత్యాలు కూడా వుండవు. ఇవన్నీ కొనసాగించే రాక్షసులనేవారూ వుండరు. రాక్షసులే లేకపోతే దేవుడనేవాడు అవతారాలు ఎత్తడు గాక ఎత్తడు.
ఒకప్పుడు ఇట్లాగే భూమి తన మానాన తను ఓ మూడొంతుల నీళ్లని, భూమి భారాన్ని మోస్తూ తిరగేస్తుంటే ఒకడొచ్చాడు కొమ్ములూ, కోరలూ వున్నవాడు కనుక రాక్షసుడే అయ్యుండాలి. ఆ వచ్చిన వాడు వికటంగా నవ్వుతూ, మీసాలు దువ్వుతూ, కనుబొమ్మలు ఎగరేస్తూ అచ్చోసిన ఆంబోతులా, అడ్రసు మరచిన యముడి దున్నపోతులా భూమి వైపు వచ్చాడు. భూమ్మీద మంచోళ్లని ఒక్కొక్కళ్లుగా పట్టుకుని టార్చర్‌ చెయ్యడం, చావగొట్టి చెవులు మూయడం అయ్యేపని కాదనుకున్నాడో ఏమో, ఏకంగా భూమ్మీదే పడ్డాడు. తిరుగుతూనే వున్న భూమి, తిరగడం ఆపలేని భూమి, నిస్సహాయంగా కేకలు వెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేని భూమి ఆ పనే చేసింది. ఎవరైనా ఏడుస్తుంటే, తలబాదుకుంటుంటే రాక్షసులకు ఎంత ఆనందంగా, ఎంత మజాగా, ఎంత హుషారుగా వుంటుందో అంత ఆనందంగా, మజాగా, హుషారుగా ఆ రాక్షసుడు భూమిని కాడ్నాప్‌ చేసి, భూమిని, భూమ్మీద కాని, భూమ్మీద వున్న సముద్రాల్లో కాని దాచిపెట్టడం కుదర్దు కదా అని ఎక్కడో పైలోకాల్లో వున్న సముద్రం అడుగున మకాం వేశాడు. వాడి చేతుల్లో విలవిల్లాడుతూ కూడా తిరగడం ఆపని భూమి కంటి కన్నీరు సముద్రపు ఉప్పునీటిలో కలిసి పోసాగింది. తన ఎదుటికి రాని హీరోను రప్పించడానికి విలన్‌, హీరోయిన్ను ఎత్తుకుపోవడం ఇప్పటిదే కాదు ఎప్పటినుంచో సాగివస్తున్న దుర్మార్గమే.
ఇలాగ భూమిని కిడ్నాప్‌ చేసి దానిమీద ఊపిరి పీలుస్తుండిన జనాల చేత ఆర్తనాదాలు చేయించిన రాక్షసుడి నించి రక్షింపబడింది కనుక, భూమి ఎప్పటిలాగే తిరుగుతుంది కనకే ఇప్పుడు మనం బతికి బట్టకట్టగలిగాం.

రాక్షసులందరూ అంతరించి పోవడంతో దేవుడనేవాడు అవతారాలు ఎత్తడం మానేశాడు. అయితే అంతరించి పోయిందనుకున్న రాక్షసజాతి ఇప్పుడు మనుషుల రూపంలో అవతరించడం మొదలు పెట్టింది. కోరలూ, కొమ్ములూ లేకపోతేనేం అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగడం మానలేదు.
అప్పుడెప్పుడో తనను కిడ్నాప్‌ చెయ్యడానికి వచ్చిన రాక్షసుడ్ని చూసి కెవ్వుమన్న భూమి ఇప్పుడూ అనేక రాజ్యాల్ని రాజ్యాలేలుతున్న వాళ్లని మోస్తూ ఎప్పటిలాగే తన చుట్టూ తానే తిరుగుతున్నది. వున్నట్టుండి ఎవడో తన మీదకు దూకినట్టనిపించి ఉలిక్కిపడ్డది భూమి, మళ్లీ మరో పుండాకోర్‌, బటాచోర్‌, కిడ్నాపర్‌ రాలేదు కదా అని.
భూమిని ఖండఖండాలుగా చీల్చారు కదా, ఖండఖండాల్ని దేశదేశాలుగా విడదీశారుగా, దేశ దేశాల్ని ప్రాంతాలుగా కోసి ముక్కలు చేశారుగా. మనుషుల్ని మతాల వారీగా బట్వాడా చేశారుగా. పీల్చడానికి గాలీ, తాగడానికి నీళ్లూ, తిండానికి తిండీ వున్నాయి కదా. ఊళ్లనీ దేశాల్నీ ఏలుకోవడానికి రాజులున్నారు కదా. ఎవడి కంచంలో వాడు తిని ఎవడి మంచంలో వాడు పడుకోకుండా వీడెవడు నా మీదకు దూకాడని భయంతో కళ్లుమూసుకుంది భూమి. భయంతో వణుకుతున్న భూమికి గతం గుర్తుకొచ్చింది. వికటంగా నవ్వుతూ, మీసాలు దువ్వుతూ, కనుబొమ్మలు ఎగరేస్తూ అచ్చోసిన ఆంబోతులా, అడ్రసు మరచిన యముడి దున్నపోతులా భూమివైపు వచ్చినవాడు గుర్తుకొచ్చాడు. వాడు చేతిలో ముళ్లదుడ్డుకర్రతో వచ్చాడు. కళ్లు తెరిచిచూసింది. ‘వీడు వాడుకాదేమో’ అనుకుంది.
వాడిలా కోరలూ, కొమ్ములూ కనిపించడంలేదు కానీ వీడు సూటు బూటు వేసుకుని నీటుగా కనిపిస్తున్నాడు అనుకుంది. సూటువేసుకున్నవాడు భుజాలు ఎగరేస్తూ ముఖాన్ని రకరకాలుగా తిప్పాడు. కోటు జేబులోనుంచి ఒక కాయిన్‌ తీసి గాల్లోకి విసిరేశాడు. ఆ కాయిన్‌ మీద వున్న గద్ద చెవులు చిల్లుపడేలా అరవసాగింది. అది అరవడం ఆపాక, వాడు ఈ భూమి నా స్వంతం. ఈ భూమి కడుపులో దాక్కున్న ఆయిలంతా నా స్వంతమే. నీ మీదగీసుకున్న రాజ్యాల హద్దులు చెరిపేయగలను. ఎవరితో ఎవరికైనా తగువు పెట్టేయగలను. అర్థరాత్రిపూట రాజ్యాలేల ేవాడ్నయినా సరే ఎత్తుకు వచ్చేయగలను. ప్రపంచ వ్యాపారాన్నే కాదు, ప్రపంచాన్నే శాసించగలను. మూడవ ప్రపంచ యుద్ధాన్ని తేగలను. ఎవరినైనా, ఏ దేశాన్నైనా మసి చేయగలను, ‘అయాం ద రూలర్‌’ అంటూ వుంటే భూమి వచ్చాడురా రాక్షసుడు మళ్లీ ‘వాడే వీడు’ అనుకుంది.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -