హృదయవిదారకం

మణిపూర్‌లో పరిస్థితులపై రాహుల్‌
ఇంఫాల్‌ : జాతి హింసతో అట్టుడికిన మణిపూర్‌లో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ రెండో రోజూ పర్యటించారు. హింసతో ప్రభావితమైన ప్రజలను తాను కలిసిన తర్వాత అక్కడి పరిస్థితి గుండెను కలచివేసిందని అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్టు చేశారు. ”మణిపూర్‌లో హింస కారణంగా తమ ప్రియమైనవారిని, ఇండ్లను కోల్పోయిన బాధితుల వేదన వినటం, వారి పరిస్థితిని చూస్తే హృదయవిదారకంగా ఉన్నది. నేను కలిసిన ప్రతి ఒక్క సోదరుడు, సోదరి, చిన్నారి ముఖంలో సాయం కోసం ఏడుపు కనిపించింది” అని రాహుల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతికి ఆయన పిలుపునిచ్చారు. ” మన ప్రజల జీవితాలు, జీవనోపాధికి భద్రత కల్పించటం కోసం మణిపూర్‌నకు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం శాంతి. ఆ లక్ష్యం దిశగా మన ప్రయత్నాలన్నీ ఏకం కావాలి” అని రాహుల్‌ తన పోస్టులో వివరించారు.
శుక్రవారం బిష్ణుపూర్‌ జిల్లాలోని మోయిరాంగ్‌లో గల రెండు సహాయ శిబిరాలను రాహుల్‌ సందర్శించారు. ఈ రెండు శిబిరాల్లో దాదాపు వెయ్యి మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. ఇంఫాల్‌ నుంచి మోయిరాంగ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న రాహుల్‌.. బాధిత ప్రజలను కలిసి వారి బాధను విన్నారు.
రాహుల్‌ తన పర్యటనలో మణిపూర్‌ సివిల్‌ సొసైటీ సంస్థల సభ్యులను కలిసి వారి సమస్యలను విన్నారు. కోఆర్డినేషన్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇంటీగ్రిటీ, యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌ ప్రతినిధులు, షెడ్యూల్‌ ట్రైబ్‌ డిమాండ్‌ కమిటీ, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ బిమోల్‌ ఎ వంటి ముఖ్య నాయకులను రాహుల్‌ కలిశారు. రాహుల్‌ పర్యటనలో ఆయనతో పాటు మణిపూర్‌ మాజీ సీఎం ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌, పార్టీ జనరల్‌ సెక్రెటరీ(ఆర్గనైజేషన్‌) కెసి వేణుగోపాల్‌, పీసీసీ అధ్యక్షులు కెశం మేఘచంద్ర, ఇతర నాయకులు ఉన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మణిపూర్‌కు గురువారం చేరుకున్న రాహుల్‌.. అల్లర్లకు కేంద్ర స్థానమైన చురాచాంద్‌పూర్‌నకు తన వాహనశ్రేణితో వెళ్లడానికి యత్నించిన విషయం విదితమే. అయితే, బిష్ణుపూర్‌ ప్రాంతంలో ఆయన కాన్వారును పోలీసులు అడ్డుకోవటం.. అక్కడ కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం.. ఆ తర్వాత రాహుల్‌ ఇంఫాల్‌కు తిరిగి వచ్చి అక్కడి నుంచి ప్రభుత్వం కల్పించిన హెలికాప్టర్‌లో చురాచాంద్‌పూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలతో రాహుల్‌ కలిసి మాట్లాడారు.

Spread the love