నవతెలంగాణ – పాలకుర్తి: ఎడతెరిపి లేకుండా బుధవారం వాన దంచి కొట్టడంతో పాలకుర్తి పట్టణంతో పాటు పాలకుర్తి మండలం అతలాకుతలమయ్యింది. భారీ వర్షానికి వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రంలో గల ఎర్ర మల్లయ్య కుంట నిండడంతో సంచార జాతుల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షానికి వాగులు, వంకలు, ఉప్పొంగాయి. వర్షపు వరదకు వరి పంట నేలమట్టం కావడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం రాశులన్నీ నీటిలోనే దర్శనమిస్తున్నాయి.
భారీ వర్షానికి రైతులతో పటు ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. పాలకుర్తి పట్టణంలో గల పోతన కళాశాల సమీపంలో విశ్వసాయి కాలనీ నీట మునగడంతో ఇళ్లలోకి నీరు చేరడం ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వర్షపునీరు కల్వర్టుల వద్ద ఎక్కువ కావడంతో రోడ్లపై నుండి ప్రవహించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడం వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. వరి పంటతోపాటు పత్తి పంట రైతులను అపార నష్టాన్ని కలిగించాయి. కొనుగోలు కేంద్రాల పరిశీలనతో పాటు నష్టపోయిన పంటలను తహసీల్దార్ నాగేశ్వర చారి ఆధ్వర్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందారు. ధాన్యం రాశులను కాపాడుకునేందుకు రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.



