ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
సుశ్రుత పీపుల్స్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా 2కే రన్
ఆకర్షణగా నిలచిన జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
ఆరోగ్యానికి నడక మంచిదని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సుశ్రుత పీపుల్స్ ఆస్పత్రి 25వ వార్షికోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని న్యూటన్‌లోని ఆస్పత్రి నుంచి జిల్లా మైదానం వరకు 2కే రన్ నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ విప్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, మన జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. రోజువారీ జీవితంలో కనీసం కొంత సమయం నడక, వ్యాయామం, యోగవంటి ఆరోగ్య అలవాట్లకు కేటాయించడం అవసరమని సూచించారు. ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి : జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్
సుశ్రుత పీపుల్స్ ఆస్పత్రి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్‌ప్రసాద్.. జబర్దస్త్‌లో వేసిన డైలాగుల మాదిరిగా అందర్నీ నవ్విస్తూ తనదైన స్టైల్‌లో ప్రసంగించారు. 2కే రన్ చివరి వరకూ అందరితో కలిసి పరిగెత్తారు. యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం
సుశ్రుత పీపుల్స్ హాస్పిటల్ 2001లో కేవలం 2 విభాగాలు, 20 పడకలతో ప్రారంభమై, ప్రస్తుతం 12 విభాగాలు, 120 పడకల సామర్థ్యంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని సుశ్రిత ఆస్పత్రి ఎండీ డాక్టర్ మధుసుదన్ రెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిభ తెలిపారు. సమాజంలో ఆడపిల్లలపై వివక్ష తగ్గాలని, గర్భంలోనే ఆడపిల్లలను హత్య చేయడం వంటి దురాచారాలను పూర్తిగా నిరోధించాలని పిలుపునిచ్చారు. సరైన శుభ్రత పాటించడం ద్వారా అనేక సంక్రమణ వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. డా. ప్రేమ్ ఆధ్వర్యంలో జుంబా డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్టిఫైడ్ ట్రైనర్ ప్రశాంత్ హాజరైన వారందరికీ జుంబా డాన్స్ నేర్పించి ఉత్సాహాన్ని నింపారు. వేడుకలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జె. రాంమోహన్, డాక్టర్ సామ్యెల్, డాక్టర్ ఏగూర్ ఆనంద్, డాక్టర్ విజయ్ కాంత్, సీపీఐ(ఎం) సీపీఐ ప్రజా సంఘాల నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
-ఆస్పత్రి ఎండీ డా|| మధుసూదన్ రెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా. ప్రతిభ



