సెప్టెంబర్ 17 ఒక చారిత్రక సందర్భం. ఘటన ఒక్కటే…. కానీ, చూసే దృక్పథాలు వేరువేరు. చరిత్రను వక్రీకరించేవారొకరు. సత్యాలను కప్పిపుచ్చేవారొకరు. స్వార్థ రాజకీయాల పర్యవసానాలు ఇవి. వక్రీకరించడంలో బిజేపీది అందెవేసిన చేయి. ప్రతియేటా ఈ సందర్భంగా విమోచన పేరుతో హంగామా సృష్టించటమే దాని పని. హైదరాబాదు రాజ్యంలోని తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిణామాలను 1948 సెప్టెంబర్ 17కు ముందు, ఆ తర్వాతగా పరిశీలించవచ్చు. ఈ తేదీనే బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వివాదాస్పదం చేసి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నిజాం పాలనలో ప్రజల స్థితిగతులు దుర్భరంగా వున్నాయి. రైతాంగంలో అసంతృప్తి ఉద్యమాలకు దారితీసింది. సాంస్కృతిక పునరుజ్జీవనంతో మొదలై సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఆధునిక ప్రపంచం ప్రభావంతో మేధావి వర్గం తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికోసం కృషి చేసింది. అది గ్రంధాలయోధ్యమంతో ప్రారంభమైంది. క్రమంగా వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా స్పందించిన రైతాంగం భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా మారింది. అంతిమంగా రాచరిక వ్యతిరేక రాజకీయ పోరాటంగా రూపుదిద్దుకున్నది. ఐలమ్మ పండించిన పంటను కాజేసేందుకు విస్నూరు దేశ్‌ముఖ్ పంపిన గూండాలను ఆంధ్ర మహాసభ కార్యకర్తలు తిప్పికొట్టిన వార్త గ్రామ గ్రామాన వ్యాపించింది. ఐలమ్మ సాధించిన విజయంతో రైతాంగం ఉత్సాహం పొందారు. అనేక గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. కడివెండి గ్రామంలో జరిగిన ప్రదర్శనకు అగ్రభాగాన నిలిచిన దొడ్డి కొమరయ్యను భూస్వామ్య గూండాలు, నిజాం పోలీసులు పొట్టన పెట్టుకున్నారు. దొడ్డి కొమరయ్య వీరమరణంతో తెలంగాణ రైతాంగం ఆగ్రహానికి గురైంది. దొరల గడీల మీదికి జనం కదిలారు. పరిస్థితి తీవ్రతను గమనించిన భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. 1946 సెప్టెంబర్‌లో మొదలైన సాయుధ రైతాంగ పోరాటం 1951 అక్టోబర్ వరకు అప్రతిహతంగా సాగింది. 10 లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంచింది. మూడు వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. గ్రామ పాలన మొత్తం గ్రామ రాజ్యాల చేతుల్లోకి వచ్చింది. తాకట్టు భూములకు విముక్తి లభించింది. భూస్వాముల రుణ పత్రాలను తగులబెట్టారు. పన్ను వసూళ్ళు రద్దు చేసి, పశువులు పంపిణీ చేశారు. అంటరానితనం నిషేధించారు. కూలీలకు కనీస వేతనాలు అమలులోకి వచ్చాయి. నిర్ణయాలలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. కుల వివక్ష, లింగ వివక్షలను నిషేధించారు. శ్రామికుల హక్కులకు పెద్దపీట వేశారు. ఈ పోరాటం ముద్దుబిడ్డలే ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి వీరనారులు. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది యోధులు ప్రాణత్యాగం చేశారు. ఇంతటి చారిత్రాత్మక పోరాటాన్ని బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వక్రీకరించి యువతను పక్కదారులు పట్టిస్తున్నాయి.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న తప్పుడు ప్రయత్నాలకు యువత ఎందుకు మోసపోతున్నట్టు? ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలోనూ, వినియోగంలోనూ, ఉత్పత్తిలోను యువత దూసుకుపోతున్నది. అదే యువత ఆర్థిక విధానాలను, చారిత్రక వాస్తవాలను, సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడంలో మోసపోతున్నది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17 ప్రత్యేకత గురించి కూడా పరిశీలించాలి. ఈ చారిత్రక ఘట్టం గడిచి 77 ఏండ్లయింది. సుమారు 100 సంవత్సరాల వయస్సులో వున్న వారికి మాత్రమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించిన ప్రత్యక్ష అనుభవం ఉంటుంది. ఆ తరువాత నాలుగవ తరం యువత ఇప్పుడున్నది. వీరిలో ఎక్కువ మందికి తెలంగాణ పోరాటమంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేదా వక్రీకరణల పుట్టగా వున్న ‘రజాకార్’ సినిమా మాత్రమే తెలుసు. అందుకే యువతను తప్పుదారి పట్టించడం సులభమైంది. నాటి సాయుధ రైతాంగ పోరాటానికి సారధ్యం వహించిన కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటం, వార్తా పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా వేదికల వంటి సమాచార మాధ్యమాలు దేశవిదేశీ కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో ఉండటంతో ఈ దుష్ప్రచారం విస్తృతంగా సాగింది. నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రంలో మతోన్మాదులు అధికారం చేజిక్కించుకోగలిగారు. అధికారయుతంగానే చరిత్రను వక్రీకరించగలుగుతున్నారు. పాఠ్యాంశాలు తిరగరాస్తున్నారు. అవాస్తవాలతో కూడిన అధికారిక ప్రసంగాలు చేస్తున్నారు. శాస్త్రీయ దృక్పథానికి, ప్రజాస్వామ్య లౌకిక విలువలకు తిలోదకాలిచ్చి మూఢ విశ్వాసాలను, మతపరమైన విభజనను ప్రోత్సహిస్తున్నారు. కీలక స్థానాలలో తమ వ్యక్తులను నియమించటం, విద్యా సంస్థలలో రిక్రూట్ చేయటం, స్వచ్ఛంద సంస్థల పేరుతో తిరోగమన వాదులను ప్రోత్సహిస్తున్నారు. సాంస్కృతిక రంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇవన్నీ యువత మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.
నాటి నిజాం పాలనలో సాగు భూమిలో అత్యధిక భాగం రాజు, జమిందారులు, జాగీర్దారుల చేతిలో వున్నది. సాధారణ రైతాంగం మొదట వీరి భూముల్లో పనిచేసిన తర్వాత మాత్రమే తమ సొంత భూమిలో సాగు పనిచేయాలి. సహజంగానే తమ సొంత వ్యవసాయం దెబ్బతినేది. భూస్వాముల దగ్గర అప్పుల పాలై వెట్టిచాకిరీ చేయవలసి వచ్చేది. వీటికి తోడు రకరకాల పన్నుల భారం. వృత్తిదారులు కూడా తమ ఉత్పత్తులు భూస్వాములకు ఉచితంగా యివ్వాలి. చాకలి, మంగలి తదితర వృత్తుల వారు ఉచిత సేవలందించాలి. దొరల గడీలలో చాకిరీకి ఇంటికొకరిని పంపించాలి. దళితులు రోడ్డు మీద ఉమ్మి వేయరాదు. మెడకు ముంతలు కట్టుకోవాలి. గుడిముందు నడవరాదు. గుడిలోకి ప్రవేశం సమస్యేలేదు. భూస్వామి ఎదురుపడితే చెప్పులు చేతపట్టుకొని రోడ్డు పక్కన తలవంచుకొని నడవాలి. భూస్వాములు, వారి కుటుంబీకులు ప్రయాణించే బండ్ల ముందూ, వెనక దళితులు ఉరకాలి. గ్రామంలోకి ఏ అధికారి వచ్చినా రైతులు, ఇతర పేదలు వారికి సేవలందించాలి. భూస్వామి కంటబడ్డ మహిళ కాదనే సాహసం చేయరాదు. లేదంటే ఇంటి మీద, తల్లిదండ్రుల మీద గూండాల దాడులు తప్పవు. వీటికి తోడు అందరికీ చదువుకునే అవకాశం లేదు. చదువుకునే కొద్ది మందికి కూడా తెలుగులో చదువుకునే సౌకర్యం లేదు. ఉర్దూ లేదా మరాఠీలో మాట్లాడే వారికే గౌరవం. తెలుగు పట్ల చిన్న చూపు.

ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అణిచివేతలతో కుతకుతలాడుతున్న సమాజమది. సరిగ్గా ఆ సమయంలోనే కొమర్రాజు లక్ష్మణ్‌రావు లాంటి సంస్కర్తల చొరవతో గ్రంధాలయోద్యమం ప్రారంభమైంది. 1901లోనే హైదరాబాదు నడిబొడ్డున సుల్తాన్ బజార్ దగ్గర శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం ఏర్పాటయింది. సూర్యాపేట, వరంగల్ దగ్గర మడికొండ తదితర ప్రాంతాలలో కూడా గ్రంధాలయాలు స్థాపించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేశారు. పాశ్చాత్య దేశాలలో విస్తరిస్తున్న ఆధునికాభివృద్ధి ప్రభావంతో కొందరు మేధావులు తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతిక వికాసం కోసం ప్రారంభించిన ఈ కృషి క్రమంగా అప్పటికే అమలులో వున్న భూ చట్టాలను, ప్రభుత్వ విధానాలను విమర్శించటానికి దారితీసింది. కౌల్దారుల రక్షణ, జరిమానాలు, భూమి శిస్తుల తగ్గింపు తదితర సమస్యలను ముందుకు తెచ్చింది. సమస్యల పరిష్కారం కోరుతూ రాజుకు వినతి పత్రాలు పంపేవారు. ఈ క్రమంలోనే తెలుగు వార్తాపత్రికలు ప్రారంభమైనాయి. 1922లోనే సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గోల్కొండ పత్రిక ప్రారంభమైంది. క్రమంగా నీలగిరి, తెలుగు పత్రిక తదితర వార్తాపత్రికలు కూడా స్థాపించారు. 1930లో సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జోగిపేటలో నిర్వహించిన సభలో ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. అప్పటికే వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో తెలుగు భాషాభివృద్ధికోసం పనిచేసిన సంస్థలన్నీ విలీనమై ఆంధ్రమహాసభ ఏర్పడింది. గ్రంధాలయాల అభివృద్ధి, మాతృభాషలో విద్యాబోధన వంటి సమస్యలతో ప్రారంభించిన ఆంధ్రమహాసభ క్రమంగా మహిళలకు విద్య, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మహిళలకు విడిగా ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు తదితర సమస్యలు కూడా చేపట్టింది. ఈ క్రమంలోనే దుర్గాబారు దేశ్‌ముఖ్ లాంటి అభ్యుదయవాదులు కలిసి 1930లో ఆంధ్రమహిళా సభ ఏర్పాటు చేశారు.
స్త్రీ జనోద్ధరణ, స్త్రీ విద్య లక్ష్యంగా ఇది పనిచేసింది. ఆంధ్రమహాసభ లేవనెత్తుతున్న సమస్యలు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్న తీరు ఛాందసవాదులకు గిట్టలేదు. మనువాద భావజాలంతో వర్ణవ్యవస్థ గురించి గొప్పలు చెబుతూ పండితుల పేరుతో కొందరు ఆంధ్రమహాసభ మీద దాడికి దిగారు. ఇలాంటి దుష్ప్రచారాలను గొల్కొండ పత్రిక ద్వారా సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రముఖులు తిప్పికొట్టారు. అభ్యుదయ విలువలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రమహాసభ క్రమంగా పేద రైతాంగంలోకి విస్తరించింది. సొంత యంత్రాంగాన్ని సృష్టించుకున్నది. సాంస్కృతిక సమస్యలకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక సమస్యలు, ప్రజాస్వామ్య హక్కులపైనా కూడా స్పందించింది. జనం గుండెల్లో సంఘం పేరుతో స్థానం సంపాదించింది. 1944 భువనగిరి సభ నాటికి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టుల నాయకత్వం బలపడింది. దీని ఫలితంగానే ఆంధ్ర మహాసభ పరిధి సాంస్కృతిక సమస్యలకే పరిమితం కాకుండా రైతాంగ సమస్యలన్నింటినీ హత్తుకున్నది.

