- Advertisement -
కనురెప్పలకు భయాన్ని
పులుముకొని పండుకున్నం
కరిమబ్బు మడతల్లో చిక్కుకున్న చందమామ
ఎంటికలిరబోసుకొని నల్లగ
పండ్లికిలించిన రాత్రి
కుండకు చిల్లు పడ్డట్టు
ఒకటే ధార
తైవాన్ పంపోలె దాని రువ్వడి
మనిషి మనిషికీ పువ్విచ్చి పలుకరిచ్చింది
బూడిదిల అగ్గి ఎలుగలె
ఆకలి తీరని పోరల
నీళ్ళ కలువరింత
నారుమడిల ఉన్నట్టు
ఒళ్ళంత సలుపు
వాతావరణ శాఖ
హెచ్చరికలకు గుండెల్ల
పిడుగులు పడ్తాన్నై
శరణార్థులు తరలించుడె
పభుత్వాల పని
రేటింగులు దండుకొనుడే
మీడియా వాటం
తెగే చెరువుకు ఎవడడ్డం పంటడు?
రంకెలేసే వాగుకు
ముగుతాడు ఏసెటోడున్నడా?
ప్రకతిని చెరపడ్తే
సంద్రం కడుపు మండుతది
తన అమ్ములపొదిలోని
తుఫాన్ విల్లంబులతో దాడి చేత్తది.
- దయాకర్ వడ్లకొండ, 9440427968
- Advertisement -


