Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసబితకు హైకోర్టు నోటీసులు

సబితకు హైకోర్టు నోటీసులు

- Advertisement -

– మరో మాజీ ఐఏఎస్‌కు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కృపానందానికి కూడా నోటీసులు ఇచ్చింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌పై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎనిమిది, తొమ్మిది నిందితులుగా ఉన్న వారిద్దరినీ నిర్ధోషులని పేర్కొంటూ సీబీఐ కోర్టు గత మే ఆరున తీర్పు చెప్పింది. ఈ తీర్పును రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వారిద్దరి వివరణ నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్నట్టు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె లక్ష్మణ్‌ ప్రకటించారు.
తొలుత సీబీఐ తరపున శ్రీనివాస్‌ కపాటియా వాదిస్తూ బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడి రాజగోపాల్‌లకు సీబీఐ కోర్టు శిక్ష విధించిందని చెప్పారు. ఎనిమిది, తొమ్మిదో నిందితులైన కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించడాన్ని రద్దు చేయాలని కోరారు. వీరిద్దరి పాత్రపై ఆధారాల పత్రాలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లతో కలిపి సీబీఐ అప్పీల్‌ను సెప్టెంబర్‌ 17న విచారిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
భట్టి, ఉత్తమ్‌కు ఊరట : కేసులను కొట్టేసిన హైకోర్టు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరిపై 2021లో నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టేస్తూ సోమవారం తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలనీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ 2021 జనవరి 19న సచివాలయం నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ జరిపిన ప్రదర్శనలో వాళ్లు పాల్గొన్నారు. అనుమతి లేకుండా ప్రదర్శన తీశారనీ, తెలుగుతల్లి విగ్రహం వద్ద సమావేశం నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించారంటూ పోలీసులు కేసు పెట్టారు. ఈ క్రిమినల్‌ కేసులను డిస్మిస్‌ చేయాలంటూ భట్టి, ఉత్తమ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె లక్ష్మణ్‌ తీర్పు చెప్పారు. ప్రదర్శన, సభల కారణంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లినట్లుగా పోలీసులు చార్జిషీట్‌లో ఆధారాలు పేర్కొనలేదన్నారు. ఎలాంటి ఆధారాలు సమర్పించనప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనేందుకు ఆధారాలు లేనప్పుడు వారిపై కేసులను కొనసాగించడానికి వీల్లేదన్నారు.
కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు
కబడ్డీ అసోసియేషన్‌లో పార్ట్‌ టైమ్‌ కోచ్‌లు, సభ్యులు, సిబ్బందిని తొలగించి పర్మినెంట్‌ నియామకాలు చేయాలనే పిల్‌లో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత చేస్తామనీ, ఈలోగా అసోసియేషన్‌ తమ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌-2011ను అమలు పర్చడం లేదంటూ రిటైర్డు కబడ్డీ కోచ్‌ పవన్‌కుమార్‌ యాదవ్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ జీఎం మోహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌-2011ను పాటించడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. పార్ట్‌ టైమ్‌ సభ్యులను, కోచ్‌లను తొలగించి పూర్తిస్థాయి కోచ్‌లను, ప్రముఖ క్రీడాకారులను నియమించాలనీ, అసోసియేషన్‌ ఆర్థిక నిర్వహణ, కార్యకలాపాలపై దర్యాప్తునకు కూడా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. కోడ్‌ను కఠినంగా పాటించేలా ప్రభుత్వంతోపాటు అసోసియేషన్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రతివాదన వినిపించారు. స్పోర్ట్స్‌ అసోసియేషన్ల వ్యవహారాల్లో ప్రభుత్వాల పాత్ర నామమాత్రమని చెప్పారు. కబడ్డీ కోచ్‌ పిల్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. ఇందులో ప్రజాహితం లేదని వివరించారు. దీనిపై పిటిషనర్‌ న్యాయవాది జోక్యం చేసుకుని గతంలో ఇలాంటి కేసులను గుజరాత్‌, ఢిల్లీ హైకోర్టులు పిల్‌గా విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చాయని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి అసోసియేషన్‌లో సభ్యులుగా ఉండరాదన్నారు. పార్ట్‌టైం సభ్యులతో క్రీడాభివృద్ధి జరగదన్నారు. దీనిపై హైకోర్టు అసోసియేషన్‌ కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad