నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించారు. మిజోరాంలోని బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మిజోరాంకు రాలేకపోయినందుకు క్షమించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భగా మోడీ మాట్లాడుతూ … ఈ ప్రాజెక్ట్ కేవలవం రైల్వే కనెక్షన్ కంటే ఎక్కువ అని, ఇది మిజోరాం పరివర్తనకు జీవనాడిగా అభివర్ణించారు. ఇది జీవితాలను, జీవనోపాధిని విప్లవాత్మకంగా మారుస్తుందన్నారు. రైతులు, వ్యాపారాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే పర్యాటకం, రవాణా రంగాల్లో.. ఉపాధి అవకాశాలు సృష్టించడానికి వీలు కల్పిస్తుందని వివరించారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చెప్పారు.
2025-26 మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి చెందిందని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఎగుమతుల పురోగతే కారణం అని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మేడ్-ఇన్-ఇండియా ఆయుధాలే కీలక పాత్ర పోషించాయన్నారు. ఇక జీఎస్టీ సంస్కరణలను కూడా ప్రధాని ప్రశంసించారు. అనేక ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గిందని, దీంతో పేద కుటుంబాలపై భారం తగ్గిందని చెప్పారు.
టూత్‌పేస్ట్, సబ్బు, నూనె, నిత్యావసర వస్తువులపై ఇప్పుడు 5 శాతమే జీఎస్టీ ఉందని అన్నారు. తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు కూడా తగ్గాయని వెల్లడించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు రైల్వే లైన్ వేసే ప్రాజెక్టుకు ప్రధాని మోడీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటివరకు మిజోరంలోని బైరాబి వరకు మాత్రమే రైల్వే లైను ఉండేది. అసోం సరిహద్దుకు సమీపంలోని ఈ స్టేషన్ వరకు లైన్ ఉన్నప్పటికీ మిజోరం ప్రజలకు పెద్దగా ఉపయోగం లేకపోవడంతో, రాజధాని ఐజ్వాల్‌ను కలిపే లక్ష్యంతో ఈ బైరాబి నుంచి ఐజ్వాల్ పక్కనుండే సారురంగ్‌కు లైన్ ప్రాజెక్ట్ చేపట్టారు. రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చయ్యింది. ఈ ప్రాజెక్ట్ రాజధానికి రైల్ కనెక్టివిటీ ఏర్పడింది.