Tuesday, November 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆయన జీవితమే..ఓ పోరాటం…

ఆయన జీవితమే..ఓ పోరాటం…

- Advertisement -

కామ్రేడ్‌ బత్తుల భీష్మారావు నలభయ్యవ వర్థంతి సందర్భంగా ఆయనకు మొదటగా నా విప్లవ జోహార్లు. ఆయన జీవిత చరిత్రని, ఉద్యమ ఘట్టాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావడంలో కామ్రేడ్‌ హైమావతి (భీష్మారావు భార్య) చొరవకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు.నేను కామ్రేడ్‌ భీష్మారావు గురించి చెప్పే అంత అనుభవం, వ్యక్తిగత పరిచయం నాకు లేవు. కానీ, ఉమ్మడి భద్రాచలం నియోజకవర్గం చింతూరు మండలంలో అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల క్యాంపెయిన్‌కి ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం నుండి పార్టీ అక్కడ పని చేయాలని నిర్ణయించి నన్ను పంపింది. ఆ సందర్భంలో భద్రాచలం కేంద్రంగా విద్యార్ధి ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో కామ్రేడ్‌ భీష్మారావు గురించి ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో నేను గమంచిన కొన్ని విషయాలను ఈ సందర్భంగా పంచుకోవడం సముచితమని భావిస్తున్నాను.

ఆనాడు భద్రాచలం డివిజన్‌లో రాజకీయ శిక్షణా తరగతుల సందర్భంగా కామ్రేడ్‌ చందర్రావ్‌, భీష్మారావు బలిదానం గురించి చెబుతుంటే, బాగా ప్రేరణ పొందాము. జిల్లా విద్యార్థి ఉద్యమం రీత్యా ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లిన తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల పనిలో పార్తీ చింతూరు పంపగా, అన్ని గ్రామాలు పర్యటన చేయడానికి మంచి అవకాశం దొరికింది. చందర్రావు, భీష్మారావులతో అనుబంధం ఉన్నకొద్ది మంది ఆనాటి బ్యాంబు కార్మికుల పోరాటాలు, సంతల్లో గిరిజనులకు జరిగే మోసాలపైన, అమాయక ఆదివాసీ యువతులను లొంగదీసుకుని లైంగిక వేధింపులకు నిరసనగా చేసిన పోరాటాలు, ఎదురైన నిర్బంధం గురించి వింటున్న సమయంలో ప్రజల పట్ల వారికున్న అంకితభావం ఎంతగొప్పదో తెలిసింది. ముఖ్యంగా ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయా లపై వారి పోరాట పటిమ స్ఫూర్తిని చ్చింది.అంతే కాక కామ్రేడ్‌ హైమావతి ఒక సందర్భంలో మన పార్టీ వాళ్లకు చింతూరులో ఇల్లు అద్దెకివ్వడానికి, హోటల్‌లో చారు ఇవ్వకుండా కాంగ్రెస్‌ గుండాగిరి ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టిందో చెబుతుంటే వారి అరాచకాలు, ఎర్రజెండా అంటే వారికి ఎంత వణుకో అర్థమైంది.

అదే చింతూరు మండల కేంద్రం గ్రామ పంచాయతీని కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం నుండి బద్దలు కొట్టి సీపీఐ(ఎం)అభ్యర్థి కుంజా జానకమ్మని గెలిపించి కామ్రేడ్‌ భీష్మారావు, చందర్రావులకు అంకిత మివ్వడం మరచిపోలేనిది. అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్‌ని ఎదుర్కోవడం ఛాతకాని, చావలేని పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నగ్జలైట్స్‌ ప్రజల పట్ల నిజాయితీగా ,చిత్తశుద్దితో పని చేస్తున్న సీపీఐ(ఎం) అంటే ఎందుకంత కసిగా ఉండేవారో గ్రామాల్లో ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు, పుస్తకాల్లో చదువుకున్న దానికి మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. చింతూరు మండలం అప్పటి మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉన్నది.చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నగ్జలైట్స్‌ బలంగా ఉండేవారు. అక్కడి నుండి చింతూరు మండల పరిసర గ్రామాల్లోకి ప్రవేశానికి గ్రామాలన్నింటిలో సీపీఐ(ఎం) బలంగా ఉన్నందువల్ల ఆటంకాలు ఏర్పడ్డాయి.పక్క రాష్ట్రాల్లో నిర్బంధం ఉన్న సందర్భంలో, అలాగే చింతూరు మండల సరిహద్దు గ్రామాలను స్థావరాలుగా మార్చుకోవడానికి వారికి సీపీఐ(ఎం) ప్రధాన అడ్డంకిగా ఉన్నది.

