– హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్
– ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ- అంబర్‌పేట
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద హయ్యర్ పెన్షన్‌ను అందరికీ వర్తింపజేయాలని హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీడీఎల్, బీఈఎల్, ఈసీఐఎల్ సంస్థల ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను తిరస్కరించడం దుర్మార్గమని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బర్కత్‌పుర ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. బీఈఎల్ అధ్యక్షులు సౌందర్ రాజన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్.రావు మాట్లాడారు. కార్మికవర్గం పెన్షన్‌ను 3వ బెనిఫిట్‌గా ఇవ్వాలని కోరుతుంటే.. కేంద్రం మాత్రం కార్మికుల వద్ద సొమ్మును రికవరీ చేసి పెన్షన్‌ను భిక్షంలా చెల్లించడం అత్యంత దుర్మార్గమన్నారు. 1995లో తీసుకొచ్చిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌ను రెండు సార్లు (2008, 2014లో) సమీక్ష చేసి కూడా అన్యాయం చేసిందని తెలిపారు. 2014లో చేసిన సవరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం సుదీర్ఘ ఆందోళనలు, పోరాటాలు, న్యాయ పోరాటం చేసిన ఫలితంగా 2022 నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఈపీఎఫ్ సభ్యులందరికీ హయ్యర్ పెన్షన్ పొందేందుకు అర్హత కల్పిస్తూ 4 నెలల గడువు లోపు జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించిందని గుర్తు చేశారు.
రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం దేశంలో 17.49 లక్షల మంది హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్‌లు తమ రూల్స్‌ను సవరించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల హయ్యర్ పెన్షన్‌ను నిరాకరించడం అన్యాయ మన్నారు. ఈ తీర్పు ప్రకారం దరఖాస్తు చేసుకున్న అందరికీ హయ్యర్ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సార్వత్రిక కనీస పెన్షన్ రూ.9,000 డిమాండ్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ బీడీఈయూ(సీఐటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మురళి, టి.సత్తయ్య, అడ్వైజర్ యాదగిరి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీధర్, ట్రెజరర్ ఎం.రవీందర్, బీడీటీఈయూ(బీఆర్‌టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దానకర్ణాచారి, కాశిరెడ్డి, ఈసీఐఎల్ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, బీడీఎల్ సీనియర్ నాయకులు చెన్నకేశవులు, రాష్ట్ర నాయకులు విజరు కుమార్, బీడీఈయూ (సీఐటీయూ), బీడీటీఈయూ(బీఆర్‌టీయూ) ఆఫీస్ బేరర్స్, పబ్లిక్ సెక్టార్ కార్మికులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES