– బీసీ రిజర్వేషన్లపై హస్తినలోనే తేల్చుకుందాం
– 200 మంది ప్రజాప్రతినిధులతో రాష్ట్రపతి వద్దకు
– ఆగస్టు 5న పార్లమెంటులో వాయిదా తీర్మానం
– 6న జంతర్‌మంతర్ వద్ద ధర్నా : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం
– అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఎత్తివేత
– మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు
– జీవో 33పై ఏజీతో చర్చలు
– నాలుగున్నర గంటల పాటు భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలోనే అమీతుమీ తేల్చుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 5,6,7 తేదీల్లో ఢిల్లీలోనే మకాం వేసి, 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకురావాలని నిర్ణయించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు నాలుగున్నర గంటలపాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదంలో కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఆగస్టు 5వ తేదీ పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 6వ తేదీ రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులందరితో కలిసి జంతర్‌మంతర్ వద్ద ‘చలో ఢిల్లీ’ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 7వ తేదీ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో దాదాపు 200 మంది ప్రజాప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి, పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లుల్ని ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. పంచాయతీ రాజ్‌చట్టం-2018లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు పంపిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను న్యాయ పరిశీలన కోసం ఆయన రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆమలు కావాలంటే కీలకమైన ఈ బిల్లు ఆమోదం తప్పనిసరి. అందువల్ల దీనిపై నేరుగా రాష్ట్రపతినే కలిసి, విన్నవించాలని నిర్ణయించారు.
చెక్‌పోస్టులు ఎత్తివేత
రాష్ట్రంలో రవాణాశాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్ని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర సరిహద్దుల్లోని మొత్తం 15 చెక్ పోస్టులు ఎత్తివేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వీటిని తొలగించాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే ఈ చెక్ పోస్టుల్ని రవాణాశాఖ సిబ్బందితో కాకుండా వాహన్, అడ్వాన్స్‌డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాల్లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేయాలని నిర్ణయించారు. మెడికల్ సీట్లకు సంబంధించిన జీవో 33పై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ విద్యార్థులకే మెడికల్ సీట్లు వచ్చేలా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని మంత్రులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీనికోసం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డితో మాట్లాడి, సుప్రీంలో వాదనల కోసం సమర్థులైన న్యాయవాదుల్ని నియమించుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ మీడియాకు వివరించారు.
చలో ఢిల్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES