– పిడుగు పడి ఇద్దరు బాలురు మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు..
– క్రికెట్ ఆడుతుండగా వర్షంతోపాటు పిడుగు
నవతెలంగాణ-తూప్రాన్/ఇంద్రవెల్లి
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపో యింది. లారీల కొరతతో కాంటాలు కాక తమ ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పలుచోట్ల ఇండ్ల కప్పులు లేచిపోయాయి. చెట్లు కూలాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లి గ్రామంలో పిడుగు పడి వెంగలి ప్రసాద్(15), నడిపల్లి యశ్వంత్(13) ప్రాణాలు కోల్పోయారు. మరో బాలుడు ముఖద్దం రవికిరణ్(14) తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకెళ్లగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పడాలపల్లి గ్రామానికి చెందిన వెంగలి ముత్యాలు కొడుకు వెంగలి ప్రసాద్, నడిపల్లి యశ్వంత్, రవికిరణ్‌తో పాటు మరికొంత మంది గ్రామ శివారులో గల పెద్దకుంట వద్ద క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో వెంటనే వారు పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో వెంగలి ప్రసాద్, నడిపల్లి యశ్వంత్ అక్కడికక్కడే మృతిచెందారు. ముఖద్దం సుధాకర్ కొడుకు రవికిరణ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంగలి పప్రసాద్ ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణులు కాగా, యశ్వంత్ 9వ తరగతి చదువుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శివానందం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం పడాలపల్లి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈదురు గాలుల బీభత్సం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాగూడ(జి), ధర్మసాగర్‌లో శుక్రవారం రాత్రి ఈదురుగాలుల ధాటికి ఇంటిపై కప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు రాత్రంతా చీకట్లో గడిపారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారు.
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని వెల్పుచర్ల గ్రామానికి చెందిన రైతులు జనగాం-సూర్యాపేట రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంటాలు వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం, మరోవైపు మిల్లులకు పంపిన ధాన్యం సక్రమంగా లేదంటూ తిరిగి వెనక్కి పంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అర్వపల్లి ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
భారీ ఈదురు గాలులతో వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES