నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డా. ఏంజెల్ విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పేరు పరిధిలోని పరుమాల గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. ఏంజెల్, ఆరోగ్య సిబ్బంది పాల్గొని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. ఏంజెల్ హాస్టల్ విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్య స్థితిని పరిశీలించి, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగనిరోధక చర్యలు గురించి వివరించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, శుభ్రతే ఆరోగ్యానికి మూలమని తెలియజేశారు. హాస్టల్ వంటశాలను సందర్శించిన డా, ఏంజెల్ అక్కడి ఆహార పదార్థాల తయారీ, భోజనం అందించే విధానం, త్రాగునీటి పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం ఎల్లప్పుడూ శుభ్రంగా, పోషక విలువలతో కూడినదిగా ఉండాలని ప్రిన్సిపల్, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
హాస్టల్‌లో అత్యవసర పరిస్థితులకు ప్రాధమిక వైద్య మందులు అందుబాటులో ఉంచుకోవాలని స్టాఫ్ నర్స్ కు సూచించారు. విద్యార్థులలో సాధారణ వ్యాధులపై అవగాహన పెంచే విధంగా, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ రవిచంద్ర, సూపర్వైజర్ విజయ్ భాస్కర్, ఎమ్మెల్యే హెచ్ పి శ్వేత, ఏఎన్ఎం రాధ, ఆశ వర్కర్,ప్రిన్సిపల్ అనిలా కుమారి, స్టాఫ్ నర్సులు గౌతమి, లావణ్య, అలాగే హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.