కాకినాడలో 1934లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. 1939లో హైదరాబాదులో ఆలంఖుంద్మిరీ, రాజ్‌బహదూర్‌గౌర్, ముర్తుజా హైదర్, సయ్యద్ ఇబ్రహింల ఆధ్వర్యంలో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడింది. మునగాల తదితర కోస్తా ప్రాంతాల్లో రైతాంగం ఉద్యమ నాయకులుగా పనిచేసిన కమ్యూనిస్టులు సూర్యాపేట ద్వారా తెలంగాణలో అడుగుపెట్టారు. 1941 నాటికి నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. కోస్తా ప్రాంతంలో సాగుతున్న బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న తెలంగాణ యువత తిరిగివచ్చి ఇక్కడి భూస్వామ్య, రాచరిక వ్యవస్థ మీద కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఈ యువకులే ఎర్రజెండా వైపు ఆకర్షితులయ్యారు. అప్పటికే ఆంధ్రమహాసభ చురుకుగా పనిచేస్తున్నది. నిజాం రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీ పనిచేసే అవకాశం లేదు. అందుకే కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రమహాసభలో భాగంగా పని ప్రారంభించింది. చురుకుగా, సమరశీలంగా ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధతతో పనిచేసే కమ్యూనిస్టు కార్యకర్తలు అతికొద్ది సమయంలోనే ఆంధ్ర మహాసభను తీవ్రంగా ప్రభావితం చేయగలిగారు. సమరశీలతను పెంచుకోగలిగారు. రజాకార్ అయితే తెలంగాణలో స్వయం సేవకుడు అని అర్థం. నాయకత్వంలోకి రాగలిగారు. ప్రజలను కదిలించగలిగారు. భూస్వాములకు, నిజాం రాజుకు సహకరించేందుకు 1940లో ఖాసిం రజ్వి ఆధ్వర్యంలో 60 వేల మందితో రజాకార్ సంస్థ ఏర్పడింది. ఆయన లక్నోలో పుట్టిపెరిగి ఔరంగాబాదులో స్థిరపడ్డ న్యాయవాది. 1940వ దశకం ఆరంభంలోనే భూస్వామ్య గూండాలు మహ్మద్ బందగీని హత్య చేశారు. భూమి సమస్యపై న్యాయ పోరాటం చేస్తున్న బందగీ కోర్టు నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. 1946లో ఐలమ్మ పోరాటం రైతాంగంలో కొత్త కదలిక తెచ్చింది. ఐలమ్మ ఇల్లే ఆంధ్రమహాసభ కార్యాలయం. ఆమె కమ్యూనిస్టు కార్యకర్త. 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగడంతో రైతాంగం రగిలింది. ఆవేశంతో రగులుతున్న రైతాంగం పరిస్థితిని అంచనా వేసిన కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ సాయుధ రైతాంగ పోరాటానికి పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వం వహించారు. గ్రామాలను వదిలిపెట్టి భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు హైదరాబాదుకు పారిపోయారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేదలకు భూమి పంచారు. ‘దున్నేవాడికే భూమి ‘ నినాదం ముందుకొచ్చింది. గ్రామరాజ్యాల ఏర్పాటుతో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం గొల్కొండ కోటను చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడింది.

1947 ఆగస్టు 17న బ్రిటీష్ ఇండియా స్థానంలో స్వతంత్ర భారతదేశం, పాకిస్థాన్ ఆవిర్భవించాయి. అప్పటిదాకా బ్రిటిష్ పాలకులకు అణిగిమణిగి సామంత రాజుల్లాగా వ్యవహరిస్తున్న 565 రాజ్యాలు మిగిలివున్నాయి. బ్రిటిష్ పాలకులకు స్వాతంత్య్రోద్యమ నాయకత్వానికి మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ సంస్థానాలు స్వతంత్ర భారతదేశంలో గానీ, పాకిస్థాన్‌లో గానీ విలీనం కావచ్చు. లేదా స్వతంత్ర దేశాలుగా కొనసాగవచ్చు. ఈ మేరకు హైదరాబాద్, కశ్మీర్, జునాగఢ్ రాజ్యాలు మినహా మిగిలినవన్నీ ఇండియాలో కొన్నీ, పాకిస్థాన్‌లో కొన్ని విలీనమైనాయి. జునాగఢ్ నవాబు రసూల్‌ఖాన్ జీ తన రాజ్యాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేస్తూ సంతకం చేశాడు. ప్రజలు భారత్‌లో విలీనానికే సుముఖంగా వున్నారు. అంతిమంగా 1948 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయసేకరణ ద్వారా నవంబర్ 9న భారతదేశంలో విలీనమైంది. కశ్మీర్ ప్రజానీకం రాచరికాన్ని వ్యతిరేకించారు. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో సాయుధ తిరుగుబాటు చేశారు. అదేసమయంలో పాకిస్థాన్ పాలకులు కశ్మీర్ దురాక్రమణకు ప్రయత్నించారు. ఒకవైపు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కశ్మీర్ ప్రజానీకం పోరాటం, మరోవైపు పాకిస్థాన్ చొరబాటుదారుల దౌర్జన్యాలు తట్టుకోలేని రాజు హరిసింగ్ జమ్మూలో తలదాచుకున్నాడు. భారతజాతీయోద్యమ నేత జవహర్‌లాల్ నెహ్రూతో జరిగిన సంప్రదింపుల ఫలితంగా అప్పటికే నిస్సహాయ స్థితిలో వున్న రాజు హరిసింగ్ కశ్మీర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ 1947 అక్టోబర్ 26న సంతకం చేశాడు. ఇక మిగిలింది హైదరాబాదు రాజ్యం మాత్రమే. హైదరాబాదు రాజు మీర్ ఉస్మాన్‌అలీ ఖాన్ స్వతంత్ర రాజ్యంగానే కొనసాగుతామని అప్పటికే ప్రకటించి వున్నాడు. 1947 నవంబర్ 9న హైదరాబాద్ రాజ్యంతో ఇండియన్ యూనియన్ ప్రభుత్వం యధాతథ ఒప్పందం చేసుకున్నది.
1948 సెప్టెంబర్ నాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాచరికం కుప్పకూలే పరిస్థితి దగ్గరపడింది. అదే జరిగితే హైదరాబాదు రాజ్యంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం… ఇండియన్ యూనియన్ పాలకులను బెంబేలెత్తించింది. త్రిపుర గిరిజన సాయుధ పోరాటం, బెంగాల్ తెభాగా పోరాటం, బిహార్ రైతాంగ పోరాటం, పున్నప్రావాయలార్ ప్రజల తిరుగుబాటు, వర్లీ ఆదివాసుల తిరుగుబాటు లాంటి అనేక పోరాటాలు ఎర్రజెండా నాయకత్వంలో సాగుతున్న కాలమది. వీటిలో అతిపెద్ద తిరుగుబాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. నిజాం రాజ్యం కుప్పకూలడం ఖాయమని అంచనాకు వచ్చిన ఇండియన్ యూనియన్ ప్రభుత్వం సెప్టెంబర్ 13న హైదరాబాదు వైపు తన సైన్యాన్ని నడిపింది. సెప్టెంబర్ 17న నిజాం రాజు చేతులెత్తేసి హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ సంతకం చేశాడు. ఈ మేరకు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదు రాజ్యంలో భాగంగా వున్న తెలంగాణ కూడా భారతదేశంలో విలీనమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితమిది. ఎర్రజెండా వీరుల త్యాగాల పర్యవసానం ఈ విలీనం.