Thursday, January 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభావితరాల కోసమే హిల్ట్‌ విధానం

భావితరాల కోసమే హిల్ట్‌ విధానం

- Advertisement -

– లేకుంటే హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితే
– పారిశ్రామికవేత్తల ఇష్టప్రకారమే ల్యాండ్‌ కన్వర్షన్‌
– వద్దనుకుంటే దరఖాస్తు చేసుకోవద్దు
– ఎలాంటి నిర్బంధం లేదు
– అసెంబ్లీలో ‘హిల్ట్‌’ పత్రం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయనీ, పారిశ్రామిక వ్యర్థ రసాయనాలే దీనికి కారణమని రాష్ట్ర పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికీ మేల్కోకపోతే హైదరాబాద్‌ కూడా ఢిల్లీ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అనుమతితో ‘హైదరాబాద్‌ పారిశ్రామిక భూవినియోగ మార్పిడి విధానం’ (హెచ్‌ఐఎల్‌టీ) పై విధాన పత్రాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హిల్ట్‌ విధానం, దాని లక్ష్యం, ప్రజలు, ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. హిల్ట్‌ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుందని చెప్పారు. హైదరాబాద్‌ సిటీలోని పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) అవతలివైపునకు తరలిస్తామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. జీడీమెట్ల, ఉప్పల్‌, సనత్‌నగర్‌, చర్లపల్లి ప్రాంతాలు గతంలో ఇండిస్టియల్‌ జోన్లుగా జనావాసాలకు దూరంగా ఉండేవనీ, 50 ఏండ్లల్లో హైదరాబాద్‌ మహానగరంగా విస్తరించి, శివారు ప్రాంతాలన్నీ ప్రస్తుతం రెసిడెన్షియల్‌ కాలనీలుగా మారాయని చెప్పారు. ఇప్పుడు అక్కడ లక్షలాది మంది పౌరులు నివసిస్తున్నారని గుర్తుచేశారు.

ప్రస్తుతం పరిశ్రమలకు పక్కనే అపార్ట్‌మెంట్లు వెలిసాయనీ, అక్కడి ప్రజలు ఇప్పటికే కాలుష్యకష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. ఇండిస్టీలు, రెసిడెన్షియల్‌ ప్రాంతాలకు మధ్య బఫర్‌ జోన్లు లేవన్నారు. బఫర్‌ జోన్లు లేకపోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌, భోపాల్‌ గ్యాస్‌ వంటి దుర్ఘటనలు జరిగాయని ఉదహరించారు. హిల్ట్‌ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలను పక్కనపెట్టాలని కోరారు. చైనాలో భూస్కై పాలసీ ద్వారా భారీ పరిశ్రమలను నగరం నుంచి అవతలకు తరలించారని చెప్పారు. తద్వారా ప్రపంచదేశాలకు చైనా ఆదర్శంగా నిలిచిందన్నారు. పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఢిల్లీలో జనావాసాల మధ్య ఉన్న 168 పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఈ తీర్పు ప్రాతిపదికగా హిల్ట్‌ విధానం తీసుకొచ్చామన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఓఆర్‌ఆర్‌ లోపల ఉండకూడదన్నారు. పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని మనకు వారసత్వంగా అందించారనీ, మనం కూడా రేపటితరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. దానికోసమే హిల్ట్‌ పాలసీ తెచ్చామన్నారు. ప్రతిపక్షాలు హిల్ట్‌ పాలసీని సాదాసీదా భూ మార్పిడిగా చూస్తున్నారనీ, కానీ దీని పరిధి చాలా విస్త్రుతమైందని వివరించారు. హిల్ట్‌ విధానంపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. జీవో నెంబరు 19కి సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చిందనీ, స్వచ్చందంగా ఎవరైనా ముందుకు వస్తే కొంత ఫీజు తీసుకుని ల్యాండ్‌ కన్వర్షన్‌ చేస్తామన్నారు. 2013లోనే రెడ్‌, ఆరెంజ్‌ పరిశ్రమలు ఓఆర్‌ఆర్‌ అవతలకు తరలించాలని జీవో ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు భూ యజమానులు కాదనీ, ప్రభుత్వంలో ఉన్న ట్రస్టీలు మాత్రమేనని చెప్పారు. భూ మార్పిడిపై బలవంతం ఏమీలేదన్నారు. పారిశ్రా మికవేత్తలకు ఇష్టమైతేనే భూ మార్పిడి చేస్తామని వివరించారు. విధానం బయటకు రాకముందే ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయనీ, ఆ పద్ధతి మార్చుకోవాలనీ, ఇప్పటికైనా పర్యావరణ విధ్వంసం ఆగాలని అన్నారు.

సమగ్రాభివద్ధికే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పాలసీ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ రైజింగ్‌-2047 విధాన పత్రాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పత్రం భవిష్యత్‌ తరాలకు దిశా నిర్దేశం చేస్తుందని చెప్పారు. దీనిపై అనేక వేదికలపై చర్చలు జరిగాయనీ, ప్రజల అమోదంతో తుది పత్రం రూపకల్పన జరిగిందన్నారు. 1991 నుంచి ప్రతి దశాబ్దంలో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రెట్టింపు అవుతున్నదనీ, ప్రస్తుతం రాష్ట్రం 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ఇదే ఆర్థిక వేగం కొనసాగితే 2047 నాటికి సహజంగానే 1.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెబుతున్నారని వివరించారు. కానీ రాష్ట్రంలోని ప్రతి రైతు, దళితులు, గిరిజనులు, ప్రతి మహిళను అభివద్ధిలోకి తీసుకురావడానికి అది సరిపోదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -