హైదరాబాద్‌లో భారీ వర్షం

In Hyderabad heavy rain– ట్రాఫిక్‌ జామ్‌.. వాహనదారుల ఇబ్బందులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో ముందుగా ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షపు జల్లులు పడ్డాయి. ఆ తర్వాత ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కూకట్‌పల్లి, బాలానగర్‌, మూసాపేట్‌, పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. శిల్పారామం, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, తార్నాక, లక్డీకాపూల్‌, కోఠి, గబ్చిబౌలి, మాదాపూర్‌, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, అబిడ్స్‌, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్‌, వనస్థలిపురం, మెహిదీపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. పలుచోట్ల వాహనాలు ఆగిపోయాయి. కాలనీల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
నల్లగొండలో పిడుగులు..
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కుంకుడు చెట్టు పంచాయతీ పరిధిలోని నేరటోనీగూడెం గ్రామానికి చెందిన నీరుటి రైతు సైదయ్య ఎద్దు పిడుగుపాటుకు మృత్యువాతపడింది. నీమానాయక్‌ తండా పంచాయతీ పరిధిలోనీ పుల్యా తండాలో రమావత్‌ శ్రీను నాయక్‌ నాలుగు మేకలు, రామావత్‌ సకృనాయక్‌ ఆరు మేకలు, రమావత్‌ మాతృ నాయక్‌ నాలుగు మేకలు, రామావత్‌ భీకోజీ నాయక్‌ మూడు మేకలు, ఊరబాయి తాండకు చెందిన రమావత్‌ ముని నాయక్‌ మూడు మేకలను పూల్య తండా సమీపంలోని వరద కాలువలు పక్కన ఏర్పాటు చేసిన కొట్టంలో ఉంచారు. మంగళవారం వారం రాత్రి 10.30 గంటల సమయంలో కొట్టంపై పిడుగు పడటంతో 20 మేకలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి.
నవతెలంగాణ – ఆళ్లపల్లి
కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో పిడుగు పడి ఒ బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మేకల సంతోష్‌ వేసవి సెలవుల్లో ఆడుకుంటూ మామిడిచెట్టు కిందకి వెళ్లగా అప్ఫుడే పిడుగు పడింది.

Spread the love