Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeమానవిఆదివాసీ బతుకు చిత్రం ఆమె క‌విత్వం

ఆదివాసీ బతుకు చిత్రం ఆమె క‌విత్వం

- Advertisement -

కళ్యాణి కుంజ… నిఖార్సయిన అడవి బిడ్డ. ప్రకృతి ఒడిలో సేదతీరడం ఆమెకెంతో ఇష్టం. ఆ పచ్చదనమే ఆమెను ఓ కవయిత్రిగా చిగురించేలా చేసింది. స్వచ్ఛమైన అడవి గాలిని పీల్చి అంతే స్వచ్ఛమైన అడవి జీవితాలను కవిత్వీకరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అడవి పూలరంగు ఆమెను ఇలా కవయిత్రిగా నిలబెట్టింది. కొండలు కోనలు దాటుకొని తనదైన వ్యక్తీకరణతో కవిత్వమై నిలబడింది. తన మొదటి కవితా సంపుటి ‘కంకపొద’లో ఆదివాసీ బతుకు చిత్రాన్ని ఈరోజు మన ముందు ఆవిష్కరించబోతున్న ఆమె పరిచయం…
నేను పుట్టింది వరంగల్‌ జిల్లా, నల్లబెల్లి మండలం, గోవిందపూర్‌ అనే ఆదివాసీ గూడెంలో. అడవితో సంబంధం ఉన్న కుటుంబ నేపథ్యం మాది. అమ్మ కుంజ నాగమ్మ, నాన్న రామస్వామి. చదువు వాసనే తెలియని మా ఇంట్లో మా అమ్మ పెద్ద తమ్ముడు వాసం సమ్మయ్య ద్వారా నేను చదువుల పుప్పొడిని తీసుకోగలిగా. కరెంటు లేని మా ఊరిలో అమ్మ వంట చేసాక పొయ్యిలో నిప్పు రవులబెట్టి నన్ను లేపి సదువుకోమనేది. నా అక్షరాభ్యాసం మా ఊరి బర్రెల పాకలో మొదలై పంతులుపల్లె (బాచ్చయ్య)లో నాలుగవ తరగతి వరకు, ఐదో తరగతి నుంచి పదవతరగతి వరకు ఆశ్రమ ఉన్నత పాఠశాల రాయినిగూడెం ములుగు మండలంలో పూర్తయ్యింది. ఇంటర్మీడియేట్‌ జగిత్యాల శాంతి బాలికల జూనియర్‌ కళాశాలో, డిగ్రీ ‘ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ కళాశాలలో, పీజీ కోటి ఉమెన్స్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసాను.

ఉద్యోగ జీవితం
ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలోకి నవంబర్‌ 2000లో ప్రవేశించాను. మొదట మునిగిలవీడు నెల్లికుదురు మండలంలో పని చేశాను. 2002 జనవరి నుండి 2005 నవంబర్‌ వరకు తాడ్వాయి కాటాపూర్‌లో చేశాను. 2005 నుండి 2012 వరకు కంబాలపల్లి మహబూబాబాద్‌లో. 2012 నుండి 2022 జనవరి వరకు బాలికల పాఠశాల మహబూబాబాద్‌లో పని చేసి, 2022 జనవరి నుంచి ఇప్పటికీ మామునూర్‌ క్యాంప్‌ నందు పనిచేస్తున్నాను.

చదువు వాసనే లేని ఇంట
సెలవలొస్తే నాలుగో తరగతి వరకు ఆవుల మంద కావలి పోతుండేదాన్ని. అమ్మతో అడవికి వెళ్లటం, పొలం పనులు చేయడం నేర్చుకున్నాను. మా ఊరిలో చదువుకున్న మొదటి అమ్మాయిని నేనే. ఇంకా చదువుకుంటానంటే మా బాపు ఒప్పుకోలేదు. నేను చాలా కొట్లాడినా, ఒకరోజు పెద్ద గొడవ అయింది. అన్ని పనులు చేస్తూనే చదువుకుంటా అనేదాన్ని. అయినా ఒప్పుకోలేదు. అప్పుడే మా పెద్దమామ చదివిస్తానని నన్ను తీసుకెళ్లాడు. అలా చదువుపరిమళాన్ని ఆస్వాదించిన. యం.ఏ పూర్తి అవుతుండగా ఉద్యోగంలో చేరడం నేను సాధించిన విజయం అని ఊరిలో నా గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. కానీ నా ఆలోచనలకు, ఆకాంక్షలకు భిన్నంగా జీవితం చిన్నాభిన్నమైనా నా కుటుంబం, స్నేహితులు, సాహిత్యం నన్ను నిటారుగానే నిలబడేలా చేసాయని సగర్వంగా చెప్పుకోగలను.