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన ఈ పోరాటానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం మతం రంగు పులమటం దుస్సాహసం. కుల, మత, ప్రాంతీయ విభేదాలను అధిగమించి సాగిన మహత్తర పోరాటమది. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించిన నల్గురిలో ముగ్గురు ముస్లింలు. రాచరిక నియంతృత్వం మీద యుద్ధం ప్రకటించిన కలం యోధుడ షోయబుల్లాఖాన్. ఆయనను నడిబజారులో కాచిగూడ చౌరస్తా దగ్గర నరికి చంపినవారు రజాకార్లు. సాహితీ సమరయోధులు దాశరది సోదరులు, నవలాకారుడు వట్టికోట అళ్వారుస్వామి, సుద్దాల హన్మంతు, మఖ్దుం మొహియుద్దీన్ లాంటి వారెందరికో మతం కన్నా మానవత్వం విలువలే మిన్నగా పని చేసాయి. హైదరాబాదు కార్మిక నాయకులు కూడా హిందువులు, ముస్లింలు, శూద్రులు, దళితులన్న తేడా లేదు. భూస్వాములు అత్యధికులు హిందువులు. వారు దోచుకున్నది, అణిచివేసింది హిందూ రైతాంగాన్నే. వీరు దాడి చేసింది కూడా హిందూ మహిళల మీదనే. ఈ భూస్వాములకు అండగా నిలిచిన రజాకారులు, రాజు ముస్లింలు. రైతాంగం శ్రమ దోపిడీకి, పోరాటాల అణిచివేతకు, మహిళల మీద లైంగిక దాడులకు మతం అడ్డు రాలేదు. అంతేకాదు, రజాకార్ సంస్థాపకుడు ఖాసిం రజ్వి కాగా, దాని నాయకత్వంలో విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఒకరు. ఈ దొరల గడీలలోనే రజాకార్లు తిష్ఠవేసేవారు. భూస్వాములు తినిపించి, తాగించి వీరిని జనం మీదికి వదిలేవారు. ఇక్కడ కూడా వారికి మతం అడ్డు రాలేదు. బందగీ ముస్లిం. ఆయనను హత్య చేయించిన భూస్వామి హిందువు. భూస్వామికి అండగా నిలిచిన రాజు ముస్లిం. ఇక్కడ కూడా మతం అడ్డుగోడ కాలేదు. వీరి దోపిడీనీ, ఆగడాలను ప్రతిఘటించిన రైతాంగానికి కూడా మతం అడ్డు గోడ కాలేదు. పోరుబాటలోనున్న కార్యకర్తలను పోలీసుల బారినుండి ముస్లిం మహిళలు తమ పరదాల చాటున దాచి, రక్షించిన కాలమది. ఈ మహత్తర చరిత్రకు మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నది బిజెపి.
సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనంతో కథ ముగిసిపోలేదు. అసలు కథ అప్పుడే మొదలైంది. ఇండియన్ యూనియన్ ప్రభుత్వంలో హోం మంత్రి సర్దార్ పటేల్ పంపిన సైన్యం రాకతో తమ సమస్యలు గట్టెక్కుతాయనుకున్న తెలంగాణ రైతాంగం ఆశలు అడియాశలయ్యాయి. పటేల్ సైన్యాలతో నిజాం రాజు తలపడలేదు. ఇరు పక్షాలు రాజీ పడ్డారు. హైదరాబాదులో తలదాచుకున్న భూస్వాములకు పటేల్ సైన్యం అండగా నిలిచింది. అప్పటికే దున్నుకుంటున్న రైతాంగం చేతుల్లోనుండి భూములు గుంజుకొని మళ్ళీ భూస్వాములకు అప్పగించడం మొదలుపెట్టింది. ప్రతిఘటించిన రైతుల మీద భయంకర దాడులకు తెగబడ్డది. ఇప్పుడు పటేల్ సైన్యాలకు రజాకార్లు ఒకవైపు భూస్వాములు మరొకవైపు ఏజెంట్లుగా పనిచేశారు. సైన్యం దౌర్జన్యాలు భూస్వాముల, రజాకార్ల దౌర్జన్యాలను మించిపోయాయి. మహిళలను సామూహికంగా చెరబట్టారు. ప్రతిఘటించిన కార్యకర్తలను తలకిందులుగా చెట్లకు వేలాడదీశారు. మండుటెండలో చితకబాదారు.
బట్టలూడదీసి మిట్టమధ్యాహ్నం మండుతున్న ఇసుకలో దొర్లించారు. గోనె సంచుల్లో మూటగట్టి బంతుల్లాగ విసిరికొట్టారు. ఇండ్లు తగులబెట్టారు. ఆస్థులు దోచుకున్నారు. అప్పటికే తాము సాగుచేసుకుంటున్న 10 లక్షల ఎకరాల సాగుభూమి తమకే చెందాలని రైతులు కోరుకున్న ఫలితమిది. తమ చేతుల్లో వున్న భూమిని రక్షించుకోవటం కోసం తమ సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబర్ వరకు కొనసాగించక తప్పలేదు. నిజాం పాలన 1500 మందిని పొట్టన బెట్టుకున్నది. ఇండియన్ యూనియన్ సైన్యాలు 2500 మందిని పొట్టనబెట్టుకున్నాయి. షేర్వానీలతో హైదరాబాదులో తలదాచుకున్న భూస్వాములంతా ఇప్పుడు ఖద్దరు బట్టలు, తెల్ల టోపీలతో కాంగ్రెస్ కార్యకర్తలైనారు. బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ నిజాం రాజ్యంలో గానీ, ఇతర సంస్థానాలలో గానీ రాచరిక వ్యవస్థ మీద మాత్రం పోరాడలేదు.
భూస్వాముల దోపిడీ, అణిచివేతలను ప్రశ్నించలేదు. ఇందుకు రాజులు, భూస్వాములు స్థానికులనీ, తమ పోరాటం విదేశీ పాలకులకు వ్యతిరేకంగా మాత్రమేనని చెప్పుకొచ్చారు. మరి రాచరిక వ్యవస్థ, భూస్వాముల దోపిడీ సంగతేమిటి? విలీనం తర్వాత రాచరికం అంతమైనప్పటికీ భూస్వామ్య దోపిడీ మాత్రం కొనసాగింది. అంతేకాదు, తెలంగాణ ప్రజలు తిరస్కరించిన నిజాం రాజునే పేరు మార్చి ‘రాజ ప్రముఖ్ ‘ పేరుతో తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దారు. ఇదీ కాంగ్రెస్ పాలకుల నిర్వాకం. నరహంతక నైజాం రాజును బంధించే బదులు ఆయనకే అధికారం అప్పగించి పరిహారం చెల్లించిన ఘనత నాటి నెహ్రూ, సర్దార్ పటేల్ నాయకత్వానికే చెల్లింది. ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటమాడిన రజాకార్ మూక నేత ఖాసిం రజ్వీని కూడా విమానంలో బద్రంగా పాకిస్థాన్‌కు పంపించారు.పటేల్ సైన్యాలే వచ్చి ఉండకపోతే నిజాం రాజును గానీ, ఖాసిం రజ్వీని గానీ తెలంగాణ ప్రజలు నడి బజారులో ఉరికంబం ఎక్కించేవారు. ఇంతటి నేరస్తులను రక్షించింది సర్దార్ పటేల్ సారధ్యమే. ఈ నిప్పులాంటి నిజాలను కాంగ్రెస్ నాయకత్వం కప్పిపుచ్చుతున్నది. బిజెపి నాయకత్వం వక్రభాష్యం చెబుతున్నది.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమంతో పెనవేసుకున్నది. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి రైతులు వచ్చారు. తర్వాత సాయుధ రైతాంగ పోరాటంతో మమేకమయ్యేందుకు కూడా ఆ ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలకు తెలంగాణ రైతాంగం స్వాగతం పలికారు. తెలంగాణ సరిహద్దులో వున్న కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రజలు సాయుధ పోరాటానికి అండగా నిలిచి పోలీసు దాడులకు గురయ్యారు. ఈ గుర్తులు నేటికీ కృష్ణా, గుంటూరు, గోదావరి, కర్నూలు జిల్లాలలో కనిపిస్తాయి. ఉద్యమానికి ఆర్థిక సహాయంతో పాటు దళాలకు రాజకీయ విద్య, రక్షణ స్థావరాలను ఏర్పాటు చేసిన ప్రాంతాలవి. భారత సైన్యంలో అధికారిగా పనిచేసిన మేజర్ జైపాల్‌సింగ్ కూడా ఇక్కడి దళాలకు శిక్షణ ఇచ్చారు. 1951 అక్టోబర్‌లో పోరాట విరమణ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం కూడా సహకరించింది.
