హైదరాబాద్ : ఐస్‌క్రీమ్ బ్రాండ్ గెట్ ఎ వే బ్రాండ్ ఉత్పత్తులను అందించే పీనట్‌బట్టర్ అండ్ జెల్లీ ప్రయివేటు లిమిటెడ్‌లో ప్రముఖ డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ మెజారిటీ వాటాను స్వాధీనం చేసుకుంది. రూ.9 కోట్లతో 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. బోర్డు అమోదం తర్వాత 45 రోజుల్లో ఈ స్వాధీనం పూర్తి కానుందని హెరిటేజ్ ఫుడ్స్ సోమవారం రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గెట్ ఎ వేలోని మిగితా 49 శాతం వాటా ప్రమోటర్లు కలిగి ఉంటారని తెలిపింది. 2026 మార్చి తర్వాత మరో 20 శాతం వాటాను హెరిటేజ్ ఫుడ్స్ స్వాధీనం చేసుకోనున్నట్లు పేర్కొంది. 2030 నాటికి తమ సంస్థను అత్యంత విలువైన డెయిరీ న్యూట్రిషన్ కంపెనీగా నిలుపడానికి గెట్ ఎ వే స్వాధీనం కలిగి రానుందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణీ నారా తెలిపారు. ఈ భాగస్వామ్యం తమ సంస్థకు ఓ మైలురాయి కానుందని గెట్ ఎ వే కో ఫౌండర్, సిఇఒ జాష్ షా పేర్కొన్నారు.



