– బెజ్జూరు, వెంకటాపురంలో కుండపోత వర్షం
– 841 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– వచ్చే నాలుగు రోజులు కూడా భారీ వర్షాలే
– ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 841 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వర్ష తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడ్డాయి. కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 23.5 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురంలో 21.5 సెంటీమీటర్ల చొప్పున కుండపోత వర్షం కురిసింది. వచ్చే నాలుగు రోజులు పాటు కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న ప్రకటించారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గురువారానికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయి. అదే సమయంలో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చు. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
బెజ్జూర్(కొమ్రంభీమ్ అసిఫాబాద్)
23.5 సెంటీమీటర్లు
వెంకటాపురం(ములుగు) 21.5 సెంటీమీటర్లు
మంగపేట(ములుగు) 12.0 సెంటీమీటర్లు
అలుబాక(ములుగు) 11.5 సెంటీమీటర్లు
కరీంనగర్ 11.3 సెంటీమీటర్లు
రాష్ట్రంలో విస్తారంగా వానలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES