Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వని హైకోర్టు

స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వని హైకోర్టు

- Advertisement -

పిటిషనర్లు, ప్రభుత్వ లాయర్ల మధ్య
వాడీవేడిగా వాదనలు
కేసులో 30 ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు

స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. అయితే అప్పటిలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనీ, దాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల లాయర్లు పలుమార్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ కేసులో ఇంప్లీడ్‌ అవుతూ 30 పిటీషన్లు దాఖలయ్యాయి. గురువారం వారందరి వాదనలూ వింటామని హైకోర్టు ప్రకటించింది.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

30 ఇంప్లీడ్‌ పిటీషన్లు
బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తమ వాదనలు కూడా వినాలంటూ కాంగ్రెస్‌, సీపీఐ సహా మరి కొందరు బీసీ నాయకులు 30 ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మోహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ బుధవారం సుదీర్ఘంగా విచారణ జరిపింది. తొలుత పలువురు లాయర్లు ఒకేసారి వాదనలకు సిద్ధమవడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్లు సీరియస్‌ అంశమనీ, తమ సహనాన్ని పరీక్షించొద్దని హితవు చెప్పింది.

రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు
తర్వాత పిటిషనర్ల తరఫున సీనియర్‌ లాయర్లు కే వివేక్‌రెడ్డి, బీ మయూర్‌రెడ్డి, జె ప్రభాకర్‌ తదితరులు వాదనలు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్నారు. బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంపు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. డెడికేటెడ్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమన్నారు. అశాస్త్రీయ గణాంకాలతో 50 శాతం దాటిన రిజర్వేషన్ల నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు మూడు వేర్వేరు కీలక కేసుల్లో వెలువరించిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం కూడా చేసిందన్నారు. దీనిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయడంతో ఈ వివాదం వచ్చిందన్నారు. షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఎస్టీలకు మేలు జరిగేలా రిజర్వేషన్లు 50 శాతానికి పెంచొచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఈ మేరకు కృష్ణమూర్తి అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ ఇండియా కేసులో తీర్పు చెప్పిందన్నారు. మరాఠా రిజర్వేషన్ల అంశంలోనూ 50 శాతం దాటిన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. రాష్ట్రంలో ఎస్టీలు మాత్రమే ఉన్న ప్రాంతాలు లేవనీ, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి పెరుగుతాయనీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు.

గవర్నర్‌ ఆమోదం లేదు
అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ ఆమోదం చెప్పలేదని, చట్టం కాకుండా ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని చెప్పారు. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ జీవో ఇచ్చిందన్నారు. ఆ శాఖ జారీ చేసిన జీవో 41ని కొట్టివేయాలని కోరారు. రిజర్వేషన్లను ఏకంగా 67 శాతానికి పెంచడం చెల్లదన్నారు. ఇప్పుడున్న చట్ట నిబంధల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇందిరా సాహ్నీ కృష్ణమూర్తి, వికాశ్‌కిషన్‌ గవారు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు శిరోధార్యమన్నారు. బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలంటూ దాఖలైన పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ, అనంతరామన్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం విస్మరించిందన్నారు. మున్నూరు కాపు, ముదిరాజ్‌, యాదవ, గౌడ్‌లకే స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారం లభిస్తోందన్నారు. పేదలుగా ఉన్న బీసీలు అలాగే ఉంటున్నారని చెప్పారు.

ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. తొలుగ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర శానసనసభ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు గత మార్చిలో పంపితే ఇప్పటి వరకు ఆమోదం చెప్పలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందనీ, ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు జీవో వెలువడిందని చెప్పారు. గవర్నర్‌ తన అధికారాలను వినియోగించి బిల్లుకు ఆమోదం చెప్పడమో లేదా బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపడమో చేయాలని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ అనీ, గవర్నర్‌ నియామకం ద్వారా అధికారంలో ఉంటారని చెప్పారు. బీసీ జనాభా పెరిగిన నేపథ్యంలో వారికి న్యాయం చేయాలనే కోణంలోనే ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించిందని చెప్పారు. ఇంటింటికీ సర్వే చేసి జనంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసి కమిషన్‌ శాస్త్రీయంగా నివేదిక ఇచ్చిందన్నారు. బీసీ జనాభా 56 శాతానికిపైగా ఉందనీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సు చేసిందన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపైన అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 9ని, స్థానిక సంస్థల్లో బీసీలకు 25 శాతం నుంచి 42 శాతానికి రిజర్వేషన్లను పెంపు చేయడాన్ని అడ్డుకునేందుకు దాఖలైన పిటిషన్లలో స్టే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కౌంటర్లు దాఖలు చేశాక సమగ్ర విచారణ పూర్తి చేశాక కోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బీసీలకు స్థానిక సంస్థల పదవుల్లో రిజర్వేషన్లు పెరిగితే, పాలనాపరంగానే కాకుండా విద్య, ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయని చెప్పారు.

గెజిట్‌ ఇచ్చారా?
ఈ సందర్భంగా న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన వన్‌మ్యాన్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై గెజిట్‌ ప్రచురించారా? బిల్లును గవర్నర్‌ ఆమోదించనప్పుడు దానిని ఆమోదించినట్లుగా పరిగణించారా? పరిగణిస్తే నోటిఫికేషన్‌ ఇచ్చారా? రాష్ట్రంలో బీసీల జనాభా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది కదా.. అంతటా ఒకేలా 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు.. వంటి ప్రశ్నలు ప్రభుత్వానికి వేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

వాయిదా వేయండి-ఏజీ
వాదనలు జరుగుతుండగానే అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుని విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. దీనితో పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కల్పించుకుని గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందనీ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై తిరిగి ఏజీ కల్పించుకుని, ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినట్లుందని, ఎన్నికల షెడ్యూల్‌ ఇది వరకే వెలువడిందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక కోర్టుల జోక్యానికి ఆస్కారం లేదనీ, ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పారు. మళ్లీ పిటిషనర్ల న్యాయవాదులు జోక్యం చేసుకుని, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే, విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -