నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటుకు నోటు కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్యపై దాఖలైన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. అమికస్ క్యూరీగా వ్యవహరిస్తోన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే తప్పుకోవడంతో తదుపరి వాదనలను వచ్చే సోమవారం వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య పై 2016 లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అదే ఏడాది జులై 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్ సన్ సైతం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, ప్రతివాది మత్తయ్య తరపున ప్రియాంక ప్రకాశ్, ఇతర న్యాయవాదులు హాజరయ్యారు. తొలుత మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ… ఈ కేసులో చార్జిషీట్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని నివేదించారు. అలాగే మత్తయ్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను విచారించేందుకు అవకాశం దక్కలేదని తెలిపారు.
మరోవైపు ఈ కేసులో ఏ4 గా ఉన్న మత్తయ్య పై ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు క్వాష్ చేసిందని కోర్టు దష్టికి తెచ్చారు. కేసు దర్యాప్తు కీలకమని, ఇందులో మత్తయ్య విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందునుంచి వాదిస్తోందన్నారు. ఈ కేసులో సప్లమెంటరీ చార్జిషీట్ కూడా దాఖలు చేయబోతోందని… దీనిపై హైకోర్టు మిని ట్రయల్ నిర్వహించిందన్నారు. అయితే కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉండగానే మత్తయ్య పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి క్వాష్ చేయడం సరికాదన్నారు. కేవలం ప్రైమా ఫేసియా ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకుందని వాదనలు వినిపించారు. అందువల్ల క్వాష్‌ను కొట్టివేయాలని కోరారు. మరోవైపు ఈ కేసులో అమికస్ క్యూరీగా తప్పుకుంటున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలని సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ దవే సీజేఐ బెంచ్‌ను అభ్యర్థించారు. ఇందుకు అనుమతించిన బెంచ్… ఈ పరిణామంతో విచారణ వాయిదా వేస్తున్నట్టు సీజేఐ వెల్లడించారు. మరోసారి మేనకా గురుస్వామి జోక్యం చేసుకొని… దాదాపు 2016 నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ, వచ్చే సోమవారం ఈ కేసును విచారిస్తామని వెల్లడించారు.
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- Advertisement -
- Advertisement -