అర్థ శతాబ్దపు సుదీర్ఘ తెలంగాణ ప్రజా పోరాటంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు అణువంత సంబంధం లేదు. తెలంగాణ ప్రాంతంలో వారి ఛాయలు కూడా లేవు. ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక గురువు వినాయక్ దామోదర్ సావర్కర్ 1910లో తెల్లదొరల ముందు సాగిలబడి అండమాన్ జైలు నుండి బయటకొచ్చిన ఘనుడు. బ్రిటిష్ తెల్లదొరలకు తాను తప్పిపోయిన కొడుకుతో సమానమని వేడుకొని స్వాతంత్య్రోద్యమంతో ఏవిధమైన సంబంధం పెట్టుకోనని లేఖ రాసి బయటపడిన ”దేశ భక్తుడు”. తాను జైలులో వుండడం కంటే బయట వుంటేనే బ్రిటిష్ వారి సేవలో తరించగలనని మెప్పించి విడుదలయ్యాడు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్‌గేవార్ భారతీయ యువతను స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనవద్దని చెప్పారు. ఆయన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ అధినేతగా పనిచేసిన మాధవ్ సదాశివ గోల్వాల్కర్ బహిరంగంగానే భారతీయ యువత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తమ జీవితాన్ని వృధా చేసుకోవద్దని ప్రకటించాడు. అంతటితో ఆగలేదు. స్వాతంత్య్ర పోరాటం మీద ఉక్కుపాదం మోపుతున్న బ్రిటిష్ సైన్యంలో చేరాలని పిలుపునిచ్చాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కూడా తెల్లదొరల పాలనకు ఆర్‌ఎస్‌ఎస్ నుండి ప్రమాదం లేదని, క్షేత్ర స్థాయిలో కమ్యూనిస్టు కార్యకర్తలే ప్రజలను కదిలిస్తున్నారని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
జాతీయోద్యమ ఫలితంగా రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం మూలాలను కూడా ఆర్‌ఎస్‌ఎస్ అంగీకరించలేదు. మనువాదమే మన రాజ్యాంగంగా ఉండాలని ప్రకటించింది. మువ్వన్నెల జండాను కూడా తిరస్కరించింది. వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యేంత వరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాక ఆవిష్కరణకు కూడా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు సిద్ధపడలేదు. వీరి చరిత్రంతా తెల్లదొరల సేవలో తరించటమే. కశ్మీర్ విషయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించింది. కశ్మీర్ ప్రజలందరూ ముస్లింలైనప్పటికీ రాజు హిందువు కాబట్టి ఆ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావలసిన అవసరం లేదని స్వతంత్ర రాజ్యంగానే కొనసాగాలని చెప్పింది. విలీనానంతరం కూడా అక్కడి ఆస్థులకు రక్షణ ఉండాలని డిమాండ్ చేసింది. షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆధ్వర్యంలో భూములు పంచిన తర్వాతనే ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి మారింది. ఏనాడూ స్వాతంత్య్రోద్యమంతో సంబందం లేని ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగమే బిజెపి. అందుకే జాతీయోద్యమ స్ఫూర్తి వారికి పట్టదు. భూస్వామ్య వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు వారికి గిట్టవు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించటం, మతం రంగు పులమటమే వారి లక్షణం. ఇది దేశ భవిష్యత్తుకు హానికరం. తెలంగాణలో మతచిచ్చు పెట్టాలనీ, హిందువులను ఓటు బ్యాంకుగా మలచుకోవాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం విలీన దినోత్సవానికి కూడా మతం రంగు పులిమి రాజకీయంగా బలపడాలని ప్రయత్నిస్తున్నాయి. ఇది జాతీయ సమగ్రతకు, సమైక్యతకు, మతసామరస్యానికి హానికరం. అందుకే వాస్తవ చరిత్ర కొత్త తరాలకు అందించవలసిన అవసరం వున్నది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు వేస్తున్న యువత ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమంలో కూడా ముందుండాలి. అందుకు ఈ చారిత్రక వాస్తవాలు తోడ్పడతాయి.
ఎస్.వీరయ్య