– ఉద్యానవన శాఖ మండల అధికారి రాజు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని ఉద్యానవన శాఖ మండల అధికారి రాజు అన్నారు. గురువారం మండలంలోని కోన సముందర్ గ్రామంలోని రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి రాజు మాట్లాడుతూ మొక్కలకు 90 శాతం రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.
ఆయిల్ ఫామ్ మధ్యలో అంతర పంటల సాగు (మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా) చేసినందుకు గాను ఎకరానికి రూ.4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని వివరించారు.ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులైతే 100 శాతం రాయితీ, 5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడానికి పలు రకాల సబ్సిడీలతో సాగును ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ, ఆయిల్ ఫామ్ కంపెనీ అధికారి మధు, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్యామ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.



