జలగలంచ, గుండ్ల వాగు ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క
ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు
శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు
నవతెలంగాణ – తాడ్వాయి
ఏజెన్సీలో నిన్న మంగళవారం నుండి విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ చింతల్ క్రాస్ వద్ద ఉన్న జంపన్న వాగు లో లెవెల్ బ్రిడ్జి పొంగిపొర్లుతుంది. పడిగాపూర్, ఎలుబాక గ్రామాల ప్రజల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడి నిలిచిపోయాయి. 163 వ జాతీయ రహదారి పస్రా నుండి తాడ్వాయి మధ్యలో గల గుడ్ల వాగు, జలగలంచ వాగు లు తీవ్ర రూపం దాల్చాయి. జలగలంచ – గుండ్ల వాగు ల వరద పరిస్థితిని, బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వయంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా, ప్రత్యేకంగా ములుగు జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధికారులు వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలను ముందుగానే హెచ్చరించాలనే ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ములుగు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే ఆ నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలను ఆమె కోరారు. విద్యుత్ తీగలు పడిపోయిన చోట రైతులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాలకు గురి కాకుండా తగిన జాగ్రతల్లు పాటించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెల్లోద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి, ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కింది స్థాయి అధికారులతో సమన్వయంగా మానిటరింగ్ చేయాలని ఆమె ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES