హైదరాబాద్ : నగరంలో తమ కార్యకలపాలను విస్తరించినట్లు హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వెల్లడించింది. ఇప్పటికే ఒక్క హోటల్, రిసార్ట్ కలిగిన ఈ సంస్థ తాజాగా శ్రీ వెంకటేశ్వర హోటెల్స్ అండ్ కన్వెన్షన్‌తో కలిసి గచ్చిబౌలిలో 2029 జనవరిలో కొత్త హోటల్‌ను తెరువడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 304 గదులతో దీన్ని అందుబాటులోకి తేనంది. ఇది 62,000 చదరపు అడుగుల ఈవెంట్ స్థలంతో నగరంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుందని హిల్టన్ ప్రతినిధి జుబిన్ సక్సెనా తెలిపారు. హైదరాబాద్‌లోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు హిల్టన్ బ్రాండ్‌తో అధిక నాణ్యత ఆతిథ్యం అందిస్తామన్నారు. హిల్టన్‌తో భాగస్వామ్యం వ్యాపార, పర్యాటకుల అవసరాలను తీరుస్తుందని వెంకటేశ్వర హోటల్స్ అండ్ కన్వెన్షన్ మేనేజింగ్ పార్టనర్ ఆర్ వెంకట్ రమణ పేర్కొన్నారు.