అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మారుమూల ప్రాంతాలకు వైద్యం : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ‘హెల్త్ సిటీ’ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్‌ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో మారుమూల ప్రాంతాలకూ వైద్య సౌకర్యాలను చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం టీ హబ్ లో ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీఏఎల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్-2026’ ఫైర్‌సైడ్ చాట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైలింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మహిళలకు ముందస్తు క్యాన్సర్ నిర్థారిత పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని వివరించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా మార్చాలనే సంకల్పంతో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. ఆరోగ్యరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
దీనికోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ‘తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్’ను ప్రారంభించామన్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందనీ, మరో నాలుగు నెలల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ధీటుగా రాష్ట్రంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను కూడా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆ నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీలో ‘హెల్త్ సిటీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



