– ‘మన ఇందూర్.. మన మేయర్’ అంటూ రాతలు
– ఎన్నికల వేళ బీజేపీ ఎత్తుగడ
– నగరంలో ఎక్కడ పడితే అక్కడే దర్శనం
– ఎన్నికల కోడ్ నుంచి సైతం నినాదాలకు మినహాయింపు..?
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ భావించినట్టే.. బీజేపీ తమ అమ్ముల పొదిలో ఉన్న ‘నినాదాలను’ ఎన్నికల వేళ తెరమీదకు తీసుకొచ్చింది. ఎన్నికల వేళ మతం పేరుతో ఓట్లు దండుకోవడం.. ఆ తర్వాత ఐదేండ్లు పట్టనట్టు వ్యవహరించడం పరిపాటిగా మారుతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల వేళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో భాగంగా ఇంటింటా ‘జై శ్రీరామ్’ నినాదాలు రాయగా.. ప్రస్తుతం అలాంటి సెంటిమెంట్‌తో మున్సిపల్ ఎన్నికల్లో ‘మన ఇందూర్-మన మేయర్’ నినాదం తీసుకొచ్చింది. నిజామాబాద్ నగరంలోని గోడలపై ఎక్కడ చూసినా ఇవే నినాదాలు కనిపిస్తుండటం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఇది వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో చేయనున్న పనులపై కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా.. గత పదేండ్ల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను బీఆర్‌ఎస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అయితే ఇరు పార్టీలు భావించినట్టే బీజేపీ మాత్రం ‘మతం’ పేరుతోనే ఎన్నికలకు వెళుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు డ్రాఫ్ట్‌పై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హాజరైన వేళ.. బీజేపీ నాయకులు ‘ఇందూర్’ అని ప్రస్తావించడం, ఎంఐఎం దానికి అడ్డు చెప్పడంతో వాగ్వాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇదే అంశం ఇటు బీజేపీకి, అటు ఎంఐఎంకు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఓ అవకాశం లభించినట్టయింది. అప్పటి నుంచి నిజామాబాద్‌ను ఇందూర్‌గా మారుస్తామని బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ ప్రకటిస్తూ వస్తున్నారు.
గోడల మీద రాతలు
గత లోక్‌సభ ఎన్నికల సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణం, బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన 2024 జనవరి 22న నిర్వహించారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ కార్యక్రమం నిర్వహించగా.. ఆ సమయంలో ప్రతి ఇంటి గోడ మీద ‘జై శ్రీరామ్’ నినాదాలు వెలిసాయి. రాముడి పేరు ఉండటంతో ఆ సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2024లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 7 విడతల్లో జరిగాయి. ఆ సమయంలో ప్రత్యేక ప్రచారం లేకుండానే జై శ్రీరామ్ పేరుతో ఓటర్లను కలవడం విశేషం. తాజాగా అదే సెంటిమెంట్‌తో మేయర్ సీటు కైవసం చేసుకునేందుకు ప్రస్తుతం ‘మన ఇందూర్-మన మేయర్’ తో పాటు ‘ఓ హిందూ మేలుకో.. పరులకు అధికారం మన భవితకు అంధకారం’ అంటూ ఎక్కడ పడితే అక్కడ గోడలపై నినాదాలు వెలుస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే పార్టీ రాతలు, పోస్టర్లను సిబ్బంది తొలగించే అవకాశం ఉండగా.. ఈ నినాదాలు మాత్రం ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు పొందుతుండటం గమనార్హం.
ఎంపీ, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం.. పనులు శూన్యం
నిజామాబాద్ ఎంపీగా అరవింద్, అర్బన్ ఎమ్మెల్యేగా ధన్‌పాల్ సూర్యనారాయణ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విమర్శిస్తున్నాయి. కార్పొరేషన్‌లలో రాష్ట్రంలోనే ఎక్కువ జనాభా ఉన్న నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీ కింద ఎంపీ ఎంపిక చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారం తమ పార్టీది లేదు కాబట్టి పనులు చేయించలేకపోతున్నట్టు ఎమ్మెల్యే చెబుతున్నారని.. నగరంలో ఎక్కడికక్కడ డ్రయినేజీలు పేరుకుపోయాయని, లైట్‌లు వెలగడం లేదని అయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా విమర్శిస్తున్నారు. ఈ పనులు చేయలేకుండా మళ్లీ మతం పేరుతో ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరుతున్నారు.



