ప్రపంచంలోనే పేరెన్నిక గల శాస్త్రవేత్తల్లో ఎంఎస్ స్వామినాథన్ ఒకరు. ఆయనొక భారతీయ జన్యు శాస్త్రవేత్త, అత్యంత ప్రభావవంతమైన ఇరవై మంది ఆసియా వ్యక్తుల ‘టైమ్స్’ జాబితాలో గాంధీ, ఠాగూర్‌లతోపాటు ముగ్గురు భారతీయుల్లో ఆయనొకరు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను అభివృద్ధి చేయటంలో చేసిన కృషికిగాను భారతదేశంలో ఎంఎస్‌ను హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు గ్రహీత. పుట్టింది తమిళనాడులోనైనా దేశ,విదేశాల్లోనూ ప్రఖ్యాతులు పొందిన మేధో సంపన్నుడు. బ్రిటిష్ వలస పాలనలో వ్యవసాయ రంగం అభివృద్ధి కుంటుపడిన నేపథ్యంలో హరిత విప్లవానికి బీజం వేసి ప్రజల్ని ఆహారసంక్షోభం నుంచి బయపడేసిన మానవతావాది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నాటికి తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ కరువు ప్రభావం ఉపఖండమంతా పడింది. బియ్యం కొరతను చూసి చలించిపోయాడు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకల్పించాడు. తల్లిదండ్రులు వైద్యశాస్త్రంలో చేరాలని సూచించినా ఆయన మనసంతా ఆకలిలేని సమాజం వైపే నడిపింది. జంతు శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మద్రాస్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తిచేశాడు. జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అధ్యయనం కోసం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)కి వెళ్లి సైతో జెనెటిక్స్‌లో అధిక డిస్టింక్షన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. అప్పటికే ఆయన పరిశోధన బంగాళా దుంపపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. అదే సమయంలో నెదర్లాండ్స్‌లో జన్యుశాస్త్రంలో యునెస్కో ఫెలోషిప్ రూపంలో వ్యవసాయ రంగంలో పరిశోధనలకు అతనికి అవకాశం లభించింది. ఆయన జన్యు శాస్త్రాన్ని ఎంచుకున్నారు. అటూ తర్వాత కేంబ్రిడ్జిలో మెక్కల పెంపకం యుఎస్‌ఎలో బంగాళా దుంప పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయుటలో విస్కా న్సిన్ విశ్వవిద్యాలయం లాబోరెటరీ ఆఫ్ జెనెటిక్స్‌లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ అసోసియేట్ షిప్‌కి అంగీకరించారు.
1954లో ఇండియాకి తిరిగొచ్చి కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. భారత దేశంలో ప్రజలు నాడు డెబ్బయి శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పుడు భారతదేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడాన్ని స్వామినాథన్ తీవ్రంగా విమర్శించారు.
ఆధునిక వ్యవసాయ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ భారతదేశంలో పర్యటించి మెక్సికన్ పొట్టి రకాల గోధుమల ప్రయోగాత్మక ప్లాంట్లలో ప్రాంతాల్లో పరీక్షించగా మంచి ఫలితాలను చూపింది. మంచి నాణ్యత, వ్యవధిలేని కొత్త రకాలు స్వీకరించడానికి రైతులు సంకోచించారు. స్వామినాథన్ కొత్త రకాన్ని ప్రదర్శించమని పదేపదే చేసిన అభ్యర్థనల తర్వాత చిన్న ప్రదర్శన ప్లాంట్లను ఏర్పాటు చేయుటకు అతనికి నిధులు మంజూరు చేయబడ్డాయి. దీంతో రైతుల ఆందోళన తగ్గి కొత్త గోధుమ రకాలను నాటారు. స్వాతంత్య్రం తొలినాళ్లలో దేశంలో గోధుమ ఉత్పత్తి అరవై లక్షల టన్నులు ఉండేది,1962 నాటికి అది కోటి టన్నులకి చేరింది. 1964-68 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు నుంచి కోటి 70 లక్షల టన్నులకు ఎగబాకింది. స్వామినాథన్ కృషివల్లే ఈ ఫలితాలను సాధించింది.
ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి
అంతేకాదు, నూతన వరి వంగడాలను సృష్టించాడు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశాడు. 1970లో నార్మన్ బోర్లాగ్ నోబెల్ బహుమతి అందుకునే ముందు… ”హరిత విప్లవం సమిష్టి కృషి. దాని అద్భుతమైన అభివృద్ధికి ఎక్కువ క్రెడిట్ భారతీయ అధికారులు, సంస్థలు, శాస్త్రవేత్తలు, రైతులకు దక్కాలి. అయితే మెక్సికన్ మరుగుజ్జుల స్వభావ్య విలువను ముందుగా గుర్తించినందుకు డాక్టర్ స్వామినాధన్‌కు చాలా క్రెడిట్ దక్కాలి.ఇది జరగకపోతే ఆసియా ఖండంలో హరిత విప్లవం వచ్చే అవకాశం లేదు” అన్నాడు. స్వామినాథన్‌తో కలిసి గురుదేవ్ కుష్, దిల్బాంగు సింగ్ అద్వాల్ వంటి భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు, జన్యు శాస్త్రవేత్తలు గణనీయమైన కృషి మూలంగా భారత ప్రభుత్వం 1971లో ఆహార ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా ప్రకటించింది. సరళీకరణ విధానాలు రైతులను మరణశయ్య వైపు నెట్టుతున్న దశలో యూపీఏ-1 ప్రభుత్వం స్వామినాథన్ అధ్యక్షతన 2004లో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఏర్పాటు చేసింది.భారతదేశంలోని రైతుల పరిస్థితులు మెరుగుపరచటం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, దేశీ ఆహార భద్రతను సుస్థిరం చేయటం ఈ కమిషన్ లక్ష్యాలు.డిసెంబర్ 2004-06 మధ్య రైతుల జాతీయ కమిషన్ ఐదు నివేదికలను సమర్పించింది.
స్వామినాథన్ కమిటీ ముఖ్య సిఫార్సులు
ఎంఎస్‌పి సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం యాభై శాతం ఎక్కువగా ఉండాలని సిఫార్సు చేసింది. దీన్ని (ష2ం50) ఫార్ములా అని కూడా పిలుస్తారు. ఇందులో మూలధనం ఇన్‌పుట్ ఖర్చు, భూమిపై అద్దె ఉంటాయి, ఇది రైతులకు యాభైశాతం రాబడి ఇస్తుంది. అసంపూర్ణ భూసంస్కరణలు, నీటి పరిమాణం, నాణ్యత, సాంకేతిక అందుబాటులేమితో తలెత్తే వ్యవసాయ సంక్షోభం రైతుల ఆత్మహత్యలకు దారితీస్తుందని కమిషన్ కనుగొన్న కీలక అంశాల్లో ఒకటి. అదనంగా ప్రతికూల వాతావరణ అంశాలు కూడా ఒక సమస్యగా గుర్తించింది.
ఈ మేరకు దేశ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో వ్యవసాయాన్ని చేర్చాలని జాతీయ కమిషన్ పిలుపునిచ్చింది. వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ప్రధాన వ్యవసాయ భూమి, అడవిని కార్పొరేట్ రంగానికి మళ్లించకూడదని ప్యానల్ సూచించింది. కొన్ని షరతుల ఆధారంగా వ్యవసాయ భూమి అమ్మకాన్ని నియంత్రించడంలో సహాయపడే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇది సిఫార్సు చేసింది.
నీటిపారుదల విషయంలో రైతులకు స్థిరమైన, సమానమైన నీటి సదుపాయాన్ని కల్పించడంలో సహాయపడే సంస్కరణలకు కమిషన్ పిలుపునిచ్చింది. భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి జాతీయ వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడిని పెంచాలని సిపార్సు చేసింది. పర్యావరణ పరిరక్షణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని కూడా ఇది సూచించింది. రైతులకు రుణ లభ్యతను మెరుగుపరచడం అనేది కమిషన్ ప్రస్తావించిన అంశం. మహిళా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీచేయాలని పంటల బీమా రైతుల ప్రయోజనా లను రక్షించే విధంగా బీమా అభివృద్ధి నిధిని సృష్టించాలని సిఫార్సు చేసింది. యుపిఎ ప్రభుత్వం రూపొందించిన 2007లో జాతీయ వ్యవసాయ విధానంలో స్వామినాథన్ కమిషన్ ప్రధాన సిఫార్సును విస్మరించింది.2014 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు బీజేపీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని గట్టి హామీ ఇచ్చి రైతులు ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి అమలు చేయకుండా మోసం చేసింది. అమలు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకి తెలిపింది.స్వామినాధన్ మరణాంతరం భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆయన మేలిమి సిఫార్సులు పట్టించుకోలేదు. పైగా మన వ్యవసాయ రంగంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అనుకూలంగా విధానాలు అమలు చేయాలని తీవ్రంగా శ్రమిస్తుంది.అందులో భాగంగానే వ్యవసాయ నల్లచట్టాలను తెస్తే రైతాంగం ఏకోన్ముఖంగా తిప్పికొట్టింది.
నేటికీ దేశంలో రైతులు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా మహారాష్ట్ర అసెంబ్లీ అంగీకరించింది. దీన్నిబట్టి చూస్తే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. వ్యవసాయం వదిలి వలసపోయేవారి సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతున్నది. మద్దతు ధరల కోసం పార్లమెంటు చట్టం చేయాలని దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్నది. భవిష్యత్తు భారతావని ఆకలిచావులను చూడకుండా ఉండాలంటే, ఆహార భద్రతతో పాటు నూట నలభై కోట్ల మంది భారతీయులకు పౌష్టికాహారం అందించాలంటే స్వామినాథన్ సిఫారసులను అమలు చేయటమే ప్రభుత్వాల ముందున్న ఏకైక మార్గం.
(ఎం.ఎస్.స్వామినాథన్ శత జయంతి సంవత్సరం)
బొంతు రాంబాబు
9490098205
ఆకలి లేని సమాజం ఆయన కల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES