4389 మంది రౌడీలు బైండోవర్
1308 సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత
ఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్
ఆధారాలన్నీ కోర్టులో భద్రం
పోలింగ్‌బూత్ వెలుపల కూడా
వెబ్‌కాస్టింగ్ : డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో బుధవారం జరుగనున్న ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల పోలింగ్‌కు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశామని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 4389 మంది రౌడీలు, గూండాలను బైండోవర్ చేశామనీ, 389 నాన్‌బెయిలబుల్ వారెంట్లను జారీ చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3.09 కోట్లు విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, గిఫ్ట్‌లను స్వాధీనపర్చుకున్నామన్నారు. ఇందులో రూ.1.29 కోట్లు నగదు ఉన్నదని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా 1200కు పైగా లైసెన్స్‌గల ఆయుధాలను స్వాధీనపర్చుకొని పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేశామన్నారు. మొత్తం 8వేలకు పైగా ఉన్న పోలింగ్‌బూత్‌లలో 1308 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించామనీ, ఈ ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లతో అదనంగా నిరంతర గస్తీని కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల వెలుపల కూడా వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి మరింతగా నిఘాను పెంచామని తెలిపారు. పోలింగ్ బందోబస్తు కోసం ఆయా జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు తమ పర్యవేక్షణలోని సివిల్, ట్రాఫిక్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను పూర్తిగా బందోబస్తుకు నియోగించారని తెలిపారు. వీరికి అదనంగా మరో మూడువేల మంది అధికారులు, సిబ్బందిని అటవీ, తూనికలు, కొలతలు, ఎక్సైజ్ విభాగాల నుంచి బందోబస్తుకు రంగంలో దించామని ఆయన వివరించారు. ఎన్నికల బందోబస్తుకు సంబంధించి గత 15 రోజులుగా ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇప్పించామని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్ కేసులకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే సంబంధిత కోర్టులకు సమర్పించడం జరిగిందనీ, అవి ధ్వంసమైనట్టుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రమూ నిజం లేదని డీజీపీ ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో ఉన్న పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేసి తగిన సూచనలు ఇవ్వడానికి పూణేలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చెందిన నిపుణులు, నాగ్‌పూర్‌లోని ఆలిండియా ఫైర్ సర్వీసెస్‌కు చెందిన నిపుణులు వచ్చారనీ, వారి అధ్యయనం అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఎఫ్‌ఎస్‌ఎల్‌లో దగ్ధమైన కంప్యూటర్లలోని డేటాను తిరిగి సేకరించడానికి అవసరమైన చర్యలను నిపుణులు తీసుకుంటున్నారని చెప్పారు.
గతంలోనే ఒకసారి ఇదే ల్యాబ్‌లో భారీ పేలుడు జరిగిన నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాకరమైన ఈ ల్యాబ్‌ను సురక్షితంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోలేదా అనే ప్రశ్నకు అన్ని కోణాల నుంచి ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తున్నామనీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిని సారించామని శివధర్‌రెడ్డి అన్నారు. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్పను ఒక మంత్రి బెదిరించిన కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలను ఆయన దృష్టికి విలేకరులు తీసుకురాగా.. ఆ ఘటనపై కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామనీ, ఇతర ఆరోపణలేవీ తన దృష్టికి రాలేదని డీజీపీ జవాబిచ్చారు. మున్సిపల్ పోలింగ్ పూర్తయ్యాక 130 స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చి కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. పోలింగ్ రోజున నిబంధనలను అతిక్రమించేవారు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్ భగవత్ కూడా పాల్గొన్నారు.
పురపోరుకు భారీ బందోబస్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



