నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీ ఎమ్‌డీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మృతులు, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. సిగాచీ పరిశ్రమలో పేలుళ్ల ఘటనపై కలపాల బాబూరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున వసుధా నాగరాజు వాదనలు వినిపించారు. పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందారని, ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బాధితులకు ఇస్తామన్న రూ.కోటి పరిహారం కూడా ఇవ్వలేదని, ఎన్నో ఉల్లంఘనలు జరిగినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు.
నిపుణుల కమిటీ నివేదికను విశ్లేషిస్తున్నామని అదనపు అడ్వొకేట్ జనర్ రజనీకాంత్ తెలిపారు. ”192 మంది ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. సిగాచీ కంపెనీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ సైతం ప్రమాదంలో చనిపోయారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు” అని కోర్టుకు తెలిపారు. బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా డబ్బులు వచ్చేలా చూస్తున్నామని ఏఏజీ వివరణ ఇచ్చారు. రెండు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది.
సీఎంతో ఏడబ్ల్యూఎస్ ప్రతినిధి బృందం భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. తెలంగాణలో ఆ సంస్థకు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్ల ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎంతో ఆ బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారికి స్పష్టం చేశారు.
సిగాచీ ఎండీకి హైకోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



