పలుప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం
700కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
వచ్చే ఐదురోజులు వానలు
25న బంగాళాఖాతంలో అల్పపీడనం, 27న తీరం దాటే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పదున్నర గంటల వరకు 700కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, హన్మకొండ, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో 30కిపైగా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యాదాద్రిభువనగిరి జిల్లా రాజపేట మండలం పాముకుంట గ్రామంలో అత్యధికంగా 12.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందనీ, దానికి అనుబంధంగా సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వాయుగుండంగా బలపడే సూచనలున్నాయి. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం సమీపంలో ఈ నెల 27న తీరం దాటే అవకాశముంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు తెలంగాణ మీదుగా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వానలు పడొచ్చు. అదే సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయి.
ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆ జాబితాలో కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్‌భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడా భారీ వర్షం పడే సూచనలు బలంగా ఉన్నాయి.
అత్యధిక వర్షం పడిన ప్రాంతాలు
పాముకుంట(యాదాద్రి భువనగిరి) 12.65 సెంటీమీటర్లు
బంజారాహిల్స్(హైదరాబాద్) 10.55 సెంటీమీటర్లు
మల్లంపల్లి(ములుగు) 10.40 సెంటీమీటర్లు
ఆత్మకూర్(హన్మకొండ) 10.15 సెంటీమీటర్లు
రాజపేట(యాదాద్రి భువనగిరి) 10.05 సెంటీమీటర్లు
నర్మెట్ట(జనగామ) 10.03 సెంటీమీటర్లు
ఖైరతాబాద్ (హైదరాబాద్) 10.00 సెంటీమీటర్లు
గుండాల(భద్రాద్రి కొత్తగూడెం) 9.8 సెంటీమీటర్లు
కొండపాక(సిద్దిపేట) 9.6 సెంటీమీటర్లు