అమెరికా స్థానిక ఎన్నికల్లో మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు. రాజకీయంగానూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అందులో మన భారత సంతతికి చెందిన మహిళ కూడా ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె మన హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తి కావడం విశేషం. అలాగే మేరీ షెఫీల్డ్ ట్రెలాయిట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈమె సైతం ఆ నగరానికి మొదటి మహిళా మేయర్ కావడం మరో విశేషం.
గజాలా హష్మీ…
1964, జూలై 5న హైదరాబాద్‌లో జన్మించారు. తల్లి తన్వీర్, తండ్రి జియా హష్మీ. అంతర్జాతీయ వ్యవహా రాల్లో పీహెచ్‌డీ చేసిన ఆమె తండ్రి ప్రముఖ విశ్వవిద్యా లయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. చిన్నతనంలో ఆమె మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో కొంత కాలం ఉన్నారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పని చేశారు. నాలుగేండ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. తర్వాత కాలంలో అక్కడే స్థిరపడ్డారు.
విద్యావేత్తగా…
గజాలా చిన్నతనం నుండి చదువులో ముందుండేవారు. అద్భుతమైన ప్రతిభను కనబర్చేవారు. అనేక స్కాలర్‌షిప్‌లు, ప్రోత్సాహకాలు అందుకుంటూ జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో బీఏ పూర్తి చేశారు. తర్వాత అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. ‘విలియం కార్లోస్ విలయమ్స్, ఇన్ ది అమెరికన్ గ్రెయిన్, ప్యాటర్స్‌న్’ అనే అమెరికన్ గ్రౌండ్ పేరుతో పరిశోధనా వ్యాసం రాశారు. అజహర్‌తో వివాహం తర్వాత గజాలా 1991లో రిచ్‌మండ్ ప్రాంతానికి మారారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 30 ఏండ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఈ సుదీర్ఘ అనుభవంలో ఆమె వర్జీనియా ప్రజల సమస్యలతో పాటు విద్యారంగం గురించి లోతుగా అర్థం చేశారు. ఈమె సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పని చేశారు.
రాజకీయ ప్రవేశం
విద్యారంగంలో గజాలా చేసిన సేవలు ఈమె రాజకీయ ప్రవేశానికి మంచి మార్గం వేశాయని చెప్పుకోవచ్చు. 2019లో ఆమె తొలిసారిగా వర్జీనియా సెనేట్ ఎన్నికల్లో పోటీ చేసి 10వ సెనేట్ జిల్లాను గెలుపొందారు. అప్పుడు కూడా వర్జినీయా సెనేట్‌కు ఎన్నికైన మొదటి ముస్లిం మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. అధ్యాపక వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ విధంగా ఆమె చేసిన సేవలకుగాను 2023 నవంబర్‌లో ఆమె సెనేట్ జిల్లా 15లో వర్జీనియా సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. 2024లో సెనేట్ విద్య, వైద్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2024 మేలో ఆమె 2025 వర్జీనియా లెప్ట˜ినెంట్ గవర్నర్ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఆమె గెలిచి ఈ పదివికి ఎన్నికైనా మొదటి ముస్లిం మహిళగా మరోసారి చరిత్ర సృష్టించారు.
మేరీ షెఫీల్డ్…
2014 నుండి డెట్రాయిట్ నగర మండలి సభ్యురాలిగా పనిచేస్తున్న అమెరికన్ రాజకీయవేత్త ఆమె. డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. ఆమె కుటుంబం మొత్తం సామాజిక సేవకు అంకితమై పని చేస్తున్నారు. 2022 నుండి సిటీ కౌన్సిల్ అధ్యక్షురాలిగా పని చేసిన మేరీ ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం డెట్రాయిట్ మేయర్‌గా ఎన్నికై ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళగా మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
కుటుంబ నేపథ్యం
1987లో పుట్టిన మేరీ డెట్రాయిట్‌లో పెరిగారు. ఆమె తండ్రి హౌరెస్ షెఫీల్డ్, న్యూ డెస్టినీ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చిలో పాస్టర్‌గా పని చేసేవారు. అలాగే పౌర హక్కుల కార్యకర్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మేరీ 2008లో వేన్ స్టేట్ యూనివర్శిటీ నుండి పబ్లిక్ అఫైర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.
మొదటిసారి ఎన్నికల్లో..
మేరీ కళాశాలలో చదువుతున్నప్పుడు వేన్ కౌంటీ షెరీఫ్ బెన్నీ నెపోలియన్‌ను కలిశారు. అతను ఆమెను కౌంటీ జైలు వ్యవస్థలో క్రమశిక్షణా విచారణ అధికారిగా పని చేయడానికి నియమించుకున్నాడు. 2010లో ఆమె మిచిగాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో నాల్గవ జిల్లాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత తిరిగి ఎన్నికకు ఆమె ప్రయత్నించలేదు. డెమోక్రటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో మౌరీన్ స్టాపుల్టన్ చేతిలో మేరీ ఓడిపోయారు. 2013 నాటికి మేరీ న్యూ డెస్టినీ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చికి సహ పాస్టర్‌గా ఉన్నారు.
డెట్రాయిట్ సిటీ కౌన్సిల్
2013లో మేరీ ఐదవ జిల్లాకు డెట్రాయిట్ సిటీ కౌన్సిల్ స్థానానికి పోటీ చేశారు. ఆమె సార్వత్రిక ఎన్నికల్లో ఆడమ్ హోలియర్‌ను ఓడించారు. అలా 26 ఏండ్ల వయసులో అతి పిన్న వయస్కురాలైన డెట్రాయిట్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. 2017లో వేన్ కౌంటీ కమిషనర్ అయిన జ్యువెల్ వేర్‌పై తిరిగి ఎన్నికయ్యారు. 2021లో ఎలాంటి వ్యతిరేకతా లేకుండా తిరిగి ఎన్నికయ్యారు. జనవరి 2022లో కౌన్సిల్ సభ్యులు బ్రెండా జోన్స్ తర్వాత మేరీ డి. వాటర్స్‌పై కౌన్సిల్ అధ్యక్షురాలిగా పనిచేయడానికి మేరీని ఎన్నుకున్నారు. అలా ఆమె కౌన్సిల్‌లో అతి చిన్న వయసులో అధ్యక్షురాలు అయ్యారు.
దూసుకెళ్లారు
ఆగస్టు 2023లోనే మేరీ 2025 ఎన్నికల్లో డెట్రాయిట్ మేయర్ అభ్యర్థిత్వం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిక్ రాథోడ్‌ను సలహాదారుగా నియమించుకున్నారు. ప్రస్తుత మేయర్ మైక్ డగ్గన్ ఇక పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడంతో మేరీ డిసెంబర్ 2024లో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ప్రాథమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆమె నవంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ దూసుకెళ్లారు. అక్కడ ఆమె సోలమన్ కిన్లోచ్ జూనియర్‌ను ఓడించి డెట్రాయిట్ మేయర్‌గా ఎన్నికైన మొదటి మహిళగా నిలిచారు. జనవరిలో ఆమె తన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ‘డెట్రాయిట్ పిల్లలకు విద్యను అందించడంపై దృష్టి పెడతాను. అలాగే నగరంలో శాంతి భద్రతను కాపాడేందుకు కృషి చేస్తాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తాను’ అంటూ ఆమె మీడియాతో పంచుకున్నారు.
చరిత్ర సృష్టించిన నాయికలు
- Advertisement -
- Advertisement -



