Thursday, March 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువెలుగుమట్ల భూములపై హైకోర్టు స్టేటస్‌ కో

వెలుగుమట్ల భూములపై హైకోర్టు స్టేటస్‌ కో

- Advertisement -

మిగిలిన బాధితులకు ఊరట లభించేనా?
ఈ తీర్పుతోనైనా బాధితులందరికీ న్యాయం చేయాలి : సీపీఐ(ఎం)


నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూములపై యథాస్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్దిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ భూదాన్‌ భూముల్లో ఇండ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన కోర్టు 311 మంది మాత్రమే కాదు.. అక్కడ ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇవ్వాలని ఆదేశించింది.

మిగిలిన 418 మందికి ఊరట !
వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో మొత్తం 729 గృహాలు ఉండేవి. ఆ ఇండ్లను హైకోర్టు, సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు కూల్చి వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 24న పోలీసులతో కలిసి 14 రెవెన్యూ అధికారుల బృందాలు ఇండ్లను తొలగించాయి. నిర్వాసితులకు మద్దతుగా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ప్రజా సంఘాలు సైతం కదిలి వచ్చాయి. నిర్వాసితుల గోడు వర్ణనాతీతంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం హుటాహుటిన సర్వేలు నిర్వహించింది. 729 మందిలో 311 మందిని అర్హులుగా గుర్తించి ఈనెల 11వ తేదీన ముగ్గురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టాలు పంపిణీ చేశారు. 101 మందికి వారి స్వస్థలాల్లో గృహాలు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మంజూరు చేశారు.

కానీ నిర్వాసితులందరూ తమకు వెలుగుమట్లలోనే కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు స్టేటస్‌ కో ప్రకారం మిగిలిన 418 మందికి సైతం అక్కడే స్థలాలు, ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయొచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఇండ్లు కోల్పోయిన వారిలో 576 కుటుంబాలు ఖమ్మం, 95 భద్రాద్రి, 35 మహబూబాబాద్‌, 20 సూర్యాపేట జిల్లాలతో పాటు ఏపీకి చెందిన మూడు కుటుంబాలున్నట్టు అప్పట్లో అధికారులు తేల్చారు. చిరునామా ప్రకారం ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి 14 అంశాలపై సర్వే చేశారు. దీనిలో 311 కుటుంబాలకు మాత్రమే స్థలాలు ఇచ్చారు.

సాకులు చెప్పకుండా బాధితులందరికీ కూల్చిన చోటే ఇండ్లు ఇవ్వాలి : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం కుంటి సాకులు చెప్పకుండా కూల్చిన చోటే స్థలాలు ఇవ్వాలి. తిరిగి ఇండ్లు నిర్మించి ఇవ్వటంతోపాటు మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వం పంతానికి పోకుండా, కౌంటర్‌ దాఖలు చేయకుండా నిర్వాసితులందరికీ న్యాయం చేసేలా వ్యవహరించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -