ఉప్పల్‌లో 8.55 సెంటీమీటర్ల వాన
పలు ప్రాంతాల్లోనూ ఐదు సెంటీమీటర్లకుపైన వర్షం
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షం పడే అవకాశం
12 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల గురువారం భారీ వర్షం కురిసింది. రాత్రి పది గంటల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్‌లో అత్యధికంగా 8.55 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. సాయంత్రం పూట వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు పది జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 384 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 6 ప్రాంతాల్లో భారీ వర్షం, 161 ప్రాంతాల్లో మోస్తరు వర్షం(6.43 సెంటీమీటర్ల నుంచి 1.6 సెంటీమీటర్ల వరకు) కురిసింది.
భారీ వర్ష పాతం నమోదైన ప్రాంతాలు
ఉప్పల్ (జీహెచ్‌ఎంసీ) 8.55 సెంటీమీటర్లు
వేంసూరు(ఖమ్మం) 8.30 సెంటీమీటర్లు
బెల్లంపల్లి(మంచిర్యాల) 8.00 సెంటీమీటర్లు
నాచారం(జీహెచ్‌ఎంసీ) 7.83 సెంటీమీటర్లు
మారేడుపల్లి(జీహెచ్‌ఎంసీ) 7.00 సెంటీమీటర్లు
మధిర(ఖమ్మం) 7.00 సెంటీమీటర్లు
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES