అమెరికాకు చెందిన హెలెన్ కెల్లర్ ప్రఖ్యాత రచయిత, అంగవైకల్య హక్కుల పరిరక్షకురాలు, న్యాయవాది, రాజకీయ కార్యకర్త, పౌర హక్కుల పరిరక్షకురాలు, శ్రామికవర్గ పక్షపాతి, ఉపన్యాసకురాలుగా తనదైన బహుముఖీయ ప్రజ్ఞాశాలి. చిరుప్రాయంలోనే బ్రెయిన్ ఫివర్ కారణంగా కంటి చూపును కోల్పోయి, చెవిటితనం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా కొనసాగించారు. లక్ష్య సాధనకు అంగవైకల్యం అడ్డుకాదని, తను చీకట్లో నిలిచి ప్రపంచానికి దీపస్తంభంగా మార్గనిర్దేశం చేసిన హెలెన్ కెల్లర్ ప్రతిభ అద్వితీయం, అనన్యసామాన్యం, అనుసరణీయం. హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో 14 ఏండ్ల సానియా ఖాతూన్ ముందుకు సాగుతోంది. కంటిచూపు లేకపోయినా జాతీయ స్థాయి చెస్ పోటీల్లో టాప్ -10 స్థానాల్లో నిలుస్తోంది. పారా ఒలింపిక్స్, పారా ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనాలనేది తన జీవిత లక్ష్యమని చెబుతున్న సానియాపై జోష్ ప్రత్యేక కథనమిది.
సానియా ఖాతూన్ బెంగాల్‌లో అసన్‌సోల్ పట్టణానికి సమీపంలోని జమూరియా గ్రామంలో జన్మించింది. వారిది నిరుపేద కుటుంబం. సానియాకు పుట్టుకతోనే చూపు లేదు. గోరుచుట్టుపై రోకటి పోటులా చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. దీంతో కుటుంబ భారం తల్లిపై పడింది. కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని సానియా తల్లి పోషిస్తోంది. ‘సానియా ఒక ఆడపిల్ల. ఆమెకు కంటి చూపు కూడా లేదు. ఇంటిపట్టునే ఉంచండి’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు ఇచ్చే సలహాలు సానియా ఖాతూన్‌ను చాలా బాధించేవి. తన కూతురి జీవితం ఏమవుతుందో అని ఆవేదన ఆ తల్లిది. ఈ క్రమంలోనే అసన్‌సోల్ పట్టణంలో ఉన్న బ్రెయిలీ అకాడమీ గురించి ఆమెకు తెలిసింది. అక్కడ అంధ విద్యార్థులకు చదువు, వసతి, దుస్తులు, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇస్తారని తెలుసుకున్న ఆ తల్లి… మరో మాటకు తావు లేకుండా తక్షణమే అసన్‌సోల్ పట్టణానికి కూతుర్ని తీసుకొని పరుగులు తీసింది. తన బిడ్డ జీవితం బాగుపడటానికి ఆమె దొరికిన ఏకైక అవకాశం అది మరి. అందులో సానియా ఖాతూన్‌ను చేర్పించింది. ఇదంతా ఎనిమిదేండ్ల క్రితం ముచ్చట.
చెస్ ప్లేయర్‌గా తీర్చిదిద్దిన బ్రెయిలీ అకాడమీ
ఇప్పుడు సానియా ఖాతూన్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. కంటిచూపు లేకపోయినా చదువులతో పాటు చెస్ ఆటలో సత్తా చాటుకుంటోంది. కోల్‌కతా నుంచి వచ్చిన స్పెషల్ కోచ్, అసన్‌సోల్‌కు చెందిన స్థానిక కోచ్‌ల పర్యవేక్షణలో ఆమె చెస్‌లో ఆరితేరింది. కంటికి ఏమీ కనిపించకున్నా, చెస్ బోర్డుపై ప్రత్యర్ధిని చిత్తు చేసే ఎత్తులు వేస్తూ సానియా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జిల్లా, రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో అద్భుతంగా రాణించడంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో సానియా పాల్గొని టాప్-10 స్థానాల్లో చోటును సంపాదించింది. ఆయా పోటీలకు వెళ్లేందుకు రవాణా ఖర్చులు, హోటల్ వసతి ఖర్చులు కావాలి. ఈ నిధులను బ్రెయిలీ అకాడమీ నిర్వాహకులు, సానియా ఉపాధ్యాయులు అందిస్తున్నారు.
సానియా ఖాతూన్ టార్గెట్ పారా ఒలింపిక్స్
నేను అసన్‌సోల్‌లో, జిల్లా స్థాయిలో జరిగే అన్ని చెస్ పోటీల్లోనూ పాల్గొంటున్నాను. కోల్‌కతాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకూ హాజరవుతున్నాను. పలుసార్లు జాతీయ స్థాయి పోటీలలోనూ టాప్ -10 స్థానాల్లో చోటు సంపాదించాను. జాతీయ స్థాయిలో టాప్ -3 స్థాయికి ఎదగాలనేది నా లక్ష్యం. పారా ఒలింపిక్స్, పారా ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనాలన్నది నా కోరిక. దానికోసం బాగా చెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. బ్రెయిలీ అకాడమీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఈ అకాడమీలో నాకు చదువుతో పాటు మ్యూజిక్, కంప్యూటర్స్, హస్తకళలను కూడా నేర్పుతున్నారు.
సానియాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం
2007 నుంచి అసన్‌సోల్‌లో బ్రెయిలీ అకాడమీని నిర్వహిస్తున్నామని హెడ్ మాస్టర్ అభిజిత్ మండల్ తెలిపారు. ప్రస్తుతం మా హాస్టల్‌లో 30 మంది అంధ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నాం. వారికి చదువు, వసతి, దుస్తులు, ఆహారం, పుస్తకాలు అన్నీ ఫ్రీ. చెస్ లాంటి గేమ్స్‌తో పాటు సంగీతం, కంప్యూటర్స్, హస్తకళలను కూడా స్టూడెంట్స్‌కు నేర్పిస్తున్నాం. సానియా ఖాతూన్ చెస్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు మావంతుగా సహకారాన్ని అందిస్తూనే ఉంటాం. అవసరమైతే బెంగాల్‌లోని ఏవైనా కంపెనీల నుంచి స్పాన్సర్‌షిప్‌ను కోరుతాం. వాటి నుంచి ఆర్థికసాయం లభిస్తే సానియాకు ఉపయోగకరంగా ఉంటుంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
హెలెన్ కెల్లర్ వాసరసురాలు సానియా
- Advertisement -
- Advertisement -