సాహిత్య పరిమళాలు
మా అన్న కుంజ లక్ష్మయ్య సాహిత్యం చదివేలా నన్ను ప్రోత్సహించి సాహిత్యపు పునాది వేసాడు. అయితే నాలో సంఘర్షణలన్నీ ఆచరణకు ఏండ్ల సమయం పట్టింది. రాయడం మొదలుపెట్టిన కొత్తలో కవిసంగమం నాకు ఎన్నో నేర్పింది. 2017లో తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ వచ్చినప్పుడు చాలా మంది రచయితలతో పరిచయాలు ఏర్పడ్డాయి. నేను ఆదివాసీ జనజీవితాల గురించి మాత్రమే చెప్పదలచుకున్నాను. నా కవితలలో, అడవి జీవితాలు, ఆ జీవన వైవిధ్యం, ఆడి కష్టనష్టాలు, పండుగ పబ్బాలు అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు నేను రాసింది ఒక్క శాతమే. రాయల్సింది చాలా ఉంది. కొన్నేండ్లుగా నాకు మాజీవితాల గురించి ఎవ్వరూ రాయడం లేదని ఉండేది. మా గురించి మేము చెప్పుకునేంతగా ఎవ్వరూ చెప్పలేరు. అందుకే నేను రాయడం మొదలుపెట్టాను. ఆ కవితలనే ఇప్పుడు కంకపొదగా మీ ముందుకు తీసుకొచ్చాను. కవిత్వం నాకేమిచ్చింది అంటే అనేక మంది ఆత్మీయులను ఇచ్చిందని సగర్వంగా చెప్పుకోలను. నేను రాసింది ముందు నా కొడుకు దినేష్‌ కార్తిక్‌కు చూపించేదాన్ని. నా పెద్ద కొడుకు విజయం కిరణ్‌ కొన్ని సలహాలు ఇచ్చేవాడు. ఇంకా చాలా మంది స్నేహితులు నన్ను ప్రోత్సహించారు.

‘కంకపొద’లోకి వెళదాం…
గుంపులుగా ఉండే ఆదివాసీ బతుకుకు ప్రతీకగా కంకపొద. సాధారణంగా ఆదివాసీలు ఏ పని చేసిన గుంపులుగా వెళ్లి చేస్తారు. ప్రకృతి పీట మీద ఆకుపచ్చ చేండ్ల మధ్య, పారే తోగొడ్డున పచ్చని ప్రపంచంను మనకు చూపించింది. కవయిత్రిగా కళ్యాణి కుంజ ఈ కంక పొద నిండా తల్లిలాంటి అడివికి దూరం అవుతున్న ఆదివాసీ బతుకులను జూసి ఆవేదన చెందుతుంది. ఒక ఆదివాసీ బిడ్డగా తన తండ్రి ఆడబిడ్డల చేత ఎవుసం పని చేయించిన తండ్రిపై ఒకప్పుడు గులిగినాకానీ తను జేసే సహజపు ఎవుసాన్ని మెచ్చుకున్నది. చిన్న నాడు తను తిరుగాడిన వాగులను, వంకలను గంటోని కుంట, గండ్లరేవు వాగు, కోలు మడుగు, ఇంజ నమడుగు, జిన్నల రేవు మొదలైన ఒర్రెలను చూపింది. ఇకపోతే భాష అదనపు మెరుపు. తన బతుకు ధోరణిలోనే తన నిర్వచనాలు ఉంటాయి.

నా ఊరు అనే కవితలో ఆదివాసీ గూడెం అందరినీ ఆదరించే అర్లు (ప్రేమ)కలిగినది అని చెపుతూనే ఎవుసంలో సండ్ర, తునికి రెండు కర్రలు షాగా వారిన సొక్కం బంగారం లాంటివని వ్యవసాయంలో నాగటి కోలలుగా గట్టితనాన్ని ఇస్తాయని వాటి ప్రాముఖ్యతను తెల్పింది. వాటిని కోల్పోయిన ఆదివాసీలు అవ్వలేని అనాధ పిల్లలు ఐనరాని ఆవేదన చెందింది. ప్రాజెక్టుల పేరుమీద అడవిని ముంచిన పోలవరం అని ఏకరువు పెట్టింది. మృగాలా వేట అనే ఇంకొక కైతలో సమాజం అనే అడవిలో ఆడవాళ్లు బలి అవుతున్నారని, ఆదివాసీ స్త్రీలకు నిర్భయలాంటి చట్టాలు అందడం లేదని ఈ హత్యలు అనాగరిక కృత్యాలని అలాంటివి ఆగకపోతే నేనే వేట బాణంను అవుతానని ఆగ్రహం వ్యకం చేసింది. ఆదివాసీ తల్లులను కవిత్వం చేస్తూ ఇంకా ఆడపిల్లలు అంటేనే అర్లు కలిగిన ఉండాలని అదొక్కటే వాళ్లకు తెలిసిన ఇజం అని తేల్చి చెప్పింది. గర్భసంచిని పిల్లమడి అని చెబుతూనే సామాన్య స్త్రీ గా గొంతు ఎత్తింది. ఇది చిన్న కవితే గానీ గొప్ప భావాన్ని పొదిగింది.
సుట్టు గుడిసె అనే కవిత ఆదివాసీ గుడిసెను దృశ్యమయం చేసిన కవిత. ఇది చదువుతున్నప్పుడు జాషువ కవనమున చిత్రములు గూర్చు కవి అన్నమాట గురుతుకు వచ్చింది. చిన్న గుడిసె బతుకును తెలిపే పెద్ద పాఠం కవయిత్రి చెప్పినట్టుగా తాటిచెక్క అటుకు, నిట్టాడు, ఉట్టి, బడ్డీ బీరువా, సూట్టకుదురు, మూడు పంగల కొయ్య, బంత కర్రల తట్ట, జిమ్మల బుట్టి, అన్నాల అర్ర, కంక తడిక మనుసున్న ఇరుకుఇల్లు.కవితల నిండా కొత్త పదాలు తాజా దానని ఇస్తాయి. కోయ బతుకులోనివి. సింగారబెల్లి వసింగిడి, పిల్లమడి వగర్భసంచి, కౌడు వదారితప్పడం, ఓర్రోటి కల్లు వఒంటరి శిల, గరిబియ్యం వమొలకేత్తని వడ్లను దంచితే వచ్చే బియ్యం, గూడా వకోలు నుండి నీళ్లను లాగేది, నల్ల చెన్న గడ్డ వఅడివిలో దొరికే ఆహారపు గడ్డ, ఎరగడ పడటం వకాలడం వంటి పదాలు గ్రంధస్తం అయ్యాయి. ఆదివాసీల పండగలు ప్రత్యేకం. పెద్దపూశాలలో అడివిని పూజించడం మొదలైనవి. కళ్యాణి కుంజ తన స్నేహితులు అయినా షాజహాన, జీలుకర శ్రీనివాస్‌ సూచనలతో కవిత్వం రాసినట్టుగా విన్నాను. తెలంగాణలో ఆదివాసీ కోయ బతుకులో నుండి వస్తున్న మొదటి కవితాసంపుటి ఇది. ఇంకా ఆదివాసీ బతుకు కోణాలను కవిత్వంలోకి తెస్తుందని ఆశిస్తున్నాను.
– నాగెళ్ల రమేష్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad