– నిర్ధారించిన అటవీ అధికారులు
– పంచనామా నిర్వహించిన పశువైద్యాధికారి
– నష్టపరిహారానికి సిఫార్స్: ఎఫ్ఆర్ ఓ మురళి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం నిజమైంది. గతంలో మాదిరి అదిగో పులి ఇదిగో తోక చందంలా కాకుండా ఈ సారి ఆవు – దూడ ను చంపితిన్న సంగతి రుజువు అయింది. మండలంలోని కావడిగుండ్ల వాసి సోడెం నాగేశ్వరరావు పామాయిల్ తోట సమీపంలోని పశువుల దొడ్డిలో ఆవు – దూడ రెంటి పై సోమవారం రాత్రి పులి దాడి చేసి చంపి తిన్నది. పశువుల యజమాని పిర్యాదు మేరకు మంగళవారం ఎఫ్ ఆర్ ఓ మురళి,స్థానిక ఎఫ్బీఓ దాసరి నాగరాజు లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించిన అటవి సిబ్బంది జంతువు పాదం గుర్తులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పులి పాదంగా గుర్తించారు. నారాయణపురం పశువైద్యాధికారి వినయ్ చేత పశువుల మృతదేహాలను పంచనామా నిర్వహించారు. పశువులకు నష్టపరిహారం కై ఉన్నతాధికారులకు సిఫార్స్ చేస్తున్నాం అని తెలిపారు.