నగ్జలైట్స్‌లది దారి ాతప్పిన సిద్ధాంతామని, వారి ఆచరణ మొత్తం బూర్జువా పాలక వర్గాలకు సహాయపడేదని కామ్రేడ్‌ చందర్రావు, భీష్మారావు ప్రజలకు గ్రూప్‌ మీటింగ్‌లు,గ్రామ జనరల్‌ బాడీ సమావేశాల్లో చెబుతూ వారిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని స్పష్టంగా చెప్పేవారు. దీనితో సీపీఐ(ఎం) నాయకులుగా ఉన్న వీరు టార్గెట్‌ అయ్యారు. టార్గెట్‌లో ఉన్నామని తెలిసినా గ్రామాలకు రెగ్యులర్‌గా ప్రజల దగ్గరకు వెళ్లి కలుసుకునేవారు.గ్రామ ప్రజలే రక్షక దళాలుగా నాయకులకు అండగా ఉండేవారు. వారిమీద ఈగ వాలనిచ్చేవారు కాదు. రాష్ట్ర విభజన తర్వాత కామ్రేడ్‌ సున్నం రాజయ్య రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చెసినప్పుడు కామ్రేడ్‌ హైమావతి చింతూరు మండలంలో ఎన్నికల పనికోసం రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు వచ్చిచేస్తున్న సమయంలో నేను కూడా హైమావతితో కలిసి పని చేశాను. ఆమె ఏ గ్రామానికి వెళ్లినా గ్రామప్రజలు,మన పార్టీ శ్రేణులు దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడిన విషయాలు, భీష్మారావు పోరాట నేపథ్యం చెబుతుంటే బాగా ఆసక్తిగా విన్నాను.వారి కుటుంబాల్లో పిల్లలకు చందర్రావు, భీష్మారావు పేర్లు పెట్టుకున్నారంటేనే వారి పట్ల ఆదివాసీ ప్రజల గుండెల్లో ఎంతగా పాతుకుపోయారో అర్థమైంది.

తునికాకు రేట్లు,వ్యవసాయ కూలీ రేట్లు, సంతల్లో మోసాలు, పాలకపార్టీల వర్గ స్వభావం తదితర అంశాలను సాధారణ ఆదివాసులకు కూడా అర్థమయ్యే పద్ధతిలో వారు వివరించి,పోరాటాలకు పురిగొల్పిన కారణంగా వందల మంది కార్యకర్తలు ఉద్యమానికి తయారయ్యారు. అంతేకాదు, వారి స్ఫూర్తిని పొందిపనిచేస్తున్న సందర్భంలో కామ్రేడ్‌ శ్యామల వెంకటరెడ్డి,పట్రా ముత్యం,కుంజా సీతారామయ్య, బ్రహ్మయ్య, ప్రజానాట్యమండలి కామ్రేడ్‌ నగ్జలైట్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయారు.అయినప్పటికీ సీపీఐ(ఎం)ని ఏమీ చేయలేకపోయారు.అంతకంతకు ఉద్యమం పెరిగి చింతూరు మండలంలో సీపీఐ(ఎం) ఒక్కటే ఒకవైపు ఉంటే,మిగిలిన అన్ని పార్టీలు (అఖరుకు సీపీఐ కూడా) ఒక పక్కన ఉండేవాళ్లు. వీరంతా కలిసి ఏ ఎన్నికల్లో పోటీచేసినా సీపీఐ(ఎం) మాత్రమే ఘన విజయం సాధించేది. ఈ విజయాలకు చందర్రావు,భీష్మారావు తదితర నాయకుల త్యాగాలే తప్ప మరొకటి కాదు.వీరి పోరాటాలతో స్ఫూర్తి పొందిన నాలాంటివాళ్లు నేటికీ ఉద్యమానికి అంకితమై పనిచేస్తున్నారు.

కామ్రేడ్‌ భీష్మారావు కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నది. అనేక సందర్భాల్లో ఉద్యమంలో పనిచేయాల్సిన అవసరాన్ని, అధ్యయనం ఆవశ్యకతని, కార్యకర్తల తయారీ గురించి అనేక విలువైన సూచనలను హైమావతి చేశారు.కొడుకు లెనిన్‌, కోడలు ప్రశాంతి, కూతురు సృజనతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి ఉద్యమంలో పనిచేశాం. అల్లుడు మహీధర్‌ మా కంటే సీనియర్‌. ఇంటికి ఎప్పుడు వెళ్లినా ఆప్యాయంగా,ఆత్మీయంగా పలకరించేవారు.కుటుంబ సంబంధాలు కూడా ఉద్యమ సంబంధాలుగా, ఏకష్టం వచ్చినా ఉద్యమంలో కానీ, వ్యక్తిగతంగా కానీ పంచుకునే లక్షణం ఉండేది.కొండంత అండ, ధైర్యం కార్యకర్తలకు కనిపించేది. ఏ నగ్జలిజం బండారు చందర్రావు, భీష్మా రావును పొట్టన పెట్టుకుందో ఆ నగ్జలిజం ఎంచుకున్న మార్గం తప్పని మార్క్షిస్ట్‌ పార్టీ చెబు తుందో,అది అక్షరాల నేడు జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై,ప్రత్యేకించి బీజేపీ మనువాద సిద్ధాంతం, ఆర్థిక విధానాలైన జంట ప్రమాదాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచి,ప్రజా పోరాటాలను ఉధృతం చేయడమే కామ్రేడ్‌ భీష్మారావుకి ఇచ్చే నిజమైన నివాళి.
(నవంబర్‌ 5న కామ్రేడ్‌ భీష్మారావు 40వ వర్థంతి)

ఎ.జె.రమేష్‌
9490098203

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -