Monday, December 29, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అసెంబ్లీకి భారీ బందోబస్తు

అసెంబ్లీకి భారీ బందోబస్తు

- Advertisement -

– పరిసరాల్లో నిషేధాజ్ఞలు
– భద్రతపై సీపీ సమీక్ష
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతుం డటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలను కూడా విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మారు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలుండటంతో పోలీసు అధికారులు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సాయుధ పోలీసులను అడుగడుగునా నియమించడంతో పాటు మెయిన్‌ గేట్ల నుంచి లోనికి వెళ్లే మార్గాల్లో ప్రతీ వాహనాన్ని సోదా చేసి లోనికి వదిలేలా చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ లాబీ వద్ద కూడా మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తినీ సోదా చేసి వదిలేలా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పాస్‌లను ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాలనీ, మంత్రులు, శాసనసభ్యుల వెంట పాసులు లేకుండా ఎవరైనా వస్తే వారిని ఆపివేయాలని పోలీసులకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

అసెంబ్లీ వైపునకు వచ్చే చౌరస్తాలలో ముందుజాగ్రత్త చర్యగా పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేయడమేగాక ఆందోళనకారులు ఎవరు వచ్చినా నిలువరించడానికి ఇనుప కంచెలను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కిలోమీటరు పొడవునా ఎవరు కూడా లాఠీలు, పేలుడు పదార్థాలు తీసుకురావడంతో పాటు గుమిగూడటం వంటి చర్యలకు పాల్పడకుండా నిషేదాజ్ఞలను విధించారు. అసెంబ్లీ భద్రతపై తీసుకున్న చర్యలను నగర పోలీసు కమిషనర్‌ వి.సి సజ్జనార్‌.. అధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. కాగా అసెంబ్లీకి నలువైపులా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేస్తున్న తీరును కూడా కమిషనర్‌ పరిశీలించారు. నగర పోలీసులతో పాటు సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, టీఎస్‌ఎస్‌పీ, గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ బలగాలను కూడా బందోబస్తుకు వినియోగిస్తున్నారు. అంతేగాక అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన భద్రతను జాయింట్‌ పోలీసు కమిషనర్‌ తఫ్సీల్‌ ఇక్బాల్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి, ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయెల్‌ డేవిస్‌తో కలిసి కమిషనర్‌ పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -