No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeమానవిపాటే ప్రాణంగా ఆమె పయనం

పాటే ప్రాణంగా ఆమె పయనం

- Advertisement -

ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులను వదిలి ప్రజల పాటై బైలెల్లింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్థాయికి ఎదిగింది. ఆమె పాట మధుర గానమై ఎందరినో చైతన్య పరిచింది. పాటల పెద్దక్క విమలక్కతో కలిసి నడిచింది. నిర్భందాలను ఎదిరించింది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని బలంగా అలవర్చుకుంది. వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడకుండా సంస్థ ఎదుగుదలనే కోరుకున్నది. ప్రజల పాటై.. సాంస్కృతిక తూటై అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ప్రజా గాయనిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాయని పల్స నిర్మలతో మానవి మాట కలిపింది.
నిర్మల సొంత ఊరు ఉమ్మడి వరంగల్‌ జిల్లా, దేవరుప్పల మండలం, ధర్మాపురం గ్రామం. తల్లిదండ్రులు చీటూరి పిచ్చమ్మ, సోమయ్య. నిర్మలకు బాల్యం నుండి పాటల పట్ల మక్కువ ఎక్కువ. ఆర్‌.నారాయణ మూర్తి పాటలు విని వాటికి అనుగుణంగా అడుగులు వేసింది. తండ్రి సిపిఐ(ఎం-ఎల్‌)జనశక్తి విప్లవ రాజకీయాలల్లో కొనసాగుతుండేవారు. తండ్రి నుండి విప్లవ భావజాలాన్ని వంట పట్టించుకున్న నిర్మల, చదువు మీది కన్నా పాటల పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. బిడ్డ మనసు పసిగట్టి అరుణోదయ కళా సంస్థలో పూర్తిస్థాయి కార్యకర్తగా పని చేయించాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అట్లా ఆ సంస్థలో చేర్పించారు.

నల్లగొండ జిల్లాలో సాగిన ప్రస్థానం
2000లో నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టిన నిర్మల పూర్తి కాలం కార్యకర్తగా పాటల ప్రయాణం కొనసాగింది. కళ కళ కోసం కాదు – కళ ప్రజల కోసం.. అంటూ ముందుకు సాగింది. అరుణోదయలో విమలక్కతో కలిసి అడుగులు వేసింది. నకిరేకల్‌ పార్టీ ఆఫీసులో ఉండి నిత్యం ఏ కార్యక్రమం జరిగినా పాటను అందుకునేది. విద్యార్థి సంఘంలో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న యాదగిరితో (శాలిగౌరారం మండలం, ఊట్కూరు గ్రామం) ఆమె పరిచయం వివాహానికి దారి తీసింది. కుల పట్టింపులు, సాంప్రదాయాలు లాంటి ఎన్నో అవాంతరాలను దాటి వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

ప్రసవ సమయంలో ఒంటరిగా…
జీవిత భాగస్వామి అజ్ఞాతంలో ఉండటంతో తన మొదటి ప్రసవానికి నిర్మల ఒంటరిగానే ఆసుపత్రికి వెళ్లి బాబు అమర్‌కు జన్మనిచ్చింది. జిల్లా జైలులో ఉన్న తన భర్తను చూసేందుకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడింది. ములకాత్‌ సమయంలో వారిద్దరి మధ్యన జాలీ అడ్డుగా ఉండటంతో చంటి బిడ్డను ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఎంతో మనోవ్యధకు గురిచేసింది. రెండవ ప్రసవ సమయంలోనూ యాదగిరి గుంటూరు జిల్లా గురజాల జైల్లో ఉన్నాడు. అక్కడ నుండి విడుదలైన తర్వాత నల్గొండ పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. తన ఇద్దరు చంటి పిల్లలతో జైలు ఆవరణలో పడిగాపులు కాసేది నిర్మల. చంటి పిల్లల చేతి స్పర్శ కోసం భర్త పడిన ఆరాటాన్ని చూసి నిర్మల తట్టుకోలేకపోయేది.

పాటల ప్రయాణంలో….
నిర్మల అనేక సభలలో, వేదికల్లో పాటలెన్నో పాడింది. 30 పాటలకు పైబడి సీ.డీలలో పాడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఢిల్లీ, ముంబైలలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాటలతో పాటు అడివంటుకుంది, వీర తెలంగాణము, తెలంగాణ నృత్య గానం వంటి బ్యాలేలో నృత్యం చేసింది. అలాగే అనేక కళారూపాలను ప్రదర్శించింది. ప్రస్తుతం నిర్మల తన యూట్యూబ్‌ ఛానల్‌లో 15 పాటలకు పైబడి పాడింది. అరుణోదయంలో నిర్మల కూతురు ప్రాణహిత పాటలు పాడడం, నృత్యం నేర్చుకుంటే, బాబు అమర్‌ డప్పు వాయిద్యం నేర్చుకున్నాడు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్ర సాధనకై వందలాది సభల్లో పాటలు పాడింది. విమలక్కతో కలిసి తెలంగాణకై ఎడతెగని ప్రయాణం చేసింది. కాళ్లకు గజ్జలు కట్టి, ఎర్ర చీర ధరించింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, తెలంగాణ ధూమ్‌-ధామ్‌ సభలు, ప్రెస్‌ మీట్‌లు ఇలా తనకు వీలైన మేరకు పాల్గొన్నది. ఉద్యమంలో అనేకసార్లు అక్రమ అరెస్టులకు గురైంది. ఆమెతో పాటు పిల్లలు కూడా అరెస్టు అయ్యారు.

సాంస్కృతిక సారథిలో…
ప్రజల పోరాటాల ఫలితంగా జూన్‌ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు 2015లో తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించింది. ఆ విధంగా నిర్మల కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణిగా పదేండ్లుగా కొనసాగుతుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఆటుపోట్లు కుంగదీసిన వెనకడుగు వేయకుండా తన భర్త యాదగిరి తన వెన్నంటి ఉండి ప్రోత్సహించడం వల్లనే తన పాటల ప్రయాణంలో 25 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగానని సంతోషంగా చెబుతుంది.

పురస్కారాలు
25 ఏండ్ల పాటల ప్రస్థానంలో నిర్మల అనేక పురస్కారాలను, మెమొంటోలను అందుకుంది. తెలంగాణ రచయితల వేదిక, వట్టికోట ఆళ్వారు స్వామి, పుడమి మహిళా, మిత్ర జనం పాటల సవ్వడి, బాబు జగ్జీవన్‌రావు, తెలంగాణ ఉద్యమం వంటి పురస్కారాలు, సాయి సాహితి కుటీర పురస్కారం, సంక్షేమ పథకాల సంబరాల దరువు, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవ మెమొంటో, నేటి ఉద్యమ గాన శిఖామణి పురస్కారం, అరుణోదయ రామారావు స్మృతిలో మెమొంటో, ఆడపిల్లలను రక్షిద్దాం – చదివిద్దాం, పుడమి జాతీయ పురస్కారం – 2020ను అందుకుంది.

బస్‌ స్టేషన్‌లో నిద్ర….
మా బాబు అమర్‌, పాప ప్రాణహిత. ఒకరిని చేత పట్టుకొని, మరొకరిని సంకనేసుకొని భుజాన బ్యాగుతో కార్యక్రమాలకు, సమావేశాలకు, సభలకు వెళ్లేదాన్ని. రాత్రీ, పగలూ బస్సు ప్రయాణాలు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ బస్‌ స్టేషన్‌లో రాత్రిపూట బస్సులు దొరకక, ఒకవేళ దొరికినా సీట్లు లేక ఇద్దరు చిన్నపిల్లలతో బస్‌ స్టేషన్‌లో నిద్ర కాసిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి నేను పడ్డ బాధ మాటల్లో చెప్పతరం కాదు. సమయానికి తిండి దొరకక్క, ఏమన్నా కొనుక్కొని తిందామంటే సరిపడా డబ్బులు లేక కడుపు మాడ్చుకున్న రోజులు వున్నాయి.
– యరకల శాంతికుమార్‌, నకిరేకల్‌, 9849042083.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad