నవతెలంగాణ – హైదరాబాద్
గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25 )లో రికార్డ్ స్థాయిలో రూ.4,134.6 కోట్ల రెవెన్యూ సాధించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 9 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీ నికర లాభాలు 77 శాతం పెరిగి రూ.188.30 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. 10.4 శాతం వృద్ధితో రోజుకు 17.2 లక్షల లీటర్ల పాలు సమీకరించినట్లు వెల్లడించింది. పెరుగు, పన్నీర్‌లలో టాప్ 5 బ్రాండ్లలో ఒక్కటిగా నిలిచినట్లు తెలిపింది. పాల అమ్మకాలు ఏడాదికేడాదితో పోల్చితే 4.5 శాతం పెరిగి రోజుకు 11.6 లక్షల లీటర్లకు చేరినట్లు ఆ సంస్థ పేర్కొంది. సగటు లీటర్ విక్రయ ధర రూ.55.6గా ఉందని పేర్కొంది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ వార్షిక అమ్మకాలను సాధించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు. నికర లాభాలు 77 శాతం పెరిగి రూ.188.3 కోట్లకు చేరాయన్నారు.
భెల్ లాభాల్లో 42 శాతం వృద్ధి
విద్యుత్, ఇంజనీరింగ్ ఉత్పత్తులను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం 42.1 శాతం వృద్ధితో రూ.695.97 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.489.62 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.8,260.25 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో 29.7 శాతం పెరిగి రూ.10,715.21 కోట్లకు చేరింది.
హ్యుందారు లాభాల్లో 4 శాతం తగ్గుదల
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యుందారు ఇండియా నికర లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 4 శాతం తగ్గుదలతో రూ.1,614 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.1,677 కోట్ల లాభాలు సాధించింది. గడిచిన క్యూ4లో కంపెనీ రెవెన్యూ 1.5 శాతం పెరిగి రూ.17,940 కోట్లుగా చోటు చేసుకుంది.
హెరిటేజ్ ఫుడ్స్ రికార్డ్ రెవెన్యూ..
- Advertisement -
- Advertisement -