Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాకతీయుల కంటే ముందే ఆదివాసీ దేవతల చరిత్ర

కాకతీయుల కంటే ముందే ఆదివాసీ దేవతల చరిత్ర

- Advertisement -

తెర ముందుకు మేడారం జాతర కొత్త చరిత్ర
కాకతీయులతో వీర వనితల యుద్ధం అవాస్తవం
నవతెలంగాణతో సమ్మక్క సారలమ్మ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫౌండర్‌, పరిశోధకులు
మైపతి అరుణ్‌ కుమార్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయప్రతినిధి

ఆదివాసీ వీర వనితలు, కాకతీయులతో యుద్ధం చేసి చనిపోలేదని.. అసలు కాకతీయుల చరిత్రతో మేడారం సమ్మక్క, సారలమ్మకు ఎలాంటి సంబంధం లేదని సమ్మక్క, సారలమ్మ రీసెర్చ్‌ ఇన్సిట్యూట్‌ ఫౌండర్‌, పరిశోధకులు మైపతి అరుణ్‌ కుమార్‌ నవతెలంగాణ ప్రతినిధికి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అరుణ్‌ కుమార్‌ను ‘నవ తెలంగాణ’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మేడారం చరిత్ర పరిశోధనలో వెల్లడైన విషయాలను వివరించారు. సమ్మక్క, సారలమ్మ.. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడితో యుద్ధం చేసి మరణించినట్టు జరిగిన ప్రచారం తప్పేనని అంగీకరించారు. సమ్మక్క, సారలమ్మ చరిత్ర క్రీస్తు పూర్వం 9,030 నాటిదని వివరించారు. సమ్మక్క, సారలమ్మ చరిత్రపై 15 ఏండ్లుగా పరిశోధనలు చేసినట్టు చెప్పారు. మొత్తం 30 మంది పరిశోధకులం ఈ పరిశోధనలో భాగస్వాములయ్యామని తెలిపారు. 101 రాజ్యాలను సమ్మక్క పాలించినట్టు చెప్పారు. సమ్మక్క, సారలమ్మ పూర్వీకుల చరిత్ర బేరంబోయిన రాజు నుంచి ప్రారంభమైందని, ఈయనే వంశవృక్షాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బేరంబోయిన రాజుకు ఆరుగురు కుమార్తెలు. ఒక్కో కుమార్తె వివాహం చేసి ఒక్కో వంశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాయబండని రాజు, రసమలాదేవిలకు మేడరాజు, సాంబశివ మహారాజు అనే ఇద్దరు కుమారులున్నారు. మేడరాజుకు సందం బోయిరాలు, కనకం బోయిరాలు అనే ఇద్దరు భార్యలున్నారు. సందం బోయిరాలుకు బిడ్డలు లేరు. తనకు బిడ్డలు కావాలని బేరంబోయిన రాజును వేడుకుంటుంది. బేరంబోయిన రాజు ఆదేశాలతో సాంబశివ మహారాజు, తూలముత్తికి పుట్టిన సమ్మక్కను చిలకలగుట్టపై వెదురువనంలో పుట్ట వద్ద పెట్టి వస్తారు. ఆ బిడ్డను మేడరాజు, సందం బోయిరాలు తెచ్చుకొని తమ బిడ్డగా పెంచుతారు. సమ్మక్కది 5వ గొట్టు అని వివరించారు. మేడరాజు రెండో భార్యకు కనకం బోయిరాలుకు కూతురు నాగులమ్మ, కమారుడు జంపయ్య ఉన్నారు. సమ్మక్కను కొత్తగూడ మండలం పూనుగొండ్లకు చెందిన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయిస్తారు. ఇందుకు సమ్మక్క అంగీకరించకపోవడంతో రెండో బిడ్డ నాగుల మ్మను పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. అనంతరం సమ్మక్క పగిడిద్దరాజును అంగీకరిం చడంతో ఆయన్ను వివాహమాడింది. పగిడిద్దరాజు 4వ గొట్టు. గోవిందరాజులు.. పగిడిద్దరాజు తమ్ముడు. కానీ గతంలో గోవిందరాజులు సారలమ్మ భర్తగా ప్రచారం జరిగింది. ఇది వాస్తవం కాదన్నారు. సమ్మక్కకు సారలమ్మ అనే కూతురు పుట్టింది. సారలమ్మది 3వ గొట్టు. నాగుల మ్మకు జంపన్న, మూయన్న అనే ఇద్దరు కుమారులున్నారు.

సమ్మక్క, సారలమ్మ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 15 ఏండ్లుగా పరిశోధనలు చేసి వెలికి తీసిన వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియచేయాలని ప్రయత్నిస్తున్నట్టు అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబమే నేటి గద్దెలు, ప్రాకారాలు అని, ఆదివాసీ గొట్టు, వంశవృక్షం, జీవన విధానమే మేడారం గద్దెల చుట్టూ ప్రాకారాల వైట్‌ గ్రానైట్‌ స్తంభాలపై, సాండ్‌ స్టోన్‌పై చిత్రించినట్టు చెప్పారు. గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన 8 వైట్‌ గ్రానైట్‌ స్తంభాలపై ఒక్కో స్తూపంపై 27 బొమ్మలను చిత్రీకరించినట్టు తెలిపారు. ఇందు లో వారి వంశవృక్షం, వారు పూజించిన పక్షులు, జంతువుల బొమ్మలను చెక్కారు. ప్రాకారం మధ్యలో ఉన్న 4 గద్దెల చుట్టూ 940 బొమ్మలను చెక్కారు. వైట్‌ గ్రానైట్‌ రాతి స్తంభాలను ప్రాకారంలో 8 గేట్లకు ఏర్పాటు చేశారు. వైట్‌ గ్రానైట్‌ స్తంభాలపై 2,500 బొమ్మలు, సాండ్‌ స్టోన్‌ పలకలపై 4,500 బొమ్మలు మొత్తం 7,000 బొమ్మలను చెక్కారు. వీటిపై స్వస్తిక్‌ గుర్తు కూడా చెక్కి ఉంది. స్వస్తిక్‌ను శక్తి రూపం గానే చూస్తామన్నారు. సాండ్‌ స్టోన్‌ పలకలపై బయట వైపు ఆదివాసీల జావా విధానం, వ్యవసాయం, వృత్తులు, వారి పరికరాలను చెక్కారు. సాండ్‌ స్టోన్‌ బయటి వైపు గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, పడిగే కొమ్ములను చెక్కారు. మొత్తం 41 సాండ్‌ స్టోన్‌ పలకలను ప్రాకారంలో అమర్చారు. ఏదేమైనా ఆదివాసీ పరిశోధకులు వెలికితీసిన అంశాలు సమ్మక్క, సారలమ్మ నూతన చరిత్రను బహిర్గతం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -